బెంగళూరు: వచ్చే సార్వత్రిక ఎన్నికల పోరాటాన్ని ‘భారత్‌కు, ప్రధాని నరేంద్ర మోదీకి మధ్య జరగబోయే పోరు’గా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ అభివర్ణించారు. ‘‘ఇండియాపై యుద్ధానికి దిగితే అందులో అంతిమ విజయం ఎవరిదో అందరికీ తెలుసు. ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, భారత్ అనే భావనతో పోరాడే సత్తా ఎవరికీ లేదు.
ఆ భావనను వ్యతిరేకించే, దానిపై పోరాడే వారికి ఏ గతి పడుతుందో కూడా అందరికీ తెలుసు’’ అని ఆయనన్నారు. ‘‘చరిత్రే ఇందుకు సాక్ష్యం. భారత్ అనే భావనతో ఎవరూ పోరాడలేకపోయారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలు భారత్ అనే భావనకు, బీజేపీ అనే భావనకు మధ్య జరిగే పోరు. రాజ్యాంగాన్ని, దేశ ప్రజల గళాన్ని, భారత్ అనే భావనను కాపాడేందుకు పాటుపడుతున్నాం. అందుకే... మా పోరాటం ‘ఇండియా’ కూటమి వర్సెస్ బీజేపీ. ఇండియా వర్సెస్ మోదీ’’ అని వివరించారు.
విపక్షాల బెంగళూరు భేటీ అత్యంత ఫలప్రదంగా జరిగినట్టు రాహుల్ వెల్లడించారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా తక్షణం రంగంలోకి దిగాలని విపక్ష పార్టీ లన్నీ నిర్ణయించినట్టు తెలిపారు. ‘‘ఇందుకోసం అతి త్వరలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నాం. కూటమి భావజాలం, కార్యక్రమాలు తదితరాలన్నీ త్వరలో నిర్ణయించి వెల్లడిస్తాం’’ అని వివరించారు. బీజేపీ, వారి భావజాలంపై విపక్షాల ఉమ్మడి పోరాటానికి దీన్ని నాందిగా అభివరి్ణంచారు. ‘‘వాళ్లు దేశంపై దాడి చేస్తున్నారు. నిరుద్యోగం పెచ్చరిల్లింది. కోట్లాది మంది నుంచి దేశ సంపదను లాక్కొని కొద్ది మంది మోదీ మిత్రులపరం చేస్తున్నారు’’ అని మండిపడ్డారు.
ఆ పేరెలా వచ్చిందంటే...
మంగళవారం నాటి విపక్షాల మేధోమథనం సందర్భంగా కూటమికి ఇండియా అనే పేరు ఎలా వచ్చిందో రాహుల్ వివరించారు. ‘‘జరుగుతున్నది రెండు భిన్న భావజాలాల మధ్య పోరాటం. అందుకే పోరాటం ఏమిటి, ఎవరి మధ్య అనే కీలకాంశాలపై మేం చర్చిస్తున్న క్రమంలో అనుకోకుండా ఇండియా అనే పేరు దానంతట అదే తెరపైకి వచ్చింది.
ఎందుకంటే జరగబోయేది రెండు రాజకీయ కూటముల పోరాటం కాదు. భారత్ అనే భావనను కాపాడుకునేందుకు చేయబోయే యుద్ధమది. అందుకే ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్–ఇండియా అనే పేరు ఖరారు చేశాం’’ అని వెల్లడించారు. ‘‘భారత్ మరోసారి ఏకమవుతుంది. ‘ఇండియా’ గెలుస్తుంది’’ అంటూ అనంతరం రాహుల్ హిందీలో ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment