కిడ్నాపర్లు ఉపయోగించిన రెండు కార్లు ఇవే..
తిరుమలాయపాలెం : ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన ఏపీజీవీబీ చైర్మన్ వి.నర్సిరెడ్డి కిడ్నాప్ కేసునులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ నెల 25న ఖమ్మం జిల్లాలో ఏపీజీవీబీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చి కారులో వరంగల్ వెళ్తున్న చైర్మన్ నర్సిరెడ్డిని వేరొక కారులో నలుగురు దుండగులు అనుసరించారు. తిరుమలాయపాలెం మండలం చంద్రుతండా సమీపంలో నర్సిరెడ్డి కారును ఆ నలుగురు దుండగులు అడ్డగించారు.
ఆయనను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. నర్సిరెడ్డి చాకచక్యంగా తప్పించుకున్నారు. నిందితులు తమ కారును అక్కడే వదిలేసి పారిపోయారు. సీసీ కెమెరాల పుటేజీ, దుండగులు వదిలేసిన కారు నంబర్ ఆధారంగా వారిని (దుండగులను) కొద్ది గంటల్లోనే ఖమ్మం రూరల్ ఏసీపీ పింగళి నరేష్‌రెడ్డి గుర్తించారు. వారిని పట్టుకునేందుకు ముగ్గురు సీఐల ఆధ్వర్యంలో నాలుగు బృందాలను పంపించారు. కిడ్నాప్ దుండగులు నలుగురిలో రాత్రికి రాత్రే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బ్యాంక్ ఉద్యోగే సూత్రధారి...?
చైర్మన్ నర్సిరెడ్డిని కిడ్నాప్ చేసేందుకు మహబూబాబాద్ జిల్లా గూడూరు ఏపీజీవీబీ ఉద్యోగి పథకం రచ్చించాడు. విశ్వసనీయంగా తెలిసిన వివరాలు... కిడ్నాప్ కోసం మహబూబాద్ సమీపంలోని గిరిజన తండాకు చెందిన ముగ్గురిని ఆ ఉద్యోగి నియమించాడు. తమను గూడూరు ఏపీజీవీబీ ఉద్యోగి పంపించారని చెప్పారు. ఆ బ్యాంక్ ఉద్యోగి, 15 సంవత్సరాల క్రితం సస్పెండయి, ప్రస్తుతం గూడూరు బ్రాంచిలో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు.
నాలుగేళ్ల నుంచి చైర్మన్ నర్సిరెడ్డితో ఎలాంటి సంబంధాలు లేవు. అయినప్పటికీ, చైర్మన్‌ను కిడ్నాప్ చేసేందుకు పథకం ఎందుకు వేశాడన్నది ప్రస్తుతానికి మిస్టరీ. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అతని కోసం రూరల్ ఏసీపీ పర్యవేక్షణలో ఇంటిలిజెన్స్ డీఎస్పీ రహమాన్, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, ఇంటిలిజెన్స్ సీఐలు తిరుపతిరెడ్డి, వసంతకుమార్, కరుణాకర్, ఎస్‌ఐలు సర్వయ్య, చిరంజీవి, భానుప్రకాశ్ తీవ్రంగా గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment