గ్రామీణ వికాస బ్యాంక్‌కు తెలంగాణతో తెగిపోనున్న బంధం
తెలంగాణలోని ‘టీజీబీ’లోకి 493 బ్రాంచ్‌లు
ఆంధ్రాలోని 278 బ్రాంచ్‌లు ఉత్తరాంధ్ర జిల్లాలకే పరిమితం
జనవరి 1నుంచి అమల్లోకి..
విశాఖ (విద్య): గ్రామీణ బ్యాంక్‌ల విభజనకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. వరంగల్ కేంద్రంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్(ఏపీ జీవీబీ)కు తెలంగాణతో బంధం తెగిపోనుంది. ఏపీ జీవీబీని తెలంగాణ గ్రామీణ బ్యాంక్(టీజీబీ)లో విలీనం చేసేందుకు అంతా సిద్ధం చేశారు.
గ్రామీణ బ్యాంక్‌లన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఏపీ జీవీబీ అధికారులు ఒకడుగు ముందుకేసి విభజనకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ఏపీ జీవీబీల్లో ప్రస్తుతం లావాదేవీలను సైతం నిలిపివేసి, విలీన ప్రక్రియకు సంబంధించి సాంకేతికపరమైన పనులను వేగవంతం చేశారు.
ఈ నెల 28 నుంచి 31 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏపీ జీవీబీల్లో బ్యాంకింగ్, ఆన్‌లైన్ సేవలు (యూపీఐ, ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్) అందుబాటులో ఉండవని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. జనవరి 1నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలకే పరిమితం కానుంది.
ఉద్యోగుల పంపకాలు షురూ
ఏపీ జీవీబీ 493 బ్రాంచిలు తెలంగాణలోనూ, 278 బ్రాంచిలు ఆంధ్రప్రదేశ్ (ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రమే)లో ఉన్నాయి. ఏపీ జీవీబీని టీజీబీలో విలీనం చేసే క్రమంలో వీటిలో పనిచేస్తున్న ఉద్యోగుల పంపకాలపై బ్యాంక్ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. స్థానికత ఆధారంగా ఆయా రాష్ట్రాలకు వెళ్లేందుకు ఆప్షన్లు తీసుకుంటున్నారు.
అయితే తెలంగాణ నుంచి ఆంధ్రకు వచ్చేందుకు సుమారు 700 మందికి పైగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరందరినీ విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న బ్యాంక్‌ల్లో సర్దుబాటు చేయాల్సి ఉంది. వీరిని ఎప్పటిలోగా ఆంధ్రకు తీసుకొస్తారనే దానిపై స్పష్టత ఇవ్వాలని బ్యాంక్ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
కొత్తగా వచ్చే వారిని ఏం చేస్తారో?
ఏపీ జీవీబీల్లో 150 ప్రొబేషనరీ ఆఫీసర్స్ (ఆఫీసర్స్ స్కేల్–1) పోస్టుల భర్తీ కోసం ఇటీవల ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఐబీపీఎస్ ద్వారా ఎంపికైన వారికి జనవరి 1న పోస్టింగ్‌లు (బ్యాంక్ అలాట్‌మెంట్) ఇవ్వనున్నారు. ఇదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. సరిగ్గా జనవరి 1న తెలంగాణలోని ఏపీ జీవీబీ బోర్డులన్నీ టీజీబీగా మారబోతున్నాయి.
ఇదే రోజున కొత్త పీవోలకు బ్యాంక్ బ్రాంచి కేటాయింపు ఉత్తర్వులు జారీ కానున్నాయి. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం ఉమ్మడి జిల్లాలకు చెందిన అభ్యర్థులు స్థానికంగా పోస్టు దక్కించకోవటం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుని(వరంగల్ కేంద్ర కార్యాలయం కాబట్టి) పరీక్షకు హాజరవుతుంటారు. తెలంగాణ ఉన్న ఏపీ జీవీబీ బ్రాంచిలో పోస్టింగ్ వచి్చనా, తదుపరి బదిలీల్లో ఏపీకి రావొచ్చనే ధీమా ఉండేది.
కానీ తాజా పరిణామాలు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఉద్యోగార్థులకు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణను ఎంపిక చేసినా స్థానికతను పరిగణనలోకి తీసుకుని ఉత్తరాంధ్ర జిల్లాల్లో గల ఏపీజీవీబీలకు కేటాయిస్తారనే ఆశతో ఉద్యోగార్థులు ఎదురుచూస్తున్నారు.
ఒకే గొడుగు కిందకు గ్రామీణ బ్యాంక్‌లు
రాష్ట్రంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ (కడప హెడ్‌క్వార్టర్), చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్(గుంటూరు హెడ్ క్వార్టర్), సప్తగిరి గ్రామీణ బ్యాంక్ (చిత్తూరు హెడ్ క్వార్టర్) కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.
రీజినల్ రూరల్ బ్యాంక్(ఆర్‌ఆర్‌బీ)గా అభివర్ణించే ఈ మూడింటితో పాటు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల్లో ఉన్న ఏపీ జీవీబీలను కలిపి రానున్న రోజుల్లో రాష్ట్రమంతా ఒకే రీజినల్ బ్యాంక్ పరిధిలోకి తీసుకొచ్చేలా శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే వీటిని ఏ బ్యాంక్‌లో విలీనం చేస్తారు? దీనికి హెడ్ క్వార్టర్ ఎక్కడ నిర్ణయిస్తారనేది తేలాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment