
సాక్షి, న్యూఢిల్లీ : గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్‌పై మోదీ ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ చల్లటి కబురు చెప్పారు. దేశానికి వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అవసరమని ఆయన తెలిపారు. అయితే.. పేద, ధనిక రాష్ట్రాల మధ్య తేడాలను గుర్తించి జీఎస్టీని వికేంద్రీకరణ చేయాలని ఆయన కేంద్రానికి సూచించారు. కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్నును అమలు చేయడం అత్యంత ముఖ్యమైన ఘట్టంగా ఆయన అభివర్ణించారు. నూతన పరోక్ష పన్నుల విధానమైన జీఎస్టీని సక్రమంగా అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆయన చెప్పారు.
ప్రస్తుత విధానంలో ఆర్థికంగా పరిపుష్టమైన మహరాష్ట్రకు, పేద రాష్ట్రమైన బిహార్‌కు ఒకే విధమైన జీఎస్టీ విధానం మంచిది కాదని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో జీఎస్టీని వికేంద్రీరించి అమలు చేస్తే మంచిదని ఆయన కేంద్రానికి సూచించారు.