సాక్షి, న్యూఢిల్లీ : ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదంపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో మోదీ సర్కార్ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. ఆర్బీఐ కీలక బోర్డు భేటీ నేపథ్యంలో రాహుల్ స్పందన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోదీ, ఆయన సంపన్న సహచరుల కోటరీ వ్యవస్థలను నాశనం చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నాయని రాహుల్ ట్వీట్ చేశారు.
ఆర్బీఐ బోర్డు భేటీలోనూ తన భజనపరుల ద్వారా కేంద్ర బ్యాంక్‌ను విచ్ఛిన్న చేసేందుకు మోదీ ప్రయత్నిస్తారని వ్యాఖ్యానించారు. మోదీ కుయుక్తులకు ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్, ఆయన బృందం దీటుగా బదులిస్తుందని తాను భావిస్తున్నానన్నారు. మోదీని తన హద్దుల్లో ఉంచేలా వీరు కట్టడి చేస్తారనే విశ్వాసం తనకుందన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నుంచి కేంద్ర బ్యాంక్‌ను కాపాడుతున్నారని రాహుల్ ఇటీవల ఆర్బీఐ చీఫ్ ఊర్జిత్ పటేల్‌కు కితాబిచ్చిన సంగతి తెలిసిందే. తన వ్యవస్థలను బీజేపీ, ఆరెస్సెస్‌లు కబళించడానికి భారత్ ఎన్నడూ అనుమతించదని స్పష్టం చేశారు. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయని ఈ ఏడాది అక్టోబర్ నుంచి పలు వార్తలు వెలువడుతున్న క్రమంలో కేంద్ర బ్యాంక్ చీఫ్‌గా ఊర్జిత్ పటేల్ వైదొలగుతారనే ప్రచారం సాగింది.
Comments
Please login to add a commentAdd a comment