Andhra Pradesh Gramin Vikas Bank
-
గ్రామీణ బ్యాంకుల విభజన
విశాఖ (విద్య): గ్రామీణ బ్యాంక్‌ల విభజనకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. వరంగల్ కేంద్రంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్(ఏపీ జీవీబీ)కు తెలంగాణతో బంధం తెగిపోనుంది. ఏపీ జీవీబీని తెలంగాణ గ్రామీణ బ్యాంక్(టీజీబీ)లో విలీనం చేసేందుకు అంతా సిద్ధం చేశారు.గ్రామీణ బ్యాంక్‌లన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఏపీ జీవీబీ అధికారులు ఒకడుగు ముందుకేసి విభజనకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ఏపీ జీవీబీల్లో ప్రస్తుతం లావాదేవీలను సైతం నిలిపివేసి, విలీన ప్రక్రియకు సంబంధించి సాంకేతికపరమైన పనులను వేగవంతం చేశారు. ఈ నెల 28 నుంచి 31 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏపీ జీవీబీల్లో బ్యాంకింగ్, ఆన్లైన్ సేవలు (యూపీఐ, ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్) అందుబాటులో ఉండవని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. జనవరి 1నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలకే పరిమితం కానుంది. ఉద్యోగుల పంపకాలు షురూ ఏపీ జీవీబీ 493 బ్రాంచిలు తెలంగాణలోనూ, 278 బ్రాంచిలు ఆంధ్రప్రదేశ్ (ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రమే)లో ఉన్నాయి. ఏపీ జీవీబీని టీజీబీలో విలీనం చేసే క్రమంలో వీటిలో పనిచేస్తున్న ఉద్యోగుల పంపకాలపై బ్యాంక్ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. స్థానికత ఆధారంగా ఆయా రాష్ట్రాలకు వెళ్లేందుకు ఆప్షన్లు తీసుకుంటున్నారు. అయితే తెలంగాణ నుంచి ఆంధ్రకు వచ్చేందుకు సుమారు 700 మందికి పైగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరందరినీ విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న బ్యాంక్‌ల్లో సర్దుబాటు చేయాల్సి ఉంది. వీరిని ఎప్పటిలోగా ఆంధ్రకు తీసుకొస్తారనే దానిపై స్పష్టత ఇవ్వాలని బ్యాంక్ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కొత్తగా వచ్చే వారిని ఏం చేస్తారో? ఏపీ జీవీబీల్లో 150 ప్రొబేషనరీ ఆఫీసర్స్ (ఆఫీసర్స్ స్కేల్–1) పోస్టుల భర్తీ కోసం ఇటీవల ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఐబీపీఎస్ ద్వారా ఎంపికైన వారికి జనవరి 1న పోస్టింగ్‌లు (బ్యాంక్ అలాట్మెంట్) ఇవ్వనున్నారు. ఇదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. సరిగ్గా జనవరి 1న తెలంగాణలోని ఏపీ జీవీబీ బోర్డులన్నీ టీజీబీగా మారబోతున్నాయి. ఇదే రోజున కొత్త పీవోలకు బ్యాంక్ బ్రాంచి కేటాయింపు ఉత్తర్వులు జారీ కానున్నాయి. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం ఉమ్మడి జిల్లాలకు చెందిన అభ్యర్థులు స్థానికంగా పోస్టు దక్కించకోవటం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుని(వరంగల్ కేంద్ర కార్యాలయం కాబట్టి) పరీక్షకు హాజరవుతుంటారు. తెలంగాణ ఉన్న ఏపీ జీవీబీ బ్రాంచిలో పోస్టింగ్ వచి్చనా, తదుపరి బదిలీల్లో ఏపీకి రావొచ్చనే ధీమా ఉండేది. కానీ తాజా పరిణామాలు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఉద్యోగార్థులకు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణను ఎంపిక చేసినా స్థానికతను పరిగణనలోకి తీసుకుని ఉత్తరాంధ్ర జిల్లాల్లో గల ఏపీజీవీబీలకు కేటాయిస్తారనే ఆశతో ఉద్యోగార్థులు ఎదురుచూస్తున్నారు.ఒకే గొడుగు కిందకు గ్రామీణ బ్యాంక్‌లు రాష్ట్రంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ (కడప హెడ్‌క్వార్టర్), చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్(గుంటూరు హెడ్ క్వార్టర్), సప్తగిరి గ్రామీణ బ్యాంక్ (చిత్తూరు హెడ్ క్వార్టర్) కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. రీజినల్ రూరల్ బ్యాంక్(ఆర్ఆర్బీ)గా అభివర్ణించే ఈ మూడింటితో పాటు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల్లో ఉన్న ఏపీ జీవీబీలను కలిపి రానున్న రోజుల్లో రాష్ట్రమంతా ఒకే రీజినల్ బ్యాంక్ పరిధిలోకి తీసుకొచ్చేలా శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే వీటిని ఏ బ్యాంక్‌లో విలీనం చేస్తారు? దీనికి హెడ్ క్వార్టర్ ఎక్కడ నిర్ణయిస్తారనేది తేలాల్సి ఉంది. -
గ్రామీణ బ్యాంకుల్లో మేమే నెంబర్‌వన్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలోని గ్రామీణ బ్యాంకులన్నింటిలో మిగులు నిధులు, ఆపరేటింగ్ ప్రాఫిట్ పరంగా టాప్‌లో ఉన్నామని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ చైర్మన్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. బ్యాంకు వద్ద రూ.2286 కోట్ల మిగులు నిధులున్నాయని, నిర్వహణ లాభం 16 శాతం వృద్దితో రూ. 958 కోట్లకు చేరిందని చెప్పారాయన. ఎస్బీఐ ప్రాయోజిత 16 ఆర్ఆర్బీల మొత్తం వ్యాపారంలో తమ వాటా 20 శాతమని తెలిపారు. గతంలో ఐపీఓకి వచ్చే ఆలోచన చేశామని, రాష్ట్ర విభజనానంతరం తలెత్తిన సాంకేతిక సమస్యల వల్ల ఆగిపోయామని, ఇప్పట్లో ఐపీఓకి వచ్చే ఆలోచన లేదని చెప్పారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు ఆర్థిక ఫలితాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. గ్రామీణ బ్యాంకుల విలీనంపై... రాష్ట్రానికి ఒకటి లేదా రెండు గ్రామీణ బ్యాంకులే ఉండాలన్న కేంద్ర ఆలోచనకు అనుగుణంగా ఏపీలో గరిష్టంగా రెండు గ్రామీణ బ్యాంకులుంటాయి. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకులను ఏపీజీవీబీ, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుల్లో విలీనం చేస్తారు. రాష్ట్ర విభజనానంతరం తలెత్తిన సమస్యలను కేంద్రం పరిష్కరించాక విలీన ప్రక్రియ ఉంటుంది. ఇది వచ్చే సెప్టెంబర్ నాటికి పూర్తి కావచ్చు. ప్రస్తుతం బ్యాంకు తెలంగాణలో 5 జిల్లాలు, ఏపీలో 3 జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. విలీనంలో భాగంగా తెలంగాణలో శాఖలను తెలంగాణ గ్రామీణ బ్యాంకుతో కలిపే అవకాశముంది. దేశంలో 190 ఆర్ఆర్బీలుండగా అవి ప్రస్తుతం 45కు తగ్గాయి. స్మాల్ ఫైనాన్స్, ప్రైవేట్ బ్యాంకులతో భయం లేదు మేం గ్రామాల్లోకి చొచ్చుకుపోయినట్లు స్మాల్‌ఫైనాన్స్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు విస్తరించలేదు. అందువల్ల మా వ్యాపారంపై వాటి ప్రభావం ఉండదు. వ్యాపార పరంగా రుణాలు, డిపాజిట్ల విషయంలో చిన్న ఫైనాన్స్ బ్యాంకులకు కొన్ని పరిమితులున్నాయి. అందుకని మాతో ఇవి ఇప్పట్లో పోటీ పడలేవు. మాతృ బ్యాంకులో విలీనం ఉండదు ఏపీజీవీబీలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకూ 15 శాతం వాటా ఉంది. 50 శాతం కేంద్రానికి, 35 శాతం ఎస్బీఐకి ఉంది. గ్రామీణ బ్యాంకులను మాతృ బ్యాంకుల్లో విలీనం చేసే ఆలోచన లేదు. అలా చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో రుణ వృద్ధికి తీవ్ర విఘాతం కలుగుతుంది. స్థానిక రూరల్ బ్యాంకులతో విలీనానంతరం ఏపీజీవీబీ పూర్తిగా ఏపీకే పరిమితమవుతుంది. ప్రస్తుతం బ్యాంకు వ్యాపార విలువ రూ.32వేల కోట్లు కాగా దీన్లో రూ.22వేల కోట్లు తెలంగాణ వాటా. మిగతాది ఏపీది. విలీనానంతరం బ్యాంకు వ్యాపారం రూ.34 వేల కోట్లకు చేరవచ్చని అంచనా. గతేడాది మేం 17 శాతం రుణ వృద్ధి సాధించాం. ఈ ఏడాది 22 శాతాన్ని లకి‡్ష్యస్తున్నాం.మాకు ఎన్పీఏ సమస్య చాలా తక్కువ. ఉన్న కాస్త ఎన్పీఏలు కూడా ఎస్‌హెచ్‌జీలు, వ్యవసాయ రుణాల్లోనే ఉన్నాయి. 2018–19లో నికరలాభం రూ. 112 కోట్లు గత ఆర్థిక సంవత్సరానికి ఏపీజీవీబీ నికరలాభం రూ.112.04 కోట్లకు చేరింది. అంతకు ముందటేడాది సాధించిన రూ.503 కోట్లతో పోలిస్తే దాదాపు 80 శాతం క్షీణించింది. కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా పెన్షన్ కేటాయింపులు జరపాల్సి రావడంతో నికరలాభం క్షీణించిందని ప్రవీణ్ కుమార్ వివరించారు. 2018–19 సంవత్సరానికి పెన్షన్ల కోసం రూ. 837 కోట్లు కేటాయించామన్నారు. ఇవి లేకుంటే నికరలాభం రూ.596 కోట్లుండేదని, గ్రామీణ బ్యాంకులన్నింటిలో టాప్‌లో ఉండేవారమని చెప్పారు. 2018–19 సంవత్సరానికి బ్యాంకు వ్యాపారం 14.19 శాతం పెరిగి రూ. 32714 కోట్లకు చేరగా... డిపాజిట్లు 12 శాతం పెరుగుదలతో రూ. 14333 కోట్లకు చేరాయి. మొత్తం రుణ పోర్టుఫోలియోలో సాగు రంగం వాటా 92.68 శాతం. స్థూల ఎన్పీఏలు 1.36 శాతం నుంచి 1.14 శాతానికి దిగిరాగా, నికర ఎన్పీఏలు 0.20 శాతం నుంచి 0.34 శాతానికి పెరిగాయి. -
జన్‌ధన్ ఖాతాపై డిపాజిట్ గన్!
శ్రీకాకుళం పాత బస్టాండ్: పొదుపును ప్రోత్సహించడం, పేదలకు బీమా సౌకర్యం కల్పించడం, భవిష్యత్తులో అన్ని రకాల సంక్షేమ ఫలాలను బ్యాంకు ఖాతాలకే జమ చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకం కొన్ని బ్యాంకుల నిర్వాకం కారణంగా ఖాతాదారులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది.పేదలను దృష్టిలో పెట్టుకొని కనీస డిపాజిట్ కూడా అవసరం లేకుండా జీరో బ్యాలెన్స్‌తో జన్‌ధన్ ఖాతాలు తెరవాలని నిబంధనల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే కొన్ని బ్యాంకులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్(ఏపీజీవీబి) రూ.500 డిపాజిట్‌ను డిమాండ్ చేస్తోంది. ముందు డిపాజిట్ లేకుండా ఖాతా తెరిచినా.. కనీస డిపాజిట్ కట్టనిదే పాస్‌పుస్తకం ఇచ్చేది లేదని పలు శాఖల అధికారులు స్పష్టం చేస్తుండటంతో కొత్త ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నారు. లక్ష్యానికి దూరంగా.. అన్ని కుటుంబాలకు జన్‌ధన్ ఖాతా ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని ఇటువంటి కొన్ని లోపాల కారణంగా చేరుకోలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో 27 ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు చెందిన 263 శాఖలు ఉన్నాయి. వీటన్నింటిలోనూ జన్‌ధన్ ఖాతాలు తెరుస్తున్నారు. అయితే ఏపీజీవీబీ శాఖల్లో మాత్రమే రూ.500 కనీస డిపాజిట్ వసూలు చేస్తున్నారని ఆ బ్యాంకులో ఖాతాలు తెరిచిన పలువురు ఆరోపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఏపీజీవీబీ శాఖలే ఉన్నాయి. బిజినెస్ ప్రొవైడర్ల ద్వారా ఈ శాఖల పరిధిలోని గ్రామాల్లో వేల సంఖ్యలో కొత్త ఖాతాలు తెరిపించారు. ఖాతాలు తెరిచిన వారు ఆయా శాఖలకు వెళ్లి పాస్‌పుస్తకాలు అడిగితే కనీస డిపాజిట్ కట్టాలని, అప్పుడే పాస్ పుస్తకం ఇస్తామని బ్యాంకు ఆధికారులు స్పష్టం చేస్తున్నారని ఖాతాదారులు వాపోతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 8.83 లక్షల కుటుంబాలు ఉన్నాయి. వీటన్నింటికీ ఖాతాలు తెరవాలన్నది లక్ష్యంగా ఇప్పటివరకు సుమారు 4 ల క్షల ఖాతాలు ఉన్నాయి. కాగా గత నవంబర్‌లో ప్రారంభమైన జన్‌ధన్ పథకం కింద 2.30 లక్షల ఖాతాలు తెరిచారు. కనీస బ్యాలెన్స్ పేరుతో ఏపీజీవీబీ ఒత్తిడి చేస్తుండటంతో కొత్తవారు ఖాతాలు తెరిచేందుకు ముందురాని పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామిరెడ్డి వద్ద ప్రస్తావించగా జన్‌ధన్ ఖాతాలకు కనీస డిపాజిట్ అవసరం లేదని స్పష్టం చేశారు. ఇలా వసూలు చేస్తున్న బ్యాంకు ఉన్నతాధికారులతో మాట్లాడి ఈ సమస్య లేకుండా చేస్తానని చెప్పారు. -
భూపాలపల్లి టు అంబట్పల్లి
మహదేవపూర్/ వరంగల్ క్రైం: భూపాల్పల్లి, ఆజంనగర్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) శాఖల్లో చోరీకి గురైన సొత్తు మహదేవపూర్ మండలం అంబట్‌పల్లిలోని ఓ వ్యాపారి ఇంట్లో లభ్యమైంది. బ్యాంకులో తాత్కాలిక మెసెంజర్(అటెండర్)గా విధులు నిర్వర్తిస్తున్న రమేశ్ స్వగ్రామం కాటారం మండలం అంకుషాపూర్ కావడం... అతడి ఇంటి సమీపంలోని అమ్మాయిని అంబట్పల్లికి ఇవ్వడంతో అంకుషాపూర్‌కు అంబట్పల్లికి లింక్ కలిసింది. మొత్తం 1154 బ్యాగుల్లో ఉన్న రూ.9.50 కోట్ల విలువైన 34 కిలోల బంగారు నగలు, దొంగిలించిన రూ.21 లక్షల్లో రూ. 2 లక్షలు దొరికారుు. బ్యాంకులోని సొత్తు దొంగిలించిన రమేష్ అంబట్పల్లికి గురువారం చేరుకుని గ్రామంలో ని వొల్లాల రమేష్ ఇంటికి వచ్చాడు. అతని భార్య లావణ్యతో మాట్లాడి తాను సిరొంచలో దుకాణం పెడుతున్నానని, మరికొంత సామగ్రి కొనాల్సి ఉన్నందున వరంగల్ వెళ్తున్నానని చెప్పి రెండు సంచులను వారింట్లో దాచి వెళ్లా డు. అందులో బంగారు నగలు ఉన్న విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. విషయం మహదేవపూర్ పోలీసులకు తెలవడంతో వారు సమాచారాన్ని భూపాల్పల్లి పోలీసులకు చేరవేసి భూపాల్పల్లి, చిట్యాల, కాటారం సీఐలు రఘునందర్రావు, రవికుమార్, శ్రీనివాసరావు, భూపాల్పల్లి, మహదేవపూర్ ఎస్సైలు వెంకట్, రమేశ్ అంబట్పల్లి చేరుకుని వ్యాపారి రమేష్ ఇంట్లోని నగల సంచులను విప్పి చూశారు. అనంతరం వరంగల్ తరలించారు. పకడ్బందీ ప్లాన్ బ్యాంకులను పకడ్బందీగా దోచుకుని చెన్నైలో ఉన్నట్లు పోలీసులను బురిడీ కొట్టించిన రమేశ్ మహదేవపూర్ పోలీసులకు అలవోకగా దొరికి పోయాడు. గురువారం మధ్యాహ్నం రమేష్ ఇంటికి ఓ ఆటోలో ముల్లెలను తీసుకువచ్చి తెలిసిన వారి ఇంట్లో ఉంచి శుక్రవారం కూడా గ్రామంలోనే సంచరించినట్లు విశ్వసనీయ సమాచారం. శుక్రవారం బంగారు నగల సంచులను మహారాష్ట్రకు తరలించేందుకు ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో భూపాల్పల్లి ఎస్సై పోలీసులు మఫ్టీలో తిరుగుతూ రమేష్ ఫొటోను చూపిస్తూ ఇతనికి మతి భ్రమించిందని, రెండు సంచులతో సంచరిస్తున్నాడని, కనబడితే సమాచారం ఇవ్వాలని ఫోన్ నంబర్లను గ్రామస్తులకు ఇచ్చారు. పోలీసులను గమనిస్తూ గ్రామంలోనే సంచరించిన రమేశ్ శుక్రవారం రాత్రి నగల సంచులను తీసుకువెళ్లేందుకు భయపడి అక్కడే ఉంచినట్లు తెలుస్తోంది. రమేష్ ఫొటోను చూసిన ఇంటి యజమాని విషయాన్ని అతని అత్తవారింటికి తెలపటంతో వారి ద్వారా రమేష్ బ్యాంకులో దొంగతనం చేసిన విషయం తెలిసినట్టు సమాచారం. శుక్రవారం భూపాలపల్లి పోలీసులు అంబట్పల్లిలో వాకబు చేయకుంటే నగలు గోదావరి నది ఆవలివైపునకు రమేశ్ తరలించేవాడని అర్థమవుతోంది. -
ఇంటి దొంగల పనేనా!
భూపాలపల్లి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ)లో ఘరానా చోరీ ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. రెండు శాఖల్లో దొంగతనం జరగడం కలకలం రేపింది.. ఒక బ్యాంకు తాళాలు తీసి ఉన్నా.. మరో బ్యాంకు తాళాలు వేసిఉన్నా భారీగా నగలు, నగదు ఆపహరణకు గురయ్యూరుు.. చోరీ జరిగిన విధానాన్ని చూస్తే ఇంటి దొంగల పనేనని అనుమానాలు వ్యక్తమవుతున్నారు. భూపాలపల్లి/భూపాలపల్లి రూరల్ : పట్టణంలోని ఏపీజీవీబీ భూపాలపల్లి, ఆజంనగర్ బ్రాంచీల చోరీ ఇంటిదొంగల పనేనా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూపాలపల్లి బ్రాంచి ప్రధాన రహదారిపై ఉండగా ఆజంనగర్ బ్రాం చీని ఆరు రోజుల క్రితమే కారల్‌మార్క్స్ కాలనీలోని ఎస్బీఐ బ్యాంకు పైఅంతస్తులోకి మార్చారు. శనివారం ఒంటిపూట పనిదినం కావడంతో రెండు బ్రాంచీల అధికారులు మధ్యాహ్నమే పని ముగించుకుని ఇళ్లకు వెళ్లారు. రోజువారీ విధుల్లో భాగంగా సోమవారం ఉదయం 10 గంటలకు రెండు బ్రాంచీ ల మేనేజర్లు మూర్తి, శ్రీనివాస్‌లు ఉద్యోగులతో కలిసి బ్యాంకులకు వెళ్లారు. భూపాలపల్లి బ్రాంచి షెట్టర్ తాళం అప్పటికే తీసి ఉంది. అనుమానం వచ్చిన అధికారులు స్ట్రాంగ్ రూం వద్దకు వెళ్లారు. తాళం తీసి ఉండగా, లాకర్లోని నగదు, బం గారం, వెండి అపహరణకు గురైనట్లు గుర్తించారు. మరో వైపు ఆజంనగర్ బ్రాంచీ అధికారులు బ్యాంకు వద్దకు వెళ్లి ప్రధాన ద్వారం తాళం తీసి లోపలికి వెళ్లారు. స్ట్రాంగ్ రూం వద్దకు వెళ్లి తాళం తీసి లాకర్‌ను తెరిచిచూడగా అందులోని నగదు, బం గారం దొంగలు ఎత్తుకెళ్లినట్లుగా గుర్తించారు. చోరీల విషయా న్ని రెండు బ్రాంచీల అధికారులు స్థానిక పోలీసులకు తెలిపారు. ఈ మేరకు వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా, ములుగు డీఎస్పీ కటకం మురళీధర్... క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లతో సంఘటన స్థలాల వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు. ఆజంనగర్ బ్రాంచీ కిందనే ఎస్బీఐ ఉన్నప్పటికీ ఒకే సంస్థకు చెందిన రెండు బ్రాంచీల్లో చోరీ జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక బ్రాంచిలో షెట్టర్ తాళాలు తీసి ఉండడం, మరోచోట వేసి ఉండడమే కాక సీసీ కెమెరాల హార్డ్ డిస్క్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. అలారం మోగకుండా, ఆనవాళ్లు దొరకకుండా దొంగలు జాగ్రత్తపడడం వెనుక ఇంటి దొంగలు ఉన్నారనే అనుమానాలకు బలం చేకూరుతోంది. బ్యాంకు లాకర్ తాళాలు 3 సెట్లు ఉంటాయని, అవి మేనేజర్, హెడ్ క్యాషియర్, అకౌంటెంట్ వద్ద ఉంటాయని సమాచారం. అధికారులు అజాగ్రత్తగా ఉన్న సమయంలో సిబ్బందిలో ఎవరైనా ఆ తాళాల మాదిరిగానే మరో సెట్‌ను తయారు చేయించి చోరీకి పాల్పడ్డారా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం భూపాలపల్లి బ్రాంచీలో పని చేసే ఒక తాత్కాలిక ఉద్యోగి విధులకు హాజరు కాలేదు. అతనికి పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ స్విచ్చాఫ్ వచ్చింది. ఈ మేరకు పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఆందోళనలో ఖాతాదారులు భూపాలపల్లిలోని రెండు ఏపీజీవీబీ బ్రాంచీల్లో చోరీ జరిగినట్లుగా తెలియడంతో ఖాతాదారులు భారీ ఎత్తున బ్యాంకుల వద్దకు చేరుకున్నారు. భూపాలపల్లి బ్రాంచి మేనేజర్ మూర్తి బ్యాంకు నుంచి బయటకు రావడంతో అతడిని ఖాతాదారులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. తాకట్టు పెట్టిన బంగారం సంగతేంటని, వ్యక్తిగత లాకర్ల విషయమేంటని ప్రశ్నించారు. ఇందుకు మేనేజర్ స్పందిస్తూ వ్యక్తిగత లాకర్ల ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బ్యాంకు లాకర్లోని డబ్బు, నగలు మాత్రమే చోరీకి గురయ్యాయని బదులిచ్చారు. కాగా, ఏపీజీవీబీ భూపాలపల్లి బ్రాంచిలో రూ.4,37,67,000 విలువైన 16 కిలోల 22 తులాల బంగారం, రూ.17, 40,000 నగదు చోరీకి గురైనట్లు పోలీసులు తేల్చారు. ఆజంనగర్ బ్రాంచిలో రూ.4,86,00,000 విలువైన 18 కిలోల బంగారం, రూ.3,76,100 నగదు అపహరణకు గురైనట్లు వెల్లడించారు. రెండు బ్యాంకుల్లో కలిపి నగదు, బంగారం కలిపి రూ.9,44,83,100 విలువ ఉంటాయని వివరించారు.