APGVB
-
4 రోజుల పాటు ఏపీజీవీబీ సేవలు నిలిపివేత
హనుమకొండ: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) బ్రాంచీలు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం అవుతున్న క్రమంలో నాలుగు రోజులపాటు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయని బ్యాంక్ చైర్మన్ కె.ప్రతాప్‌రెడ్డి చెప్పారు. ఆయన శుక్రవారం తెలంగాణలోని హనుమకొండలో ఏపీజీవీబీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కేంద్రం నిబంధనల మేరకు తెలంగాణలోని ఏపీజీవీబీ బ్రాంచీలను టీజీబీలో విలీనం చేస్తున్నట్లు తెలిపారు. ఈ దృష్ట్యా ఈ నెల 28 నుంచి 31 వరకు ఏపీగ్రామీణ వికాస బ్యాంక్ సేవలు నిలిపివేయనున్నట్లు వివరించారు. అయితే అత్యవసరాల కోసం ఈ నెల 30, 31 తేదీల్లో రూ.10 వేల వరకు విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని ఖాతా దారులకు కల్పిస్తున్నామన్నా రు. వరంగల్ ప్రధాన కార్యాలయంగా కొనసాగుతున్న తమ బ్యాంకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 771 బ్రాంచీలు కలిగి ఉందన్నారు. ఇందులో తెలంగాణలోని 493 బ్రాంచీలను తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లోకి విలీనం చేస్తున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా 278 బ్రాంచీలు అదే రాష్ట్రంలో ఏపీజీవీబీ పేరిట కొనసాగుతాయన్నారు. విలీనం నేపథ్యంలో తెలంగాణలో ఏపీజీవీబీ ఏటీఎంలు, నెట్ బ్యాంకింగ్, యూపీఐతో పాటు ఇతర బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలుగుతుందన్నారు. దీనిపై విస్తృత ప్రచారం చేస్తున్నామన్నారు. ఖాతాదారులు సహకరించాలని ఆయన కోరారు. 2025 జనవరి 1 నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా సేవలు పునరుద్ధరిస్తామన్నారు. బ్రాంచీల విలీనం జరిగినా ఖాతా నంబర్లు మారవని స్పష్టం చేశారు -
టీజీబీలో విలీనం కానున్న ఏపీజీవీబీ తెలంగాణ శాఖలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సేవలందిస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) శాఖలన్నీ జనవరి 1 నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (టీజీబీ)లోకి విలీనం కాబోతున్నాయి. ‘ఒక రాష్ట్రం– ఒక గ్రామీణ బ్యాంకు’అనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు అనుగుణంగా తెలంగాణలోని వివిధ జిల్లాల్లో కొనసాగుతున్న ఏపీజీవీబీ 493 శాఖలను విలీనం చేయనున్నారు. 2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన ఏపీజీవీబీ 771 శాఖలతో సేవలు అందిస్తోంది. అప్పటికే తెలంగాణలో ఉన్న దక్కన్ గ్రామీణ బ్యాంకును రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మార్పుచేసి శాఖలను విస్తరించారు. ప్రస్తుతం తెలంగాణ గ్రామీణ బ్యాంకు 435 శాఖలతో 18 జిల్లాల్లో సేవలు అందిస్తోంది. ఏపీజీవీబీ తెలంగాణ శాఖల విలీనం తరువాత తెలంగాణలోని 33 జిల్లాల్లో 928 శాఖలుగా టీజీబీ రూపాంతరం చెందనుంది. అతిపెద్ద గ్రామీణ బ్యాంకుల్లో ఒకటిగా.. ఏపీజీవీబీ తెలంగాణ శాఖల విలీనం తరువాత టీజీబీ దేశంలోనే అతిపెద్ద గ్రామీణ బ్యాంకుల్లో ఒకటిగా అవతరించనున్నదని బ్యాంక్ చైర్పర్సన్ వై.శోభ తెలిపారు. విలీన ప్రక్రియ తుదిదశకు చేరిన సందర్భంగా టీజీబీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం రూ.30 వేల కోట్ల టర్నోవర్‌తో ఉన్న టీజీబీ... విలీనం తరువాత రూ.70 వేల కోట్ల టర్నోవర్‌కు చేరుతుందన్నారు.విలీన ప్రక్రియలో భాగంగా ఆస్తులు, అప్పుల పంపకాలు, ఉద్యోగుల ఆప్షన్ల ప్రక్రియ వంటివన్నీ కొలిక్కివచ్చినట్లు తెలిపారు. విలీనం నేపథ్యంలో ఈనెల 28 నుంచి 31 వరకు బ్యాంకు సేవల్లో కొంతమేర అంతరాయం కలుగుతుందని, అయితే ఖాతాదారుల అత్యవసర సేవల కోసం 30, 31 తేదీల్లో వారి ఖాతాల నుంచి రూ.5 వేల వరకు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. జనవరి 1 నుంచి ఖాతాదారులకు సేవలన్నీ అందుబాటులో ఉంటాయని తెలిపారు.ఇక ఏపీజీవీబీ శాఖలకు చెందిన ఖాతాదారులు వారి ఏటీఎం కార్డులు మార్చుకునేందుకు, యూపీఐ, మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను తిరిగి పొందేందుకు ఒకటో తేదీ నుంచి మారిన టీజీబీ శాఖల్లో సంప్రదించాలని కోరారు. అలాగే ఏపీజీవీబీ ఖాతాదారుల వద్ద ఇప్పటికే ఉన్న పాత చెక్కులు, డీడీలు వచ్చే సంవత్సరం మార్చి 31 వరకు చెల్లింపులకు, క్లియరింగ్ సేవలకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. మీడియా సమావేశంలో బ్యాంకు జీఎంలు సుధాకర్, చంద్రశేఖర్, లక్ష్మి, భారతి, రమేష్, ఏజీఎం సుశాంత్‌కుమార్ పాల్గొన్నారు. -
ఏపీజీవీబీ చైర్మన్ కిడ్నాపర్ల అరెస్ట్
తిరుమలాయపాలెం: జిల్లాలో సంచలనం సృష్టించిన ఏపీజీవీబీ చైర్మన్ వి.నర్సిరెడ్డి కిడ్నాప్ యత్నం కేసును పోలీసులు ఛేదించారు. ఏడుగురిని సోమ వారం ఉదయం అరెస్ట్ చేశారు. సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఖమ్మం రూరల్ ఏసీపీ పింగళి నరేష్‌రెడ్డి తెలిపిన వివరాలు... ఈ నెల 25న భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల పర్యటనకు వచ్చిన ఏపీజీవీబీ చైర్మన్ వి.నర్సిరెడ్డిపై మహబూబాబాద్ జిల్లా గూడూరు ఏపీజీవీబీ క్యాషియర్ చల్లమల్ల వెంకన్న కక్ష పెంచుకున్నాడు. తన ఇంటి లోన్ రుణం చెల్లించినప్పటికీ బ్యాంకులో తీసుకున్న ఓడీ(ఓవర్ డ్రాఫ్ట్) తో ముడిపెట్టి కాగితాలు ఇవ్వకుండా చైర్మన్ తిప్పుతున్నాడని, బయ్యారం బ్యాంకులో పనిచేస్తున్న సమయంలో విజిటింగ్‌కి వచ్చినప్పుడు దురుసుగా వ్యవహరించాడని మనసులో పెట్టుకున్నాడు. చైర్మన్‌ను కిడ్నాప్ చేసేందుకు క్యాషియర్ వెంకన్న పథకం రచించాడు. చైర్మన్‌ను కిడ్నాప్ చేసి బెదిరించడంతో పాటు డబ్బులు డిమాండ్ చేయాలనుకున్నాడు. వాటాలు ఇస్తానంటూ ఆరుగురిని జమ చేశాడు. రెండు కార్లను సమకూర్చుకున్నారు. చైర్మన్‌ను కిడ్నాప్ చేసేందుకు హైదరాబాద్, వరంగల్‌లో రెక్కీ నిర్వహించారు. ఈ నెల 25న కొత్తగూడెంలో ఏపీజీవీబీ రీజనల్ కార్యాలయ ప్రారంభోత్సవానికి చైర్మన్ వస్తున్నారన్న విషయాన్ని క్యాషియర్ వెంకన్న తెలుసుకున్నాడు. రెండు కార్లలో కారం పొట్లాలు, కర్రలు, తాడు సిద్ధంగా ఉంచుకున్నారు. ఖమ్మంలోని రీజనల్ కార్యాలయంలో సమావేశం అనంతరం వరంగల్‌కు ఇన్నోవా వాహనంలో చైర్మన్ నర్సిరెడ్డి బయల్దేరారు. ఆయన వాహనాన్ని తిరుమలాయపాలెం మండలం చంద్రుతండా సమీపంలో వెంకన్న మనుషులు అడ్డగించేందుకు ప్రయత్నించారు. చైర్మన్, తన వాహనాన్ని ఆపకపోవడంతో వెనుక నుంచి తమ కారుతో బలంగా ఢీకొట్టారు. చైర్మన్ ఆదేశంతో ఇన్నోవాను డ్రైవర్ నవీన్ ఆపా డు. చైర్మన్ నర్సిరెడ్డిని కిడ్నాప్ చేసేందుకు దుండగులు యత్నించారు. అదే సమయంలో, వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వస్తోంది. ఇంతలో ఆ కిడ్నాపర్లు తమ రెండు కార్లను అక్కడే వదిలేసి పారిపోయారు. చైర్మన్ నర్సిరెడ్డి, ఆయనతోపాటు ప్రయాణించిన ఏజీఎం ప్రసాద్ కలిసి ఆ బస్సుకు అడ్డంగా నిలుచున్నారు. ఆ బస్సులో ఎక్కి మరిపెడ బంగ్లా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కిడ్నాపర్ల కారు నంబర్ ఆధారంగా కూసుమంచి, ఖమ్మం రూరల్ సీఐలు వసంత్‌కుమార్, తిరుపతిరెడ్డి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, ముదిగొండ ఎస్ఐలు సర్వయ్య, చిరంజీవి, భానుప్రకాష్ బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం ముమ్మరంగా గాలించారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో కొక్కిరేణి స్టేజీ వద్ద వెంకన్న(కిడ్నాప్ పథకం సూత్రధారి)తోపాటు గ్యాంగులోని సభ్యులు పసునూరి నాగేశ్వరరావు, నూనావత్ కిరణ్‌కుమార్, భావ్‌సింగ్, బాదావత్ రాజ్‌కుమార్, బూరల వెంకన్న, బూర్గుల నరేష్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసును ఛేదించిన పోలీసు అధికారులను పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ అభినందించి మెమోంటోలు బహుకరించినట్టు, నిందితులను కోర్టులో రిమాండ్ చేయనున్నట్టు ఏసీపీ తెలిపారు. చైర్మన్ కిడ్నాప్ యత్నం వ్యవహారంలో ఒకరిద్దరు బ్యాంకు అధికారుల పాత్ర కూడా ఉన్నట్టు సమాచారముందని, దీనిపై కూడా విచారణ సాగిస్తున్నామని అన్నారు. సమావేశంలో కూసుమంచి సీఐ వసంత్‌కుమార్, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ ఎస్ఐలు సర్వయ్య, చిరంజీవి పాల్గొన్నారు. -
ఏపీజీవీబీ చైర్మన్ కిడ్నాప్ కేసులో పురోగతి
తిరుమలాయపాలెం : ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన ఏపీజీవీబీ చైర్మన్ వి.నర్సిరెడ్డి కిడ్నాప్ కేసునులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ నెల 25న ఖమ్మం జిల్లాలో ఏపీజీవీబీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చి కారులో వరంగల్ వెళ్తున్న చైర్మన్ నర్సిరెడ్డిని వేరొక కారులో నలుగురు దుండగులు అనుసరించారు. తిరుమలాయపాలెం మండలం చంద్రుతండా సమీపంలో నర్సిరెడ్డి కారును ఆ నలుగురు దుండగులు అడ్డగించారు. ఆయనను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. నర్సిరెడ్డి చాకచక్యంగా తప్పించుకున్నారు. నిందితులు తమ కారును అక్కడే వదిలేసి పారిపోయారు. సీసీ కెమెరాల పుటేజీ, దుండగులు వదిలేసిన కారు నంబర్ ఆధారంగా వారిని (దుండగులను) కొద్ది