న్యూఢిల్లీ: కొత్త బ్యాంకు లెసైన్సు దరఖాస్తులను రిజర్వ్ బ్యాంక్ చురుగ్గా పరిశీలిస్తోంది. ఇది పూర్తయిన తర్వాత మిగతా ప్రక్రియపై ఎక్స్‌టర్నల్ కమిటీ దృష్టి సారించనుంది. ఏఐఎంఏ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆర్‌బీఐ మాజీ గవర్నర్, ప్రతిపాదిత అత్యున్నత స్థాయి సలహాదారు కమిటీ (హెచ్‌ఎల్‌ఏసీ) చైర్మన్ బిమల్ జలాన్ ఈ విషయాలు తెలిపారు. కొత్త బ్యాంకు లెసైన్సుల కోసం దాదాపు 26 దరఖాస్తులు వచ్చాయని వీటిని ఆర్‌బీఐ తొలిదశ సూట్నీ ప్రక్రియను పూర్తి చేసిందని తెలిపారు. దీనిపై ఏరకంగా ముందకు వెళ్లాలనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు.
అనిల్ అంబానీ, కుమార మంగళం బిర్లా, టాటా వంటి పారిశ్రామిక దిగ్గజాల కంపెనీలు కూడా వీటి కోసం దరఖాస్తు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గడిచిన 20 ఏళ్లలో ఆర్‌బీఐ రెండు విడతలుగా ప్రైవేట్ రంగంలో 12 బ్యాంకులకు లెసైన్సులు ఇచ్చింది. తాజాగా కొత్త లెసైన్సులు ఇచ్చే ప్రక్రియను మరోసారి ప్రారంభించిన నేపథ్యంలో బిమల్ జలాన్ సారథ్యంలోని కమిటీ దీన్ని పర్యవేక్షిస్తుందని ఆర్ బీఐ కొత్త గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రకటించారు.