కేంద్రం నిర్ణయం ప్రమాదకరం | Rahul Gandhi Comments About RBI Funds to Central Govt | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐని దోచుకుంటోంది

Published Wed, Aug 28 2019 4:50 AM | Last Updated on Wed, Aug 28 2019 8:01 AM

Rahul Gandhi Comments About RBI Funds to Central Govt - Sakshi

న్యూఢిల్లీ/పుణే: రూ.1.76 లక్షల కోట్ల మిగులు నిల్వలను ప్రభుత్వానికి ఆర్‌బీఐ బదిలీ చేయడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఆర్థిక విపత్తును ఎదుర్కోవడం చేతకాకనే, ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడుతోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. తుపాకీ గాయానికి ఆస్పత్రి నుంచి బ్యాండ్‌ఎయిడ్‌ను ఎత్తుకుపోవడం ఇలాంటిదేనని వ్యాఖ్యానించారు. ‘ప్రధాని, ఆర్థిక మంత్రి వారు సృష్టించిన ఆర్థిక విపత్తును పరిష్కరించడం చేతకాక ఆర్‌బీఐ డబ్బును దోచుకుంటున్నారు. తుపాకీ బుల్లెట్‌ గాయం మాన్పటానికి ఆస్పత్రి నుంచి బ్యాండ్‌ ఎయిడ్‌ దొంగిలించడం వంటిదే ఇది. ప్రభుత్వ చర్య ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టేందుకు ఎంతమాత్రం సాయపడదు’అని ‘ఆర్‌బీఐ లూటెడ్‌ ’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

దేశ ఆర్థిక వ్యవస్థ వాస్తవ పరిస్థితులపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్‌ ప్రతినిధి ఆనంద్‌ శర్మ డిమాండ్‌ చేశారు. ఆర్‌బీఐ మిగులు నిధులను వాడుకోవాలన్న ప్రభుత్వం నిర్ణయం ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఈ చర్య ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను దివాళా దిశగా, ఆర్థిక అత్యవసర పరిస్థితివైపు ప్రభుత్వం తీసుకెళుతోందన్నారు. ప్రభుత్వ చర్య ఆర్థిక అప్రమత్తతా లేక ఆర్థిక బలిదానమా అని కాంగ్రెస్‌ మరో ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. బడ్జెట్‌ గణాంకాల్లో కనిపించకుండా పోయిన రూ.1.76 లక్షల కోట్లకు సంబంధించిన లెక్క ఆర్‌బీఐ నుంచి తీసుకున్నదేనా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ నేత సంజయ్‌ ఝా ట్విట్టర్‌లో.. ‘ఆర్‌బీఐ అంటే రాబ్డ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’అంటూ ఎద్దేవా చేశారు.

ప్రభుత్వం చేస్తున్న పనే ఇది: ఏచూరి
ప్రభుత్వానికి ఆర్‌బీఐ నగదు బదిలీ చేయడంపై సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్ర విమర్శలు చేశారు. ఆర్‌బీఐ లాభాల్లో 99 శాతం వరకు ప్రభుత్వమే లాగేసుకునే తంతు 2014 నుంచి నడుస్తోందని ఆరోపించారు. ఆఖరి అవకాశంగా మాత్రమే ఆర్‌బీఐను వాడుకోవాల్సి ఉండగా ప్రభుత్వం మాత్రంఇష్టారాజ్యంగా నిధులను మళ్లించటాన్ని ఆయన తప్పుపట్టారు. మోదీ స్నేహితులు లూటీ చేసిన బ్యాంకులకు అందించేందుకే రూ.1.76 లక్షల కోట్లను ప్రభుత్వం వినియోగించనుంది. ప్రజల జీవితాలతోపాటు ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వం సాగిస్తున్న ‘కనికరం లేని దాడి’ని నిరసిస్తూ ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులను ఆయన ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వ విధానాల కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని, ప్రభుత్వరంగ ‘నవరత్నాలు’ఇందుకు జత కలిశాయని ఆయన పేర్కొన్నారు.

రాహుల్‌ వాస్తవాలు తెలుసుకో : నిర్మలా
ఆర్‌బీఐ నిధులను ప్రభుత్వం దొంగిలిస్తోందన్న రాహుల్‌ విమర్శలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. ఇటువంటి విమర్శలను తాను పట్టించుకోబోనని, ఆరోపణలు చేసే ముందు రాహుల్‌ తమ పార్టీ ఆర్థిక మంత్రులు, సీనియర్‌ నేతలతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. పుణేలో జరిగిన జీఎస్టీ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మిగులు నిధులను ఏం చేయాలనే దానిపై సొంతంగా బిమల్‌ జలాన్‌ నేతృత్వంలో కమిటీని ఆర్‌బీఐనే ఏర్పాటు చేసుకుందన్నారు. పలువురు ప్రముఖ నిపుణులు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ విశ్వసనీయతను ప్రశ్నిస్తూ కాంగ్రెస్‌ నేతలు ఆరోపణలు చేయడం విచిత్రంగా ఉందన్నారు. కాగా, ఆర్‌బీఐ నుంచి వచ్చిన మిగులు నిధులను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement