వస్తు, సేవల పన్ను (GST) శ్లాబ్‌లను మరింత సరళీకరించాలని జీఎస్టీ కౌన్సిల్ యోచిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సరళమైన, క్రమబద్ధమైన పన్నుల వ్యవస్థ లక్ష్యంగా చేసుకుని జీఎస్టీ శ్లాబుల సంఖ్యను తగ్గించడం, రేట్లను హేతుబద్ధీకరించడాన్ని కౌన్సిల్ పరిశీలిస్తోందని మంత్రి హింట్ ఇచ్చారు.
ప్రస్తుతం జీఎస్టీ వ్యవస్థలో 5%, 12%, 18%, 28% అనే నాలుగు అంచెలు ఉన్నాయి. ప్యాక్ చేసిన ఆహారం వంటి నిత్యావసర వస్తువులపై అత్యల్పంగా 5 శాతం, లగ్జరీ వస్తువులు వంటివాటిపై అత్యధికంగా 28 శాతం పన్ను విధిస్తున్నారు. ఇప్పటికే కొన్ని శాఖలు, వ్యాపార సంఘాల నుంచి ఈ శ్లాబ్‌ల సవరణకు సంబంధించి చాలా ప్రతిపాదనలు వస్తున్నాయి. ఈ శ్లాబ్‌ల సంఖ్యను తగ్గించేలా రానున్న జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకుంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ రేట్లను తగ్గిస్తారని అభిప్రాయపడుతున్నారు.
సామాన్యులపై భారం పడకుండా..
జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరించడం, వాటిని సరళతరం చేసే కార్యక్రమాలు దాదాపు మూడేళ్లుగా కొనసాగుతున్నట్లు ఆర్థిక మంత్రి ఉద్ఘాటించారు. జీఎస్టీ రేట్లలో మార్పులు, శ్లాబులను తగ్గించేందుకు మంత్రుల బృందాన్ని (GoM) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిత్యావసర వస్తువులపై రేట్ల సవరణ వల్ల సామాన్యులపై భారం పడకుండా పన్ను వ్యవస్థను నిష్పక్షపాతంగా ఉండేలా చూడాల్సిన అవసరాన్ని నిర్మలా సీతారామన్ నొక్కి చెప్పారు. జీఎస్టీ సమీక్ష పరిధిని విస్తృతం చేశామని పేర్కొన్నారు. ప్రతిపాదిత మార్పులపై జీఎస్టీ కౌన్సిల్ త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: 5జీ స్పెక్ట్రమ్ వేలానికి మార్గం సుగమం
ఎన్నికల వేళ నిర్ణయాలపై విమర్శలు
2025-26 కేంద్ర బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజలకు గణనీయమైన ఆదాయపు పన్ను ఉపశమనం లభించింది. దేశ ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయని, నిర్మాణాత్మక ఆర్థిక మందగమనం లేదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో జరగబోయే ఎన్నికలను ప్రభావితం చేయడమే లక్ష్యంగా పన్ను మినహాయింపు ఉందన్న ఊహాగానాలను ఆమె తోసిపుచ్చారు. జీఎస్టీ శ్లాబుల తగ్గింపుతో నిత్యావసర వస్తువులు, సేవల ధరలు తగ్గడం ద్వారా వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు భావిస్తున్నారు. పన్ను వ్యవస్థను సరళతరం చేసి మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ విస్తృత లక్ష్యానికి ఇది తోడ్పడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment