30, 31 తేదీల్లో రూ.10 వేలు విత్‌డ్రా చేసుకునే అవకాశం
తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఏపీజీవీబీ విలీనం
జనవరి 1 నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా సేవలు
ఏపీజీవీబీ చైర్మన్ కె.ప్రతాప్‌రెడ్డి
హనుమకొండ: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) బ్రాంచీలు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం అవుతున్న క్రమంలో నాలుగు రోజులపాటు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయని బ్యాంక్ చైర్మన్ కె.ప్రతాప్‌రెడ్డి చెప్పారు. ఆయన శుక్రవారం తెలంగాణలోని హనుమకొండలో ఏపీజీవీబీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కేంద్రం నిబంధనల మేరకు తెలంగాణలోని ఏపీజీవీబీ బ్రాంచీలను టీజీబీలో విలీనం చేస్తున్నట్లు తెలిపారు.
ఈ దృష్ట్యా ఈ నెల 28 నుంచి 31 వరకు ఏపీగ్రామీణ వికాస బ్యాంక్ సేవలు నిలిపివేయనున్నట్లు వివరించారు. అయితే అత్యవసరాల కోసం ఈ నెల 30, 31 తేదీల్లో రూ.10 వేల వరకు విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని ఖాతా దారులకు కల్పిస్తున్నామన్నా రు. వరంగల్ ప్రధాన కార్యాలయంగా కొనసాగుతున్న తమ బ్యాంకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 771 బ్రాంచీలు కలిగి ఉందన్నారు.
ఇందులో తెలంగాణలోని 493 బ్రాంచీలను తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లోకి విలీనం చేస్తున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా 278 బ్రాంచీలు అదే రాష్ట్రంలో ఏపీజీవీబీ పేరిట కొనసాగుతాయన్నారు. విలీనం నేపథ్యంలో తెలంగాణలో ఏపీజీవీబీ ఏటీఎంలు, నెట్ బ్యాంకింగ్, యూపీఐతో పాటు ఇతర బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలుగుతుందన్నారు.
దీనిపై విస్తృత ప్రచారం చేస్తున్నామన్నారు. ఖాతాదారులు సహకరించాలని ఆయన కోరారు. 2025 జనవరి 1 నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా సేవలు పునరుద్ధరిస్తామన్నారు. బ్రాంచీల విలీనం జరిగినా ఖాతా నంబర్లు మారవని స్పష్టం చేశారు
Comments
Please login to add a commentAdd a comment