TGB
-
4 రోజుల పాటు ఏపీజీవీబీ సేవలు నిలిపివేత
హనుమకొండ: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) బ్రాంచీలు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం అవుతున్న క్రమంలో నాలుగు రోజులపాటు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయని బ్యాంక్ చైర్మన్ కె.ప్రతాప్‌రెడ్డి చెప్పారు. ఆయన శుక్రవారం తెలంగాణలోని హనుమకొండలో ఏపీజీవీబీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కేంద్రం నిబంధనల మేరకు తెలంగాణలోని ఏపీజీవీబీ బ్రాంచీలను టీజీబీలో విలీనం చేస్తున్నట్లు తెలిపారు. ఈ దృష్ట్యా ఈ నెల 28 నుంచి 31 వరకు ఏపీగ్రామీణ వికాస బ్యాంక్ సేవలు నిలిపివేయనున్నట్లు వివరించారు. అయితే అత్యవసరాల కోసం ఈ నెల 30, 31 తేదీల్లో రూ.10 వేల వరకు విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని ఖాతా దారులకు కల్పిస్తున్నామన్నా రు. వరంగల్ ప్రధాన కార్యాలయంగా కొనసాగుతున్న తమ బ్యాంకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 771 బ్రాంచీలు కలిగి ఉందన్నారు. ఇందులో తెలంగాణలోని 493 బ్రాంచీలను తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లోకి విలీనం చేస్తున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా 278 బ్రాంచీలు అదే రాష్ట్రంలో ఏపీజీవీబీ పేరిట కొనసాగుతాయన్నారు. విలీనం నేపథ్యంలో తెలంగాణలో ఏపీజీవీబీ ఏటీఎంలు, నెట్ బ్యాంకింగ్, యూపీఐతో పాటు ఇతర బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలుగుతుందన్నారు. దీనిపై విస్తృత ప్రచారం చేస్తున్నామన్నారు. ఖాతాదారులు సహకరించాలని ఆయన కోరారు. 2025 జనవరి 1 నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా సేవలు పునరుద్ధరిస్తామన్నారు. బ్రాంచీల విలీనం జరిగినా ఖాతా నంబర్లు మారవని స్పష్టం చేశారు -
టీజీబీలో విలీనం కానున్న ఏపీజీవీబీ తెలంగాణ శాఖలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సేవలందిస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) శాఖలన్నీ జనవరి 1 నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (టీజీబీ)లోకి విలీనం కాబోతున్నాయి. ‘ఒక రాష్ట్రం– ఒక గ్రామీణ బ్యాంకు’అనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు అనుగుణంగా తెలంగాణలోని వివిధ జిల్లాల్లో కొనసాగుతున్న ఏపీజీవీబీ 493 శాఖలను విలీనం చేయనున్నారు. 2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన ఏపీజీవీబీ 771 శాఖలతో సేవలు అందిస్తోంది. అప్పటికే తెలంగాణలో ఉన్న దక్కన్ గ్రామీణ బ్యాంకును రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మార్పుచేసి శాఖలను విస్తరించారు. ప్రస్తుతం తెలంగాణ గ్రామీణ బ్యాంకు 435 శాఖలతో 18 జిల్లాల్లో సేవలు అందిస్తోంది. ఏపీజీవీబీ తెలంగాణ శాఖల విలీనం తరువాత తెలంగాణలోని 33 జిల్లాల్లో 928 శాఖలుగా టీజీబీ రూపాంతరం చెందనుంది. అతిపెద్ద గ్రామీణ బ్యాంకుల్లో ఒకటిగా.. ఏపీజీవీబీ తెలంగాణ శాఖల విలీనం తరువాత టీజీబీ దేశంలోనే అతిపెద్ద గ్రామీణ బ్యాంకుల్లో ఒకటిగా అవతరించనున్నదని బ్యాంక్ చైర్పర్సన్ వై.శోభ తెలిపారు. విలీన ప్రక్రియ తుదిదశకు చేరిన సందర్భంగా టీజీబీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం రూ.30 వేల కోట్ల టర్నోవర్‌తో ఉన్న టీజీబీ... విలీనం తరువాత రూ.70 వేల కోట్ల టర్నోవర్‌కు చేరుతుందన్నారు.విలీన ప్రక్రియలో భాగంగా ఆస్తులు, అప్పుల పంపకాలు, ఉద్యోగుల ఆప్షన్ల ప్రక్రియ వంటివన్నీ కొలిక్కివచ్చినట్లు తెలిపారు. విలీనం నేపథ్యంలో ఈనెల 28 నుంచి 31 వరకు బ్యాంకు సేవల్లో కొంతమేర అంతరాయం కలుగుతుందని, అయితే ఖాతాదారుల అత్యవసర సేవల కోసం 30, 31 తేదీల్లో వారి ఖాతాల నుంచి రూ.5 వేల వరకు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. జనవరి 1 నుంచి ఖాతాదారులకు సేవలన్నీ అందుబాటులో ఉంటాయని తెలిపారు.ఇక ఏపీజీవీబీ శాఖలకు చెందిన ఖాతాదారులు వారి ఏటీఎం కార్డులు మార్చుకునేందుకు, యూపీఐ, మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను తిరిగి పొందేందుకు ఒకటో తేదీ నుంచి మారిన టీజీబీ శాఖల్లో సంప్రదించాలని కోరారు. అలాగే ఏపీజీవీబీ ఖాతాదారుల వద్ద ఇప్పటికే ఉన్న పాత చెక్కులు, డీడీలు వచ్చే సంవత్సరం మార్చి 31 వరకు చెల్లింపులకు, క్లియరింగ్ సేవలకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. మీడియా సమావేశంలో బ్యాంకు జీఎంలు సుధాకర్, చంద్రశేఖర్, లక్ష్మి, భారతి, రమేష్, ఏజీఎం సుశాంత్‌కుమార్ పాల్గొన్నారు. -
గ్రామీణ బ్యాంకుల విభజన
విశాఖ (విద్య): గ్రామీణ బ్యాంక్‌ల విభజనకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. వరంగల్ కేంద్రంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్(ఏపీ జీవీబీ)కు తెలంగాణతో బంధం తెగిపోనుంది. ఏపీ జీవీబీని తెలంగాణ గ్రామీణ బ్యాంక్(టీజీబీ)లో విలీనం చేసేందుకు అంతా సిద్ధం చేశారు.గ్రామీణ బ్యాంక్‌లన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఏపీ జీవీబీ అధికారులు ఒకడుగు ముందుకేసి విభజనకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ఏపీ జీవీబీల్లో ప్రస్తుతం లావాదేవీలను సైతం నిలిపివేసి, విలీన ప్రక్రియకు సంబంధించి సాంకేతికపరమైన పనులను వేగవంతం చేశారు. ఈ నెల 28 నుంచి 31 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏపీ జీవీబీల్లో బ్యాంకింగ్, ఆన్లైన్ సేవలు (యూపీఐ, ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్) అందుబాటులో ఉండవని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. జనవరి 1నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలకే పరిమితం కానుంది. ఉద్యోగుల పంపకాలు షురూ ఏపీ జీవీబీ 493 బ్రాంచిలు తెలంగాణలోనూ, 278 బ్రాంచిలు ఆంధ్రప్రదేశ్ (ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రమే)లో ఉన్నాయి. ఏపీ జీవీబీని టీజీబీలో విలీనం చేసే క్రమంలో వీటిలో పనిచేస్తున్న ఉద్యోగుల పంపకాలపై బ్యాంక్ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. స్థానికత ఆధారంగా ఆయా రాష్ట్రాలకు వెళ్లేందుకు ఆప్షన్లు తీసుకుంటున్నారు. అయితే తెలంగాణ నుంచి ఆంధ్రకు వచ్చేందుకు సుమారు 700 మందికి పైగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరందరినీ విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న బ్యాంక్‌ల్లో సర్దుబాటు చేయాల్సి ఉంది. వీరిని ఎప్పటిలోగా ఆంధ్రకు తీసుకొస్తారనే దానిపై స్పష్టత ఇవ్వాలని బ్యాంక్ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కొత్తగా వచ్చే వారిని ఏం చేస్తారో? ఏపీ జీవీబీల్లో 150 ప్రొబేషనరీ ఆఫీసర్స్ (ఆఫీసర్స్ స్కేల్–1) పోస్టుల భర్తీ కోసం ఇటీవల ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఐబీపీఎస్ ద్వారా ఎంపికైన వారికి జనవరి 1న పోస్టింగ్‌లు (బ్యాంక్ అలాట్మెంట్) ఇవ్వనున్నారు. ఇదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. సరిగ్గా జనవరి 1న తెలంగాణలోని ఏపీ జీవీబీ బోర్డులన్నీ టీజీబీగా మారబోతున్నాయి. ఇదే రోజున కొత్త పీవోలకు బ్యాంక్ బ్రాంచి కేటాయింపు ఉత్తర్వులు జారీ కానున్నాయి. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం ఉమ్మడి జిల్లాలకు చెందిన అభ్యర్థులు స్థానికంగా పోస్టు దక్కించకోవటం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుని(వరంగల్ కేంద్ర కార్యాలయం కాబట్టి) పరీక్షకు హాజరవుతుంటారు. తెలంగాణ ఉన్న ఏపీ జీవీబీ బ్రాంచిలో పోస్టింగ్ వచి్చనా, తదుపరి బదిలీల్లో ఏపీకి రావొచ్చనే ధీమా ఉండేది. కానీ తాజా పరిణామాలు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఉద్యోగార్థులకు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణను ఎంపిక చేసినా స్థానికతను పరిగణనలోకి తీసుకుని ఉత్తరాంధ్ర జిల్లాల్లో గల ఏపీజీవీబీలకు కేటాయిస్తారనే ఆశతో ఉద్యోగార్థులు ఎదురుచూస్తున్నారు.ఒకే గొడుగు కిందకు గ్రామీణ బ్యాంక్‌లు రాష్ట్రంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ (కడప హెడ్‌క్వార్టర్), చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్(గుంటూరు హెడ్ క్వార్టర్), సప్తగిరి గ్రామీణ బ్యాంక్ (చిత్తూరు హెడ్ క్వార్టర్) కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. రీజినల్ రూరల్ బ్యాంక్(ఆర్ఆర్బీ)గా అభివర్ణించే ఈ మూడింటితో పాటు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల్లో ఉన్న ఏపీ జీవీబీలను కలిపి రానున్న రోజుల్లో రాష్ట్రమంతా ఒకే రీజినల్ బ్యాంక్ పరిధిలోకి తీసుకొచ్చేలా శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే వీటిని ఏ బ్యాంక్‌లో విలీనం చేస్తారు? దీనికి హెడ్ క్వార్టర్ ఎక్కడ నిర్ణయిస్తారనేది తేలాల్సి ఉంది. -
ఖాతాదారులందరికీ న్యాయం చేస్తాం
మొయినాబాద్ రూరల్(చేవెళ్ల): ఖాతాదారులందరికీ న్యాయం చేసేందుకే విజిలెన్స్ అధికారులతో పాటు సీబీఐ అధికారులు, బ్యాంకు అధికారులు కృషి చేస్తున్నారని.. ఎలాంటి భయాయందోళనలకు గురికావొద్దని విజిలెన్స్ అధికారి కేబీఎస్ రాజు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని అజీజ్ నగర్లో గల తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఎదుట బాధితులు ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేసేంత వరకు బ్యాంకును తెరవొద్దంటూ ఆందోళన నిర్వహించారు. 30 రోజులు గడిచినా బ్యాంకు అధికారుల నుంచి ఎలాంటి స్పందనా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ బ్యాంకు మేనేజర్ రాంమోహన్ రావును బ్యాంకు తెరవకుండా అడ్డుకున్నారు. దీంతో ఈ విషయాన్ని మేనేజర్.. ఆర్ఎం రవీందర్ రెడ్డికి తెలపడంతో మధ్యాహ్నం రెండు గంటలకు ఆర్ఎంతో పాటు విజిలెన్స్ అధికారి కేబీఎస్ రాజు తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు విచ్చేసి ఆందోళన చేస్తున్న ఖాతాదారులతో మాట్లాడి నచ్చజెప్పడంతో సమస్య సద్దుమణిగింది. దీంతో బ్యాంకును తెరిచి సిబ్బంది యథావిధిగా పనులను కొనసాగించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారి కేబీఎస్ రాజు మాట్లాడుతూ బ్యాంకులో దాచుకున్న డబ్బులు ఎక్కడికీ పోవని.. ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ బ్యాంకులో 126 మంది ఖాతాదారుల నుంచి డబ్బులు రూ. 8.94 కోట్లు మాయమైనట్లు ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. సోమవారం నుంచి నెల రోజుల్లో ఖాతాదారులందరి ఖాతాలను పూర్తిగా పరిశీలించి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే సీబీఐ దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. 13 చోట్ల దాడులు నిర్వహించారని.. అజీజ్ నగర్లో రెండు చోట్ల దాడులు చేయడం జరిగిందన్నారు. మొయినాబాద్ పోలీసులు సీఐ సునీతా, ఎస్సై నయిమోద్దీన్‌లు, సిబ్బందితో భద్రత నిర్వహించారు. -
ఇక తెలంగాణ గ్రామీణ బ్యాంకు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దక్కన్ గ్రామీణ బ్యాంకు పేరు మారింది. తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా (టీజీబీ) మారుస్తూ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక ప్రకటన జారీ చేసింది. దక్కన్ గ్రామీణ బ్యాంకును టీజీబీగా మారుస్తూ గతేడాది అక్టోబరు 20న కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. టీజీబీలో కేంద్ర ప్రభుత్వానికి 50 శాతం, తెలంగాణ ప్రభుత్వానికి 15 శాతం, స్పాన్సర్ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌కు మిగిలిన 35 శాతం వాటా ఉంది. 300లకుపైగా శాఖలతో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్‌లో బ్యాంకు సేవలందిస్తోంది.