ప్రభుత్వాన్ని కోరిన జీజేసీ
రత్నాభరణాల పరిశ్రమలో ఉత్పత్తవుతున్న వస్తువులపై జీఎస్టీని తగ్గించాలని ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (GJC) ప్రభుత్వాన్ని కోరింది. జీఎస్టీకి సంబంధించి రాబోయే బడ్జెట్‌లో తీసుకోబోయే నిర్ణయాలపై వివిధ విభాగాల నుంచి ప్రభుత్వం వినతులు కోరింది. అందులో భాగంగా జీజేసీ రత్నాభరణాల ఉత్పత్తిపై జీఎస్టీని తగ్గించాలని తెలిపింది.
ఈ సందర్భంగా జీజేసీ ఛైర్మన్ రాజేశ్ రోక్డే మాట్లాడుతూ..‘జెమ్స్ అండ్ జువెలరీ రంగం ఉత్పత్తి చేస్తున్న వస్తువులపై జీఎస్టీ(GST)ని 1 శాతానికి తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరాం. ప్రస్తుతం అది 3 శాతంగా ఉంది. జీఎస్టీని తగ్గిస్తే వినియోగదారులపై వ్యయ భారం తగ్గుతుంది. రాబోయే బడ్జెట్లో వ్యాపారాలకు, తయారీ రంగానికి ఊతమిచ్చేలా పన్నుల హేతుబద్ధీకరణ ఉండాలని తెలియజేశాం. వరుసగా పెరుగుతున్న బంగారం రేట్లకు అనుగుణంగా ప్రస్తుత జీఎస్టీ రేటు అంతకంతకూ పెరుగుతోంది. ఇది పరిశ్రమకు, అంతిమ వినియోగదారులకు భారంగా మారుతోంది. సహజ వజ్రాలు, ల్యాబ్‌లో తయారు చేసే వజ్రాలకు మధ్య తేడా గుర్తించేలా పకడ్బందీ విధానాలు ఉండాలి. ప్రస్తుతం సహజ వజ్రాలు(Natural diamonds), ప్రయోగశాలలో తయారు చేసే వజ్రాలపై ఒకే జీఎస్టీ రేటు ఉంది. ల్యాబ్‌లో తయారు చేసే వజ్రాలపై జీఎస్టీ తగ్గించాలి’ అన్నారు.
ఇదీ చదవండి: అమెజాన్ తొలి రాకెట్ ప్రయోగం.. స్పేస్‌ఎక్స్‌కు ముప్పు?
ఆభరణాల కొనుగోలుపై ఈఎంఐ
జ్యువెలరీ పరిశ్రమకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలని, రాష్ట్రాల వారీగా స్పెషల్ నోడళ్లను ఏర్పాటు చేయాలని జీజేసీ ప్రభుత్వాన్ని కోరింది. ఆభరణాల కొనుగోలుపై ఈఎంఐను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఎప్పటినుంచో కోరుతున్నట్లు జీజేసీ తెలిపింది. వచ్చే సమావేశాల్లో ఈమేరకు నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. పన్ను రేటు తగ్గింపు వల్ల గ్రామీణ ప్రాంతాల్లో అధికారిక కొనుగోళ్లు పెరుగుతాయని జీజేసీ వైస్ ఛైర్మన్ అవినాష్ గుప్తా అన్నారు. ఆర్థిక వ్యవస్థలో నిరుపయోగంగా ఉన్న గృహ బంగారాన్ని వెలికితీసే కొత్త విధానాలు ప్రవేశపెట్టాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment