వివరాలు వెల్లడిస్తున్న ఖమ్మం రూరల్ ఏసీపీ పింగళి నరేష్‌రెడ్డి
తిరుమలాయపాలెం: జిల్లాలో సంచలనం సృష్టించిన ఏపీజీవీబీ చైర్మన్ వి.నర్సిరెడ్డి కిడ్నాప్ యత్నం కేసును పోలీసులు ఛేదించారు. ఏడుగురిని సోమ వారం ఉదయం అరెస్ట్ చేశారు. సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఖమ్మం రూరల్ ఏసీపీ పింగళి నరేష్‌రెడ్డి తెలిపిన వివరాలు... ఈ నెల 25న భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల పర్యటనకు వచ్చిన ఏపీజీవీబీ చైర్మన్ వి.నర్సిరెడ్డిపై మహబూబాబాద్ జిల్లా గూడూరు ఏపీజీవీబీ క్యాషియర్ చల్లమల్ల వెంకన్న కక్ష పెంచుకున్నాడు.
తన ఇంటి లోన్ రుణం చెల్లించినప్పటికీ బ్యాంకులో తీసుకున్న ఓడీ(ఓవర్ డ్రాఫ్ట్) తో ముడిపెట్టి కాగితాలు ఇవ్వకుండా చైర్మన్ తిప్పుతున్నాడని, బయ్యారం బ్యాంకులో పనిచేస్తున్న సమయంలో విజిటింగ్‌కి వచ్చినప్పుడు దురుసుగా వ్యవహరించాడని మనసులో పెట్టుకున్నాడు. చైర్మన్‌ను కిడ్నాప్ చేసేందుకు క్యాషియర్ వెంకన్న పథకం రచించాడు. చైర్మన్‌ను కిడ్నాప్ చేసి బెదిరించడంతో పాటు డబ్బులు డిమాండ్ చేయాలనుకున్నాడు.
వాటాలు ఇస్తానంటూ ఆరుగురిని జమ చేశాడు. రెండు కార్లను సమకూర్చుకున్నారు. చైర్మన్‌ను కిడ్నాప్ చేసేందుకు హైదరాబాద్, వరంగల్‌లో రెక్కీ నిర్వహించారు. ఈ నెల 25న కొత్తగూడెంలో ఏపీజీవీబీ రీజనల్ కార్యాలయ ప్రారంభోత్సవానికి చైర్మన్ వస్తున్నారన్న విషయాన్ని క్యాషియర్ వెంకన్న తెలుసుకున్నాడు. రెండు కార్లలో కారం పొట్లాలు, కర్రలు, తాడు సిద్ధంగా ఉంచుకున్నారు. ఖమ్మంలోని రీజనల్ కార్యాలయంలో సమావేశం అనంతరం వరంగల్‌కు ఇన్నోవా వాహనంలో చైర్మన్ నర్సిరెడ్డి బయల్దేరారు.
ఆయన వాహనాన్ని తిరుమలాయపాలెం మండలం చంద్రుతండా సమీపంలో వెంకన్న మనుషులు అడ్డగించేందుకు ప్రయత్నించారు. చైర్మన్, తన వాహనాన్ని ఆపకపోవడంతో వెనుక నుంచి తమ కారుతో బలంగా ఢీకొట్టారు. చైర్మన్ ఆదేశంతో ఇన్నోవాను డ్రైవర్ నవీన్ ఆపా డు. చైర్మన్ నర్సిరెడ్డిని కిడ్నాప్ చేసేందుకు దుండగులు యత్నించారు. అదే సమయంలో, వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వస్తోంది.
ఇంతలో ఆ కిడ్నాపర్లు తమ రెండు కార్లను అక్కడే వదిలేసి పారిపోయారు. చైర్మన్ నర్సిరెడ్డి, ఆయనతోపాటు ప్రయాణించిన ఏజీఎం ప్రసాద్ కలిసి ఆ బస్సుకు అడ్డంగా నిలుచున్నారు. ఆ బస్సులో ఎక్కి మరిపెడ బంగ్లా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కిడ్నాపర్ల కారు నంబర్ ఆధారంగా కూసుమంచి, ఖమ్మం రూరల్ సీఐలు వసంత్‌కుమార్, తిరుపతిరెడ్డి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, ముదిగొండ ఎస్‌ఐలు సర్వయ్య, చిరంజీవి, భానుప్రకాష్ బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం ముమ్మరంగా గాలించారు.
సోమవారం ఉదయం 11 గంటల సమయంలో కొక్కిరేణి స్టేజీ వద్ద వెంకన్న(కిడ్నాప్ పథకం సూత్రధారి)తోపాటు గ్యాంగులోని సభ్యులు పసునూరి నాగేశ్వరరావు, నూనావత్ కిరణ్‌కుమార్, భావ్‌సింగ్, బాదావత్ రాజ్‌కుమార్, బూరల వెంకన్న, బూర్గుల నరేష్‌ను అరెస్ట్ చేశారు.
ఈ కేసును ఛేదించిన పోలీసు అధికారులను పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ అభినందించి మెమోంటోలు బహుకరించినట్టు, నిందితులను కోర్టులో రిమాండ్ చేయనున్నట్టు ఏసీపీ తెలిపారు. చైర్మన్ కిడ్నాప్ యత్నం వ్యవహారంలో ఒకరిద్దరు బ్యాంకు అధికారుల పాత్ర కూడా ఉన్నట్టు సమాచారముందని, దీనిపై కూడా విచారణ సాగిస్తున్నామని అన్నారు. సమావేశంలో కూసుమంచి సీఐ వసంత్‌కుమార్, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ ఎస్‌ఐలు సర్వయ్య, చిరంజీవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment