మహదేవపూర్/ వరంగల్ క్రైం: భూపాల్‌పల్లి, ఆజంనగర్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) శాఖల్లో చోరీకి గురైన సొత్తు మహదేవపూర్ మండలం అంబట్‌పల్లిలోని ఓ వ్యాపారి ఇంట్లో లభ్యమైంది. బ్యాంకులో తాత్కాలిక మెసెంజర్(అటెండర్)గా విధులు నిర్వర్తిస్తున్న రమేశ్ స్వగ్రామం కాటారం మండలం అంకుషాపూర్ కావడం... అతడి ఇంటి సమీపంలోని అమ్మాయిని అంబట్‌పల్లికి ఇవ్వడంతో అంకుషాపూర్‌కు అంబట్‌పల్లికి లింక్ కలిసింది. మొత్తం 1154 బ్యాగుల్లో ఉన్న రూ.9.50 కోట్ల విలువైన 34 కిలోల బంగారు నగలు, దొంగిలించిన రూ.21 లక్షల్లో రూ. 2 లక్షలు దొరికారుు.
బ్యాంకులోని సొత్తు దొంగిలించిన రమేష్ అంబట్‌పల్లికి గురువారం చేరుకుని గ్రామంలో ని వొల్లాల రమేష్ ఇంటికి వచ్చాడు. అతని భార్య లావణ్యతో మాట్లాడి తాను సిరొంచలో దుకాణం పెడుతున్నానని, మరికొంత సామగ్రి కొనాల్సి ఉన్నందున వరంగల్ వెళ్తున్నానని చెప్పి రెండు సంచులను వారింట్లో దాచి వెళ్లా డు. అందులో బంగారు నగలు ఉన్న విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డాడు.
విషయం మహదేవపూర్ పోలీసులకు తెలవడంతో వారు సమాచారాన్ని భూపాల్‌పల్లి పోలీసులకు చేరవేసి భూపాల్‌పల్లి, చిట్యాల, కాటారం సీఐలు రఘునందర్‌రావు, రవికుమార్, శ్రీనివాసరావు, భూపాల్‌పల్లి, మహదేవపూర్ ఎస్సైలు వెంకట్, రమేశ్ అంబట్‌పల్లి చేరుకుని వ్యాపారి రమేష్ ఇంట్లోని నగల సంచులను విప్పి చూశారు. అనంతరం వరంగల్ తరలించారు.
పకడ్బందీ ప్లాన్
బ్యాంకులను పకడ్బందీగా దోచుకుని చెన్నైలో ఉన్నట్లు పోలీసులను బురిడీ కొట్టించిన రమేశ్ మహదేవపూర్ పోలీసులకు అలవోకగా దొరికి పోయాడు. గురువారం మధ్యాహ్నం రమేష్ ఇంటికి ఓ ఆటోలో ముల్లెలను తీసుకువచ్చి తెలిసిన వారి ఇంట్లో ఉంచి శుక్రవారం కూడా గ్రామంలోనే సంచరించినట్లు విశ్వసనీయ సమాచారం.
శుక్రవారం బంగారు నగల సంచులను మహారాష్ట్రకు తరలించేందుకు ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో భూపాల్‌పల్లి ఎస్సై పోలీసులు మఫ్టీలో తిరుగుతూ రమేష్ ఫొటోను చూపిస్తూ ఇతనికి మతి భ్రమించిందని, రెండు సంచులతో సంచరిస్తున్నాడని, కనబడితే సమాచారం ఇవ్వాలని ఫోన్ నంబర్లను గ్రామస్తులకు ఇచ్చారు.
పోలీసులను గమనిస్తూ గ్రామంలోనే సంచరించిన రమేశ్ శుక్రవారం రాత్రి నగల సంచులను తీసుకువెళ్లేందుకు భయపడి అక్కడే ఉంచినట్లు తెలుస్తోంది. రమేష్ ఫొటోను చూసిన ఇంటి యజమాని విషయాన్ని అతని అత్తవారింటికి తెలపటంతో వారి ద్వారా రమేష్ బ్యాంకులో దొంగతనం చేసిన విషయం తెలిసినట్టు సమాచారం. శుక్రవారం భూపాలపల్లి పోలీసులు అంబట్‌పల్లిలో వాకబు చేయకుంటే నగలు గోదావరి నది ఆవలివైపునకు రమేశ్ తరలించేవాడని అర్థమవుతోంది.
భూపాలపల్లి టు అంబట్‌పల్లి
Published Sun, Nov 23 2014 4:03 AM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM
Advertisement
Advertisement