గంటల్లోనే ఖమ్మం రూరల్ ఏసీపీ పింగళి నరేష్‌రెడ్డి గుర్తించారు. వారిని పట్టుకునేందుకు ముగ్గురు సీఐల ఆధ్వర్యంలో నాలుగు బృందాలను పంపించారు. కిడ్నాప్ దుండగులు నలుగురిలో రాత్రికి రాత్రే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్యాంక్ ఉద్యోగే సూత్రధారి...? చైర్మన్ నర్సిరెడ్డిని కిడ్నాప్ చేసేందుకు మహబూబాబాద్ జిల్లా గూడూరు ఏపీజీవీబీ ఉద్యోగి పథకం రచ్చించాడు. విశ్వసనీయంగా తెలిసిన వివరాలు... కిడ్నాప్ కోసం మహబూబాద్ సమీపంలోని గిరిజన తండాకు చెందిన ముగ్గురిని ఆ ఉద్యోగి నియమించాడు. తమను గూడూరు ఏపీజీవీబీ ఉద్యోగి పంపించారని చెప్పారు. ఆ బ్యాంక్ ఉద్యోగి, 15 సంవత్సరాల క్రితం సస్పెండయి, ప్రస్తుతం గూడూరు బ్రాంచిలో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. నాలుగేళ్ల నుంచి చైర్మన్ నర్సిరెడ్డితో ఎలాంటి సంబంధాలు లేవు. అయినప్పటికీ, చైర్మన్‌ను కిడ్నాప్ చేసేందుకు పథకం ఎందుకు వేశాడన్నది ప్రస్తుతానికి మిస్టరీ. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అతని కోసం రూరల్ ఏసీపీ పర్యవేక్షణలో ఇంటిలిజెన్స్ డీఎస్పీ రహమాన్, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, ఇంటిలిజెన్స్ సీఐలు తిరుపతిరెడ్డి, వసంతకుమార్, కరుణాకర్, ఎస్ఐలు సర్వయ్య, చిరంజీవి, భానుప్రకాశ్ తీవ్రంగా గాలిస్తున్నారు. -
ఏపీజీవీబీ చైర్మన్ కిడ్నాప్‌నకు యత్నం
తిరుమలాయపాలెం : ఆంధ్రప్రదేశ్ గ్రామీణవికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) చైర్మన్ వి.నర్సిరెడ్డిని ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం చంద్రుతండా వద్ద కిడ్నాప్ చేసేందుకు నలుగురు దుండగులు యత్నించిన సంఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నర్సిరెడ్డి అసిస్టెంట్ మేనేజర్ ప్రసాద్‌తో కలిసి బుధవారం ఉదయం కొత్తగూడెంలో గ్రామీణ బ్యాంక్ రీజినల్ స్థాయి కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం..ఖమ్మం రీజినల్ ఆఫీస్‌లో బ్యాంక్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. సాయంత్రం 6:30 గంటలప్పుడు తన ఇన్నోవా వాహనంలో వరంగల్ బయల్దేరారు. ఈయన ఖమ్మంతో పాటు 8 జిల్లాలకు బ్యాంక్ చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా..హెడ్డాఫీస్ వరంగల్ కావడంతో అక్కడికి వెళుతున్నారు. తిరుమలాయపాలెం మండలం చంద్రుతండా వద్దకు రాగానే వెనుక నుంచి ఓ కారు హారన్ కొడుతూ ఈయన వాహనాన్ని ఓవర్టేక్ చేసేందుకు తరచూ యత్నిస్తూ, ఓ సారి వెనుకనుంచీ ఢీకొట్టడంతో ఆగిపోయారు. కారులోంచి దిగిన నలుగురు వ్యక్తులు మద్యం మత్తులో ఒక్కసారిగా వీరి వద్దకు వచ్చి..డ్రైవర్‌ను వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరించారు. తాము చైర్మన్‌ను కిడ్నాప్ చేస్తామని బెదిరించారు. డ్రైవర్ భయంతో అరవడంతో..చైర్మన్ తన వాహనంలోంచి ఒక్క ఉదుటున బయటికి రావడం..అదే సమయంలో వరంగల్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ఎదురెళ్లి చేతులెత్తడంతో అది ఆగింది. దీంతో..ఆయన అందులోకి ఎక్కి మరిపెడ (బంగ్లా)లో దిగి..పోలీసులను ఆశ్రయించారు. వారు చైర్మన్‌ను తీసుకొచ్చి.. సంఘటనా ప్రదేశాన్ని పరిశీలించి, ఇది తమ పరిధి కాదని, తిరుమలాయపాలెం పోలీసులకు సమాచారం ఇచ్చారు. చైర్మన్ బస్సును ఆపుజేయడంతోటే నిందితులు కారును వదిలి పరారయ్యారు. ఆ వాహనంలో దాడి చేసేందుకు వినియోగించే దొడ్డు కర్రలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కారును తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తనకు వ్యక్తిగత కక్షలు లేవని, పాలనాపరంగా సిబ్బందిపై చర్యలు తీసుకోవడం తప్పా..తానెవరిపై వ్యక్తిగతంగా కక్ష కట్టలేదని, ఈ కిడ్నాప్ యత్నం ఎందుకు జరిగిందో, ఎవరు చేయజూశారో అర్థం కావట్లేదని చైర్మన్ నర్సిరెడ్డి వివరించారు. కారులోని కాగితాలను పరిశీలించగా.. ఉసిళ్ల రవీందర్ పేరిట రిజిస్ట్రేషన్ అయినట్లుగా గుర్తించారు. చైర్మన్ నర్సిరెడ్డి ఫిర్యాదు మేరకు..ఏసీపీ నరేష్‌రెడ్డి, కూసుమంచి, ఖమ్మం రూరల్ సీఐలు వసంతకుమార్, తిరుపతిరెడ్డి, ఎస్ఐ సర్వయ్య అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ టీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. చంపేస్తామని బెదిరించారు.. ఎన్ని డబ్బులైనా ఇస్తామని, చైర్మన్‌ను వదిలేయాలని బెదిరించినా తి రగబడి ఎదిరించా. వాళ్లు నా∙మెడను గట్టిగా పట్టుకుని, పర్సును కూడా లాక్కెళ్లారు. -
బ్యాంకు అధికారుల వినూత్న ధర్నా
వరంగల్ రూరల్ జిల్లా : బ్యాంకు అధికారులు వినూత్నంగా ధర్నా చేపట్టిన సంఘటన వర్ధన్నపేట మండలం ఇల్లందలో చోటుచేసుకుంది. అప్పులు చెల్లించండి లేకపోతే బ్యాంక్ అధికారులు మీ ఇంటి ముందు ధర్నా చేస్తారు..అంటూ బకాయిదారుల ఇంటి ముందు బ్యాంకు అధికారులు ధర్నాకు దిగిన సంఘటన వర్ధన్నపేట మండలం ఇల్లందలో చోటు చేసుకుంది. వర్ధన్నపేట మండలం ఇల్లంద ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్(ఏపీజీవీబీ) నుంచి పార్వతీ అనే డ్వాక్రా మహిళ సంఘానికి 7.5లక్షలు రూపాయలు 2016, ఫిబ్రవరి 26న నాడు మంజూరు అయింది. ఇప్పటివరకు వడ్డీతో కలిపి రూ.7.96 లక్షలు అయింది. నెలల తరబడి ఇండ్ల చుట్టూ తిరిగినా బకాయిలు కట్టకపోవటంతో విసుగెత్తిన బ్యాంకు అధికారులు బకాయి దారుల ఇంటి ముందు ధర్నాకు దిగారు. బకాయి చెల్లించాలని బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ స్రవంతి, బకాయిదారుల ఇంటికి వెళ్లి అడిగితే దుర్బాషలాడారు. దీంతో చేసేదేమీ లేక ఈ విధంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. -
బ్యాంక్‌లో అగ్నిప్రమాదం
జనగామ: జిల్లా కేంద్రంలోని ఏపీజీవీబీ బ్యాంక్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. కోర్టు ఆవరణంలో ఉన్న బ్యాంకులో సోమవారం ఉదయం మంటలు చెలరేగాయి. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపకసిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనలో భారీగా ఆస్థి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. -
ఏపీజీవీబీకి రూ.352 కోట్ల నికర లాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీబీ) 2016–17లో రూ.352 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 57.5 శాతం ఎక్కువ. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ఈ స్థాయిలో ఫలితాలను నమోదు చేయడం భారత్‌లో ఇదే తొలిసారి అని ఏపీజీవీబీ చైర్మన్ వి.నర్సిరెడ్డి గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్లు 25.65 శాతం అధికమై రూ.12,818 కోట్లుగా ఉంది. అడ్వాన్సులు 16.66 శాతం పెరిగి రూ.12,368 కోట్లకు చేరాయి. మొత్తం వ్యాపారం రూ.20,804 కోట్ల నుంచి రూ.25,187 కోట్లను తాకింది. నికర నిరర్ధక ఆస్తులు 2.38 నుంచి 1.69 శాతానికి చేరాయి. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఎం) 3.58 నుంచి 3.86 శాతానికి చేరింది. ఎన్ఐఎం వల్లే ఉత్తమ ఫలితాలను నమోదు చేసినట్టు బ్యాంకు తెలిపింది. అట్రిషన్ కారణంగా.. ప్రస్తుతం బ్యాంకుకు 4,500 మంది సిబ్బంది అవసరం. ఉన్న ఉద్యోగుల సంఖ్య 3,012 మాత్రమే. 2016–17లో 275 మంది కొత్తవారు కావాలని ఐబీపీఎస్‌ను కోరితే, 193 మంది రిపోర్టు చేశారు. వీరిలో 83 మంది రాజీనామా చేశారు. 2017–18కి 485 మందిని కోరితే, 215 మంది రిపోర్టు చేశారు. వీరిలో 19 మంది రాజీనామా చేశారు. కొత్తవారి రాజీనామా, ఉద్యోగుల పదవీ విరమణతో సిబ్బంది కొరత ఏర్పడి బ్యాంకుకు తలనొప్పిగా మారింది. ఏది ఏమైనప్పటికీ ఈ ఏడాది కొత్తగా 45 శాఖలను తెరుస్తామని నర్సిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. -
మొబైల్ బ్యాంకింగ్‌లోకి ఏపీ గ్రామీణ వీకాస్ బ్యాంక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : బ్యాంకింగ్ రంగంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను ఆవిష్కరించింది. నెఫ్ట్ విధానంలో ఖాతాదారులు ఇతర బ్యాంకు ఖాతాకు సులభంగా నగదు బదిలీ చేయవచ్చు. ఖాతా బ్యాలెన్స్, అయిదు లావాదేవీలు, ఫిక్స్డ్ డిపాజిట్స్ బ్యాలెన్స్ చూసుకోవచ్చు. మొబైల్ బ్యాంకింగ్ సేవలను 2016 సెప్టెంబర్ నాటికి 2 లక్షల మంది కస్టమర్లకు చేరువ చేయాలని ఏపీజీవీబీ లక్ష్యంగా చేసుకుంది. అలాగే ఈ సంఖ్యను వచ్చే ఏడాది మార్చి నాటికి 10 లక్షలకు చేర్చాలని కృతనిశ్చయంతో ఉంది. శనివారం జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో ఎస్బీఐ రూరల్ బిజినెస్ సీజీఎం కె.ఎం.త్రివేది, ఏపీజీవీబీ చైర్మన్ వి.నర్సిరెడ్డి, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. -
ఖాతాదారులకు మెరుగైన సేవలు
మేడిపూర్: గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకుమిత్ర ద్వారా సేవలు అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీబీ) మేనేజర్ పత్యానాయక్ అన్నారు. శనివారం మండలంలోని మేడిపూర్‌లో నిర్వహించిన ఖాతాదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటి వద్దే బ్యాంకింగ్ సేవలు ఇచ్చేందుకు బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నాన్నారు. అనుకూల పనివేళల్లో డబ్బు జమచేసేందుకు ఖాతాదారులకు వీలుంటుందని విధిగా రసీదును పొందాలన్నారు. గ్రామీణులు ఆడంబరాలకు పోకుండా ఉన్న డబ్బుతో పొదుపు పాటించాలన్నారు. స్వయం ఉపాధి పథకాలను ఎంపిక చేసుకుని బ్యాంకు నుంచి పొందిన రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆయన సూచించారు. సామాజిక భద్రతతోపాటు పంటల బీమా చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు కె.మల్లేష్, బ్యాంకు అసిస్టెంట్ వెంకటేష్ పాల్గొన్నారు. -
ఒక్క రోజులో 23 ఏపీజీవీబీ శాఖలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్(ఏపీజీవీబీ) తన బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం ఒక్క రోజులో 23 కొత్త బ్యాంక్ శాఖలను ప్రారంభించింది. ఈ 23 శాఖలను ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ హరదయాళ్ ప్రసాద్ ఎలక్ట్రానిక్ పద్ధతిలో ప్రారంభించారని ఏపీజీవీబీ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా బ్యాంక్ ఖాతాల ప్రారంభించడం మరింత సులభం చేసే ఈ-కేవైసీ, మొబైల్ ఏటీఎంలను కూడా ఆయన ప్రారంభించారని పేర్కొంది. ఏపీజీవీబీ ప్రారంభమై పదేళ్లైందని, ఈ పదేళ్లలో ఈ బ్యాంక్ పలు అద్భుతాలను సాధించిందని ఈ సందర్భంగా హర్దయాళ్ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నాటికి రూ.3,300 కోట్ల వ్యాపారాన్ని సాధించామని ఏపీజీవీబీ చైర్మన్ వి. నరసి రెడ్డి తెలిపారు. -
ఏపీజీవీబీ ఎదుట రైతుల ధర్నా
- కవర్ చేసేందుకు వెళ్లిన విలేకరులపై ఫీల్డ్ ఆఫీసర్ చిందులు - అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు వెల్దుర్తి : పంట రుణమాఫీ వర్తింపజేయడంలో బ్యాంక్ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొం టూ సోమవారం వెల్దుర్తిలోని ఏపీజీవీబీ ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంక్‌లో ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న భరత్‌కుమార్ అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ రుణాల కోసం బ్యాంకుకు వచ్చే రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. ప్రభుత్వం మంజూరు చేసిన రెండో విడత పంట రుణమాఫీ డబ్బుల నుంచి వడ్డీ, బీమా డబ్బులతో పాటు ఆ కుటుంబంలో మహిళలు తీసుకున్న డ్వాక్రా రుణాలను సైతం వసూలు చేస్తున్నాడని పేర్కొన్నారు. అలాగే రుణమాఫీ ద్వారా వచ్చే మొత్తం నుంచి వెయ్యికి రూ.5 నుంచి రూ.10 వరకు సిబ్బంది కమీషన్ రూపంలో తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా రైతుల ధర్నా విషయం తెలుసుకుని బ్యాంకుకు వెళ్లిన విలేకరులపై ఫీల్డ్ ఆఫీసర్ భరత్‌కుమార్ చిందులు తొక్కాడు. నా ఇష్టం.. నా లెక్క నాది.. మీ ఇష్టం వచ్చింది రాసుకోండి.. రైతుల ధర్నాకు బెదిరేది లేదు.. ఇక్కడ కాకపోతే మరో బ్యాంకుకు వెళ్తా అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు సదరు అధికారిపై చర్యలు తీసుకునే వరకు బ్యాంకుకు రామని, ప్రతి రోజు బ్యాంకు ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించి వెనుదిరిగారు. -
జన్‌ధన్ ఖాతాపై డిపాజిట్ గన్!
శ్రీకాకుళం పాత బస్టాండ్: పొదుపును ప్రోత్సహించడం, పేదలకు బీమా సౌకర్యం కల్పించడం, భవిష్యత్తులో అన్ని రకాల సంక్షేమ ఫలాలను బ్యాంకు ఖాతాలకే జమ చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకం కొన్ని బ్యాంకుల నిర్వాకం కారణంగా ఖాతాదారులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది.పేదలను దృష్టిలో పెట్టుకొని కనీస డిపాజిట్ కూడా అవసరం లేకుండా జీరో బ్యాలెన్స్‌తో జన్‌ధన్ ఖాతాలు తెరవాలని నిబంధనల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే కొన్ని బ్యాంకులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్(ఏపీజీవీబి) రూ.500 డిపాజిట్‌ను డిమాండ్ చేస్తోంది. ముందు డిపాజిట్ లేకుండా ఖాతా తెరిచినా.. కనీస డిపాజిట్ కట్టనిదే పాస్‌పుస్తకం ఇచ్చేది లేదని పలు శాఖల అధికారులు స్పష్టం చేస్తుండటంతో కొత్త ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నారు. లక్ష్యానికి దూరంగా.. అన్ని కుటుంబాలకు జన్‌ధన్ ఖాతా ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని ఇటువంటి కొన్ని లోపాల కారణంగా చేరుకోలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో 27 ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు చెందిన 263 శాఖలు ఉన్నాయి. వీటన్నింటిలోనూ జన్‌ధన్ ఖాతాలు తెరుస్తున్నారు. అయితే ఏపీజీవీబీ శాఖల్లో మాత్రమే రూ.500 కనీస డిపాజిట్ వసూలు చేస్తున్నారని ఆ బ్యాంకులో ఖాతాలు తెరిచిన పలువురు ఆరోపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఏపీజీవీబీ శాఖలే ఉన్నాయి. బిజినెస్ ప్రొవైడర్ల ద్వారా ఈ శాఖల పరిధిలోని గ్రామాల్లో వేల సంఖ్యలో కొత్త ఖాతాలు తెరిపించారు. ఖాతాలు తెరిచిన వారు ఆయా శాఖలకు వెళ్లి పాస్‌పుస్తకాలు అడిగితే కనీస డిపాజిట్ కట్టాలని, అప్పుడే పాస్ పుస్తకం ఇస్తామని బ్యాంకు ఆధికారులు స్పష్టం చేస్తున్నారని ఖాతాదారులు వాపోతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 8.83 లక్షల కుటుంబాలు ఉన్నాయి. వీటన్నింటికీ ఖాతాలు తెరవాలన్నది లక్ష్యంగా ఇప్పటివరకు సుమారు 4 ల క్షల ఖాతాలు ఉన్నాయి. కాగా గత నవంబర్‌లో ప్రారంభమైన జన్‌ధన్ పథకం కింద 2.30 లక్షల ఖాతాలు తెరిచారు. కనీస బ్యాలెన్స్ పేరుతో ఏపీజీవీబీ ఒత్తిడి చేస్తుండటంతో కొత్తవారు ఖాతాలు తెరిచేందుకు ముందురాని పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామిరెడ్డి వద్ద ప్రస్తావించగా జన్‌ధన్ ఖాతాలకు కనీస డిపాజిట్ అవసరం లేదని స్పష్టం చేశారు. ఇలా వసూలు చేస్తున్న బ్యాంకు ఉన్నతాధికారులతో మాట్లాడి ఈ సమస్య లేకుండా చేస్తానని చెప్పారు.