
ఎంఎస్ సెకండియర్ చదువుతున్న ప్రవీణ్
కేశంపేట: ఉన్నత ఆశయాలతో అమెరికా వెళ్లిన ఓ విద్యార్థి.. అక్కడ గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో మృతిచెందాడు. ఈ ఘటన తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రానికి చెందిన వ్యాపారి గంప రాఘవులు, రమాదేవి దంపతులకు ప్రవీణ్‌కుమార్ (27), గాయత్రి సంతానం. గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన ప్రవీణ్.. అనంతరం 2023 ఆగస్టులో అమెరికాలోని మిల్వాకీ పట్టణంలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్‌లో ఎంఎస్ చదివేందుకు వెళ్లాడు.
అదే పట్టణంలోని ఓ మాల్‌లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు. గతేడాది డిసెంబర్ 18న ఇంటికి వచ్చిన ప్రవీణ్ జనవరి 20న తిరిగి అమెరికా వెళ్లాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 2.50 నిమిషాలకు ప్రవీణ్ తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. అయితే కుటుంబ సభ్యులు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తిరిగి ఉదయాన్నే వాట్సాప్ కాల్ చేయమని మెసేజ్ పెట్టినా ప్రవీణ్ నుంచి రిప్లయ్ రాలేదు. దీంతో ఉదయం 7 గంటలకు కుమారుడి ఫోన్‌కు కాల్ చేశారు.
ఫోన్ లిఫ్ట్ చేసిన అవతలి వ్యక్తులు ప్రవీణ్ వివరాలను అడగటంతో సైబర్ నేరగాళ్లు అనుకుని ఫోన్ కట్ చేశారు. మరోసారి ప్రవీణ్‌తో కలిసి రూంలో ఉండే అతని మిత్రులకు ఫోన్ చేశారు. కొద్దిసేపటి తర్వాత వివరాలు తెలుసుకున్న వారు గుర్తుతెలియని వ్యక్తులు మాల్‌లో ప్రవీణ్‌ను గన్‌తో కాల్చారని, బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడని చెప్పడంతో కుటుంబ సభ్యులు కుప్పకూలారు. ప్రవీణ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
అండగా ఉంటాం: డీకే అరుణ
అమెరికాలో మృతిచెందిన ప్రవీణ్‌కుమార్ కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి బుధవారం ప్రవీణ్ తల్లిదండ్రులను కలిసి పరామర్శించారు. అనంతరం ఎంపీతో ఫోన్‌లో మాట్లాడించారు. వివరాలను అందిస్తే మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి తెచ్చేందుకు కృషి చేస్తామని ఆమె వారికి హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment