న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ నుంచి రూ 1.76 లక్షల కోట్ల మిగులు నిధులు సమకూరడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ఆర్బీఐ నుంచి ప్రభుత్వం మిగులు నిధులను లూటీ చేసిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని, ఆర్థిక మంత్రి తమకు తాము ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేయడం నుంచి ఎలా బయటపడాలో దిక్కుతోచక ఆర్బీఐ నుంచి నిధుల చోరీకి పాల్పడిన తీరు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోదని అన్నారు. ఆస్పత్రి నుంచి బ్యాండ్‌ఎయిడ్‌ను దొంగిలించి కాల్పుల గాయంపై అమర్చినట్టే ఈ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. గృహనిర్మాణం నుంచి తయారీ రంగం వరకూ అన్ని రంగాల్లో ఆర్థిక మందగమనం నెలకొన్న సమయంలో ఆర్బీఐ నుంచి కేంద్ర ప్రభుత్వానికి పెద్దమొత్తంలో నగదు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కేంద్ర బ్యాంక్ నుంచి ప్రభుత్వానికి సమకూరే రూ 1.76 లక్షల కోట్లలో రూ 1.23 లక్షల కోట్లు డివిడెండ్ కాగా, రూ 52,460 కోట్లు మిగులు నిధుల నుంచి ఆర్బీఐ ప్రభుత్వానికి అందచేస్తోంది. ఆర్బీఐని ఈరకంగా దోపిడీ చేయడం మన ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలయ్యేందుకు, బ్యాంకు క్రెడిట్ రేటింగ్ తగ్గేందుకు దారితీస్తుందని కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment