హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలోని గ్రామీణ బ్యాంకులన్నింటిలో మిగులు నిధులు, ఆపరేటింగ్ ప్రాఫిట్ పరంగా టాప్‌లో ఉన్నామని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ చైర్మన్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. బ్యాంకు వద్ద రూ.2286 కోట్ల మిగులు నిధులున్నాయని, నిర్వహణ లాభం 16 శాతం వృద్దితో రూ. 958 కోట్లకు చేరిందని చెప్పారాయన. ఎస్‌బీఐ ప్రాయోజిత 16 ఆర్‌ఆర్‌బీల మొత్తం వ్యాపారంలో తమ వాటా 20 శాతమని తెలిపారు. గతంలో ఐపీఓకి వచ్చే ఆలోచన చేశామని, రాష్ట్ర విభజనానంతరం తలెత్తిన సాంకేతిక సమస్యల వల్ల ఆగిపోయామని, ఇప్పట్లో ఐపీఓకి వచ్చే ఆలోచన లేదని చెప్పారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు ఆర్థిక ఫలితాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.
గ్రామీణ బ్యాంకుల విలీనంపై...
రాష్ట్రానికి ఒకటి లేదా రెండు గ్రామీణ బ్యాంకులే ఉండాలన్న కేంద్ర ఆలోచనకు అనుగుణంగా ఏపీలో గరిష్టంగా రెండు గ్రామీణ బ్యాంకులుంటాయి. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకులను ఏపీజీవీబీ, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుల్లో విలీనం చేస్తారు. రాష్ట్ర విభజనానంతరం తలెత్తిన సమస్యలను కేంద్రం పరిష్కరించాక విలీన ప్రక్రియ ఉంటుంది. ఇది వచ్చే సెప్టెంబర్ నాటికి పూర్తి కావచ్చు. ప్రస్తుతం బ్యాంకు తెలంగాణలో 5 జిల్లాలు, ఏపీలో 3 జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. విలీనంలో భాగంగా తెలంగాణలో శాఖలను తెలంగాణ గ్రామీణ బ్యాంకుతో కలిపే అవకాశముంది. దేశంలో 190 ఆర్‌ఆర్‌బీలుండగా అవి ప్రస్తుతం 45కు తగ్గాయి.
స్మాల్ ఫైనాన్స్, ప్రైవేట్ బ్యాంకులతో భయం లేదు
మేం గ్రామాల్లోకి చొచ్చుకుపోయినట్లు స్మాల్‌ఫైనాన్స్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు విస్తరించలేదు. అందువల్ల మా వ్యాపారంపై వాటి ప్రభావం ఉండదు. వ్యాపార పరంగా రుణాలు, డిపాజిట్ల విషయంలో చిన్న ఫైనాన్స్ బ్యాంకులకు కొన్ని పరిమితులున్నాయి. అందుకని మాతో ఇవి ఇప్పట్లో పోటీ పడలేవు.
మాతృ బ్యాంకులో విలీనం ఉండదు
ఏపీజీవీబీలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకూ 15 శాతం వాటా ఉంది. 50 శాతం కేంద్రానికి, 35 శాతం ఎస్‌బీఐకి ఉంది. గ్రామీణ బ్యాంకులను మాతృ బ్యాంకుల్లో విలీనం చేసే ఆలోచన లేదు. అలా చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో రుణ వృద్ధికి తీవ్ర విఘాతం కలుగుతుంది. స్థానిక రూరల్ బ్యాంకులతో విలీనానంతరం ఏపీజీవీబీ పూర్తిగా ఏపీకే పరిమితమవుతుంది. ప్రస్తుతం బ్యాంకు వ్యాపార విలువ రూ.32వేల కోట్లు కాగా దీన్లో రూ.22వేల కోట్లు తెలంగాణ వాటా. మిగతాది ఏపీది. విలీనానంతరం బ్యాంకు వ్యాపారం రూ.34 వేల కోట్లకు చేరవచ్చని అంచనా. గతేడాది మేం 17 శాతం రుణ వృద్ధి సాధించాం. ఈ ఏడాది 22 శాతాన్ని లకి‡్ష్యస్తున్నాం.మాకు ఎన్‌పీఏ సమస్య చాలా తక్కువ. ఉన్న కాస్త ఎన్‌పీఏలు కూడా ఎస్‌హెచ్‌జీలు, వ్యవసాయ రుణాల్లోనే ఉన్నాయి.
2018–19లో నికరలాభం రూ. 112 కోట్లు
గత ఆర్థిక సంవత్సరానికి ఏపీజీవీబీ నికరలాభం రూ.112.04 కోట్లకు చేరింది. అంతకు ముందటేడాది సాధించిన రూ.503 కోట్లతో పోలిస్తే దాదాపు 80 శాతం క్షీణించింది. కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా పెన్షన్ కేటాయింపులు జరపాల్సి రావడంతో నికరలాభం క్షీణించిందని ప్రవీణ్ కుమార్ వివరించారు. 2018–19 సంవత్సరానికి పెన్షన్ల కోసం రూ. 837 కోట్లు కేటాయించామన్నారు. ఇవి లేకుంటే నికరలాభం రూ.596 కోట్లుండేదని, గ్రామీణ బ్యాంకులన్నింటిలో టాప్‌లో ఉండేవారమని చెప్పారు. 2018–19 సంవత్సరానికి బ్యాంకు వ్యాపారం 14.19 శాతం పెరిగి రూ. 32714 కోట్లకు చేరగా... డిపాజిట్లు 12 శాతం పెరుగుదలతో రూ. 14333 కోట్లకు చేరాయి. మొత్తం రుణ పోర్టుఫోలియోలో సాగు రంగం వాటా 92.68 శాతం. స్థూల ఎన్‌పీఏలు 1.36 శాతం నుంచి 1.14 శాతానికి దిగిరాగా, నికర ఎన్‌పీఏలు 0.20 శాతం నుంచి 0.34 శాతానికి పెరిగాయి.
గ్రామీణ బ్యాంకుల్లో మేమే నెంబర్‌వన్!
Published Fri, May 10 2019 5:27 AM | Last Updated on Fri, May 10 2019 5:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment