న్యూఢిల్లీ: సోలార్ అదనపు విద్యుత్ సామర్థ్యం ఏర్పాటు ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 1.7 గిగావాట్లకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఏర్పాటైన 4 గిగావాట్లతో పోలిస్తే 58 శాతం తగ్గినట్టు మెర్కామ్ ఇండియా సంస్థ తెలిపింది. జూన్ త్రైమాసికంలో సోలార్ మార్కెట్‌కు సంబంధించి నివేదికను విడుదల చేసింది. ఇక ఈ ఏడాది మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో ఏర్పాటైన 1.9 గిగావాట్ల ఇన్‌స్టాలేషన్స్‌తో పోలి్చనా 10 శాతం తగ్గింది.
జూన్ త్రైమాసికంలో కొత్తగా ఏర్పాటైన సోలార్ విద్యుత్ సామర్థ్యంలో 77 శాతం భారీ ప్రాజెక్టుల రూపంలో ఉంది. అంటే 1.3 గిగావాట్లు ఈ రూపంలోనే సమకూరింది. రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్లు 23 శాతం వాటా ఆక్రమించాయి. ఇక ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఆరు నెలల్లో, 3.6 గిగావాట్ల సోలార్ ఇన్‌స్టాలేషన్లు నమోదయ్యాయి. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో ఏర్పాటైన 7.6 గిగావాట్లతో పోల్చి చూసినప్పుడు 53 శాతం తగ్గినట్టు తెలుస్తోంది.
ఇక దేశం మొత్తం మీద సోలార్ విద్యుత్ ఇన్‌స్టాలేషన్ సామర్థ్యం జూన్ చివరికి 66 గిగావాట్లుగా ఉంది. జూన్ త్రైమాసికంలో భారీ సోలార్ ఇన్‌స్టాలేషన్లలో గుజరాత్ 41 శాతం వాటా ఆక్రమించింది. ఆ తర్వాత రాజస్థాన్‌లో 20 శాతం, కర్ణాటకలో 14 శాతం చొప్పున ఏర్పాటయ్యాయి. ముఖ్యంగా ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మద్య దేశంలో 8.4 గిగావాట్ల నూతన విద్యుత్ సామర్థ్యం సమకూరగా, అందులో 43 శాతం సోలార్ రూపంలోనే ఉండడం గమనించొచ్చు.
ప్రాజెక్టుల్లో జాప్యం..
ప్రాజెక్టుల్లో జాప్యం, విస్తరణ ఇతర కారణాల వల్ల పెద్ద ఎత్తున ప్రాజెక్టులు వచ్చే ఏడాదికి వాయిదా పడినట్టు మెర్కామ్ క్యాపిటల్ గ్రూప్ సీఈవో రాజ్ ప్రభు తెలిపారు. 2024 సంవత్సరం ఎంతో ఆశావహంగా ఉందన్నారు. సోలార్ విడిభాగాలు, ప్రాజెక్టుల వ్యయాలు వేగంగా తగ్గుతుండడం ఈ పరిశ్రమ వృద్దికి ప్రేరణగా నిలుస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో సోలార్ ఇన్‌స్టాలేషన్లు బలహీనంగా ఉన్నాయి. దీంతో రెండో త్రైమాసికంలో ఇన్‌స్టాలేషన్లు మరింత నిదానించాయి. కొన్ని భారీ సోలార్ ప్రాజెక్టుల విస్తరణకు అనుమతులు వచ్చాయి. అయినా కానీ భూమి, బదిలీ అంశాలు జనవరి–జూన్ త్రైమాసికంలో ఇన్‌స్టాలేషన్లపై ప్రభావం చూపించాయి’’అని రాజ్‌ప్రభు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment