ఏపీజీవీబీ ఎదుట రైతుల ధర్నా
- కవర్ చేసేందుకు వెళ్లిన విలేకరులపై ఫీల్డ్ ఆఫీసర్ చిందులు
- అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు
వెల్దుర్తి : పంట రుణమాఫీ వర్తింపజేయడంలో బ్యాంక్ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొం టూ సోమవారం వెల్దుర్తిలోని ఏపీజీవీబీ ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంక్‌లో ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న భరత్‌కుమార్ అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ రుణాల కోసం బ్యాంకుకు వచ్చే రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. ప్రభుత్వం మంజూరు చేసిన రెండో విడత పంట రుణమాఫీ డబ్బుల నుంచి వడ్డీ, బీమా డబ్బులతో పాటు ఆ కుటుంబంలో మహిళలు తీసుకున్న డ్వాక్రా రుణాలను సైతం వసూలు చేస్తున్నాడని పేర్కొన్నారు.
అలాగే రుణమాఫీ ద్వారా వచ్చే మొత్తం నుంచి వెయ్యికి రూ.5 నుంచి రూ.10 వరకు సిబ్బంది కమీషన్ రూపంలో తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా రైతుల ధర్నా విషయం తెలుసుకుని బ్యాంకుకు వెళ్లిన విలేకరులపై ఫీల్డ్ ఆఫీసర్ భరత్‌కుమార్ చిందులు తొక్కాడు. నా ఇష్టం.. నా లెక్క నాది.. మీ ఇష్టం వచ్చింది రాసుకోండి.. రైతుల ధర్నాకు బెదిరేది లేదు.. ఇక్కడ కాకపోతే మరో బ్యాంకుకు వెళ్తా అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు సదరు అధికారిపై చర్యలు తీసుకునే వరకు బ్యాంకుకు రామని, ప్రతి రోజు బ్యాంకు ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించి వెనుదిరిగారు.