
దొంగలతో డీల్‌కు సిద్ధమైన క్రెడిట్‌కార్డ్ పోగొట్టుకున్న వ్యక్తి
ఫ్రాన్స్‌లో వింత ఘటన
పారిస్: రూపాయి రూపాయి నువ్వేం చేయగలవంటే?. బంధాలు, బంధుత్వాలను తుంచేస్తా అని చెప్పిందట. డబ్బు ఉందన్న అహంతో కొందరు తమ ఆత్మియులను ఆమడ దూరం పెట్టేసిన వైనాలు మనందరం చూశాం. అయితే అదే డబ్బు శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తుందని ఫ్రాన్స్‌లోని ఓ ఘటన నిరూపించింది. సాధారణంగా మన పర్సు, క్రెడిట్ కార్డులను కొట్టేసిన వాళ్లు మనకు కనబడితే చితకబాదుతాం. కానీ ఫ్రాన్స్‌లో 40 ఏళ్ల ఓ వ్యక్తి మాత్రం తన క్రెడిట్ కార్డును కొట్టేసిన వ్యక్తులను అక్కున చేర్చుకునేందుకు తహతహలాడుతున్నాడు. ఇందులో ఒక ఆర్థిక కోణం, నగదు ప్రేమ దాగి ఉంది. ఈయన దగ్గర కొట్టేసిన క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసిన ఒక లాటరీ టికెట్‌కు జాక్‌పాట్ తగిలింది. ఏ లక్షో రెండు లక్షలో కాకుండా ఏకంగా రూ.4,53,00,000ల జాక్‌పాట్ తగిలింది.
టికెట్ ఎలా చేజిక్కించుకోవాలి?
జాక్‌పాట్ తగిలిన టికెట్‌ను కౌంటర్‌లో ఇచ్చేసి నగదుగా మార్చుకునే అవకాశం ఆ దొంగలకు లేదు. ఎందుకంటే సంబంధిత టికెట్ కొనుగోలు పత్రాలు వాళ్ల వద్ద లేవు. ఆ టికెట్ కొనేందుకు ఉపయోగించిన క్రెడిట్ కార్డ్ వాళ్లది కాదు. దొంగతనం చేశారు కాబట్టి ఒకవేళ టికెట్ పట్టుకుని కౌంటర్ వద్దకు వస్తే పోలీసులు పట్టుకెళ్తారు. దీంతో దొంగలు ఆ రూ. 4.53 కోట్ల విలువైన లాటరీటికెట్‌ను నగదుగా మార్చుకునే అవకాశం కోల్పోయారు. కానీ ఆ అవకాశం క్రెడిట్ కార్డ్ యజమాని అయిన జీన్ డేవిడ్.ఈ అనే వ్యక్తికి ఉంది. కానీ అతని వద్ద టికెట్ లేదు. ఇందుకు ఆయనో పథకం వేశారు.
క్రెడిట్ కార్డ్ కొట్టేసిన దొంగలపై ఎక్కడాలేని ప్రేమ ఒలకబోస్తున్నారు. ‘‘నా క్రెడిట్ కార్డులు దొంగలించిన మీపై నాకు ఇప్పుడు కోపం లేదు. గతంలో మీపై పోలీస్ కేసు పెట్టాను. కావాలంటే ఆ కేసును ఇప్పుడు ఉపసంహరించుకుంటా. అయితే మీరు ఆ లాటరీ టికెట్‌ను నాకు ఇచ్చేయండి. కావాలంటే అందులో సగం మొత్తాన్ని మీకు వాటాగా ఇచ్చేస్తా’’అని ఒక చక్కటి ఆఫర్ ఇచ్చారు. అయితే ఇంకా తమ కౌంటర్ వద్దకు ఎవరూ రాలేదని లాటరీ నిర్వహణ సంస్థ లా ఫ్రాంకైస్ డీస్ జీయక్స్(ఎఫ్‌డీజే) శనివారం ప్రకటించింది.
ఆలసించిన ఆశాభంగం
క్రెడిట్ కార్డ్ యజమాని జీన్ డేవిడ్ తన లాయర్ ద్వారా మరోసారి ఒక సవివరమైన ప్రకటన ఇప్పించారు. ‘‘ఆ ఇద్దరు దొంగలు లేకుండా ఈ లాటరీ విజయం సాధ్యమయ్యేదే కాదు. వాళ్లు టికెట్ కొన్నారు కాబట్టే ఇవాళ ఇంత సొమ్ము మన పరం అయ్యే సదవకాశం దక్కింది. అందుకే దొంగల్లారా.. దయచేసి ఆ లాటరీ టికెట్ మాకు ఇచ్చేయండి. మీ వద్ద ఉన్నా అది మీకు ఉపయోగపడదు. మాకు ఇచ్చేస్తే మీకూ అందులో వాటా తప్పకుండా ఇస్తాం. డీల్ కుదుర్చుకుందాం.
మా ఆఫీస్‌కు వచ్చేయండి. మీరు ఆలస్యం చేస్తే ఆ టికెట్‌ను నగదుగా మార్చుకునే క్లెయిమ్ గడువు తీరిపోతుంది. అప్పుడు మనందరికీ దక్కేది సున్నా. కాలం మించిపోతోంది. సమయం లేదు మిత్రమా. త్వరగా వచ్చి ఒడంబడిక చేసుకుని డబ్బు తీసుకెళ్లండి. ఆ డబ్బుతో మేం సెటిల్ అవుతాం. మీరూ సెటిల్ అవ్వండి’’అని లాయర్ పియరీ డెబూసన్ చెప్పారు. ఈ వింత ప్రకటన చూసి ఫ్రాన్స్ ప్రజలు సామాజిక మాధ్యమాల్లో తమకు నచ్చినట్లు పోస్ట్‌లు పెడుతున్నారు.
సిటీలో కొట్టేసి..
టౌలూస్ నగరానికి చెందిన జీన్ డేవిడ్ ఫిబ్రవరి మూడో తేదీన కారులో తన బ్యాక్‌ప్యాక్‌ను ఉంచేసి వెళ్లాడు. కారు తెరచి దొంగలు ఆ బ్యాక్‌ప్యాక్‌ను, అందులోని పర్సు, క్రెడిట్ కార్డులను కొట్టేశారు. ఆ కార్డుతో ఒక చిల్లర దుకాణంలో లాటరీ టికెట్ కొన్నారు. ‘‘ఇల్లూ, చెప్పుకోవడానికి అడ్రస్ కూడా లేని ఇద్దరు వ్యక్తులు మా దుకాణానికి వచ్చి కాంటాక్ట్‌లెస్ విధానంలో 52.50 యూరోలతో ఒక లాటరీ టికెట్, మరికొన్ని సిగరెట్లు కొన్నారు. టికెట్ కొన్న ఆనందంలో వాళ్లు సిగరెట్లు కూడా మర్చిపోయి వెళ్లారు’’అని టబాక్ దిస్ థెర్మాస్ దుకాణ యజమాని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment