kidnappers arrested
-
నన్ను పట్టుకోలేరు
సాక్షి, సిటీబ్యూరో: నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన మనీ హెయిస్ట్ తొమ్మిది సీజన్లను తీక్షణంగా వీక్షించి.. తాను అందులోని ప్రొఫెసర్ క్యారెక్టర్‌గా ఫీల్ అవుతూ.. సిండికేట్ ఏర్పాటు చేసుకుని మరీ వరుస కిడ్నాప్‌లకు పాల్పడిన గుంజపోగు సురేష్ అలియాస్ సూరి వ్యవహారంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇతడు ఇటీవలి కాలంలో పలుమార్లు పోలీసులకు చిక్కకుండా త్రుటిలో తప్పించుకున్నాడు. ఆ సందర్భాల్లో పోలీసులు తన వాట్సాప్ స్టేటస్ చూస్తారని ఊహించాడు. దీంతో డాన్ చిత్రంలోని ‘డాన్ కో పకడ్నా ముష్కిల్ హీ నహీ, నా ముమ్కిన్ హై’ (డాన్ పట్టుకోవటం కష్టమే కాదు, అసాధ్యం కూడా) అనే డైలాగ్‌ను స్టేటస్‌గా పెట్టి సవాల్ విసిరాడు. సూరిని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన ఆసిఫ్‌నగర్ పోలీసులు అయిదు రోజుల కస్టడీకి కోరుతూ బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. సంకల్పం చెదరకూడదని పచ్చబొట్టు... భోజగుట్ట ప్రాంతానికి చెందిన సూరి డిగ్రీ పూర్తి చేశాడు. పోలీసు అధికారి అవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాడు. తన అన్న సుధాకర్‌కు ఉన్న నేరచరిత్ర నేపథ్యంలో తన దృష్టి మళ్లకుండా, సంకల్పం చెదరకుండా ఉండటానికి టాటూ వేయించుకోవాలని భావించాడు. 2006లో కుడి చేతిపై పోలీసు బొమ్మను పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. తన అన్న ప్రభావంతో తేలిగ్గా డబ్బు సంపాదించడానికి అలవాటుపడిన ఇతగాడు 2011 నుంచి నేరాలు చేయడం ప్రారంభించాడు. మరో చేతిపై ఓ సినీ నటుడి ఫొటోను టాటూగా వేయించుకున్న సూరి ఆయన మాదిరిగానే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఓ ట్రావెల్స్ కార్యాలయంలో డ్రైవర్‌గా పని చేయడంతో డ్రైవింగ్‌పై మంచి పట్టువచ్చింది. సెకండ్ హ్యాండ్ పజేరో వాహనం ఖరీదు చేసిన ఇతగాడు నేరం చేసినప్పుడు, ఆ తర్వాత వీలున్నన్ని రోజులు అందులోనే గడిపేవాడు. స్టీరింగ్‌పై ఉంటే చిక్కడం దుర్లభం... రేసర్లను తలదన్నుతూ డ్రైవింగ్ చేసే సూరి కారు డ్రైవింగ్ సీటులో ఉంటే మాత్రం పట్టుకోవడం ఎవరితరం కాదు. ఇతడిని ఫోన్ నంబర్ ఆధారంగా పట్టుకోవడానికి గతంలో సదాశివపేట, విజయవాడ పోలీసులు ప్రయత్నించారు. ఆ సందర్భంల్లో దాదాపు కిలోమీటరు దూరంగా కారును రివర్స్‌లో అత్యంత వేగంగా నడిపి తప్పించుకున్నాడు. మరోసారి పోలీసులపైకే కారు పోనిచ్చి ఉడాయించాడు. ఈ సందర్భాల్లో తన వాట్సాప్ స్టేటస్‌గా డాన్ సినిమా డైలాగ్ పెట్టాడు. పది రోజులకు పైగా గాలించిన ఆసిఫ్‌నగర్ ఇన్స్పెక్టర్ ఎన్.రవీందర్ నేతృత్వంలోని బృందం ఎట్టకేలకు ఆచూకీ కనిపెట్టింది. ఓ టోల్గేట్ వద్ద కారులో నిద్రిస్తున్న సూరిని గుర్తించింది. మూడు గంటలు శ్రమించి ఆ వాహనం చుట్టూ ఇతర వాహనాలు ఆపి పట్టుకోగలిగింది. బిహారీ మాదిరిగా బిల్డప్.. స్నేహితులకు స్నేహితులో, పరిచయస్తులనో మాత్రమే టార్గెట్‌గా చేసుకుని, యువతితో డేటింగ్ ట్రాప్ వేయించి కిడ్నాప్ చేసే సూరి తాను కిడ్నాప్ చేసిన వారి వద్ద బిహారీ మాదిరిగా బిల్డప్ ఇస్తాడు. తాను కనిపించకుండా అనుచరులతో కిడ్నాప్ చేయిస్తాడు. ఆపై వారికి కళ్లకు గంతలు, ముఖానికి తొడుగులు వేశాకే రంగంలోకి దిగుతాడు. బాధితులతో హిందీలో మాట్లాడుతూ బిహార్‌కు చెందిన కిడ్నాపింగ్ గ్యాంగ్‌గా నమ్మిస్తాడు. వారి కుటుంబీకుల నుంచి డబ్బు ముట్టిన తర్వాత ప్లేట్ ఫిరాయిస్తాడు. తానే అతికష్టమ్మీద కిడ్నాపర్ల నుంచి రెస్క్యూ చేసినట్లు బిల్డప్ ఇస్తాడు. ఈ నేపథ్యంలోనే అనేక మంది బాధితులు పోలీసుల కదలికలపై ఇతడికే సమాచారం ఇస్తూ వచ్చారు. ఇతడిని పట్టుకున్న తర్వాత పోలీసులు వారితో సూరినే కిడ్నాపర్ అని చెప్పినా కొందరు నమ్మలేదు. పొడవాటి గడ్డం, సిగతో కూడిన తలకట్టు, జీన్స్, టీషర్ట్స్‌తో తిరిగే సూరి ప్రతి అంశంలోనూ ఎవరో ఒకరిని స్ఫూర్తిగా తీసుకున్నాడని, నడిచిన మార్గం మాత్రం సరైంది కాదని ఓ అధికారి వ్యాఖ్యానించారు. -
నలుగురు కిడ్నాపర్ల అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: బాలుడిని కిడ్నాప్ చేసిన నలుగురు కిడ్నాపర్లను నగర పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సీపీ రాజీవ్‌కుమార్ మీనా శుక్రవారం వెల్లడించారు. భిక్షాటన చేసుకుని జీవనం సాగించే దంపతులు సిరిమల్లిచెట్టు శ్రీను, భవాని తమ రెండేళ్ల కుమారుడు గణేష్‌తో టీఎస్ఆర్ కాంప్లెక్స్ సమీపంలోని ఇరానీ టీస్టాల్ వద్ద ఈ నెల 20న సోమవారం నిద్రపోయారు. అదేరోజు రాత్రి 11:30 గంటల సమయంలో విజయనగరం పట్టణానికి చెందిన పటాన్ సల్మాన్‌ఖాన్, షేక్ సుభాని, బండారు రోషన్‌రాజు మద్యం మత్తులో టీఎస్ఆర్ కాంప్లెక్స్‌లో టిఫిన్ చేస్తున్నారు. ఆ సమయంలో వారికి కనిపించిన బాబును తీసుకుని ఆటోలో పరారయ్యారు. అక్కడి నుంచి విజయనగరం చేరుకుని సుబట్ల గౌరికి బాబును అప్పగించారు. తల్లిదండ్రుల ఆందోళనతో స్థానికులు అప్రమత్తమై ఆటో నంబర్ (ఏపీ 35వై 3371) నమోదు చేసుకుని మంగళవారం ఉదయం మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే అప్రమత్తమై నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా కిడ్నాపర్లు విజయనగరం వెళ్లినట్లు గుర్తించి... ముగ్గురు యువకులను, ఓ మహిళను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా నిందితుల్లో ఒకరైన బండారు రోషన్‌రాజు వరుసకు మేనత్త అయిన సుబట్ల గౌరి కోరిక మేరకే ఈ కిడ్నాప్ చేసినట్లు తేలింది. తన చెల్లెలుకి పిల్లలు లేరని, ఎవరినైనా తీసుకొచ్చి ఇస్తే పెంచుకుంటుందని చెప్పింది. దీంతో ఈ నెల 20న సాయంత్రం సల్మాన్‌ఖాన్, షేఖ్ సుభాని, రోషన్ రాజు విజయనగరం నుంచి సింహాచలంలో ఉంటున్న బంధువుల ఇంటికి రేషన్ బియ్యం, సరకులు తీసుకొచ్చారు. అనంతరం నగరంలోని టీఎస్ఆర్ కాంప్లెక్స్‌కు చేరుకుని అక్కడ కనిపించిన బాలుడు గణేష్‌ను కిడ్నాప్ చేశారని సీపీ వెల్లడించారు. ఆటోతోపాటు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించామని తెలిపారు. తక్కువ సమయంలో నిందితులను పట్టుకున్న సీఐ కె.వెంకటరావు, ఎస్ఐలు పాపారావు, నరసింహరాజులను అభినందించారు. ఈ నెల 18న ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా ఇదే బాలుడు గణేష్ రోడ్డుపై ఒంటరిగా ఆడుకుని కనిపించగా సీడబ్ల్యూసీ ద్వారా తల్లిదండ్రులు సిరిమల్లిచెట్టు శ్రీను, భవానిలకు అప్పగించామని సీపీ తెలిపారు. సమావేశంలో డీసీపీ – 1 ఐశ్వర్య రస్తోగి, ఏసీపీ కులశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీజీవీబీ చైర్మన్ కిడ్నాపర్ల అరెస్ట్
తిరుమలాయపాలెం: జిల్లాలో సంచలనం సృష్టించిన ఏపీజీవీబీ చైర్మన్ వి.నర్సిరెడ్డి కిడ్నాప్ యత్నం కేసును పోలీసులు ఛేదించారు. ఏడుగురిని సోమ వారం ఉదయం అరెస్ట్ చేశారు. సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఖమ్మం రూరల్ ఏసీపీ పింగళి నరేష్‌రెడ్డి తెలిపిన వివరాలు... ఈ నెల 25న భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల పర్యటనకు వచ్చిన ఏపీజీవీబీ చైర్మన్ వి.నర్సిరెడ్డిపై మహబూబాబాద్ జిల్లా గూడూరు ఏపీజీవీబీ క్యాషియర్ చల్లమల్ల వెంకన్న కక్ష పెంచుకున్నాడు. తన ఇంటి లోన్ రుణం చెల్లించినప్పటికీ బ్యాంకులో తీసుకున్న ఓడీ(ఓవర్ డ్రాఫ్ట్) తో ముడిపెట్టి కాగితాలు ఇవ్వకుండా చైర్మన్ తిప్పుతున్నాడని, బయ్యారం బ్యాంకులో పనిచేస్తున్న సమయంలో విజిటింగ్‌కి వచ్చినప్పుడు దురుసుగా వ్యవహరించాడని మనసులో పెట్టుకున్నాడు. చైర్మన్‌ను కిడ్నాప్ చేసేందుకు క్యాషియర్ వెంకన్న పథకం రచించాడు. చైర్మన్‌ను కిడ్నాప్ చేసి బెదిరించడంతో పాటు డబ్బులు డిమాండ్ చేయాలనుకున్నాడు. వాటాలు ఇస్తానంటూ ఆరుగురిని జమ చేశాడు. రెండు కార్లను సమకూర్చుకున్నారు. చైర్మన్‌ను కిడ్నాప్ చేసేందుకు హైదరాబాద్, వరంగల్‌లో రెక్కీ నిర్వహించారు. ఈ నెల 25న కొత్తగూడెంలో ఏపీజీవీబీ రీజనల్ కార్యాలయ ప్రారంభోత్సవానికి చైర్మన్ వస్తున్నారన్న విషయాన్ని క్యాషియర్ వెంకన్న తెలుసుకున్నాడు. రెండు కార్లలో కారం పొట్లాలు, కర్రలు, తాడు సిద్ధంగా ఉంచుకున్నారు. ఖమ్మంలోని రీజనల్ కార్యాలయంలో సమావేశం అనంతరం వరంగల్‌కు ఇన్నోవా వాహనంలో చైర్మన్ నర్సిరెడ్డి బయల్దేరారు. ఆయన వాహనాన్ని తిరుమలాయపాలెం మండలం చంద్రుతండా సమీపంలో వెంకన్న మనుషులు అడ్డగించేందుకు ప్రయత్నించారు. చైర్మన్, తన వాహనాన్ని ఆపకపోవడంతో వెనుక నుంచి తమ కారుతో బలంగా ఢీకొట్టారు. చైర్మన్ ఆదేశంతో ఇన్నోవాను డ్రైవర్ నవీన్ ఆపా డు. చైర్మన్ నర్సిరెడ్డిని కిడ్నాప్ చేసేందుకు దుండగులు యత్నించారు. అదే సమయంలో, వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వస్తోంది. ఇంతలో ఆ కిడ్నాపర్లు తమ రెండు కార్లను అక్కడే వదిలేసి పారిపోయారు. చైర్మన్ నర్సిరెడ్డి, ఆయనతోపాటు ప్రయాణించిన ఏజీఎం ప్రసాద్ కలిసి ఆ బస్సుకు అడ్డంగా నిలుచున్నారు. ఆ బస్సులో ఎక్కి మరిపెడ బంగ్లా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కిడ్నాపర్ల కారు నంబర్ ఆధారంగా కూసుమంచి, ఖమ్మం రూరల్ సీఐలు వసంత్‌కుమార్, తిరుపతిరెడ్డి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, ముదిగొండ ఎస్ఐలు సర్వయ్య, చిరంజీవి, భానుప్రకాష్ బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం ముమ్మరంగా గాలించారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో కొక్కిరేణి స్టేజీ వద్ద వెంకన్న(కిడ్నాప్ పథకం సూత్రధారి)తోపాటు గ్యాంగులోని సభ్యులు పసునూరి నాగేశ్వరరావు, నూనావత్ కిరణ్‌కుమార్, భావ్‌సింగ్, బాదావత్ రాజ్‌కుమార్, బూరల వెంకన్న, బూర్గుల నరేష్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసును ఛేదించిన పోలీసు అధికారులను పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ అభినందించి మెమోంటోలు బహుకరించినట్టు, నిందితులను కోర్టులో రిమాండ్ చేయనున్నట్టు ఏసీపీ తెలిపారు. చైర్మన్ కిడ్నాప్ యత్నం వ్యవహారంలో ఒకరిద్దరు బ్యాంకు అధికారుల పాత్ర కూడా ఉన్నట్టు సమాచారముందని, దీనిపై కూడా విచారణ సాగిస్తున్నామని అన్నారు. సమావేశంలో కూసుమంచి సీఐ వసంత్‌కుమార్, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ ఎస్ఐలు సర్వయ్య, చిరంజీవి పాల్గొన్నారు. -
డబ్బు కోసం సోదరుడి కిడ్నాప్!
లక్నో: డబ్బుల కోసం ఆశపడిన ఓ వ్యక్తి తనకు వరుసకు సోదరుడయ్యే యువకుడిని కిడ్నాప్ చేశాడు. అయితే పోలీసులు రంగంలోకి దిగి కేసును త్వరగానే పరిష్కరించారు. డబ్బు మీద ఉన్న మోజు బాధితుడి సోదరుడిని కటకటాల పాలు చేసింది. ఎస్పీ ఉమేష్ కుమార్ సింగ్ కథనం ప్రకారం... హర్దోయ్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కుమారుడు మనీష్. బీఎస్సీ చదువుతున్న ఆ యువకుడు ఏదో పని నిమిత్తం సోమవారం బయటకు వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన వరుసకు సోదరుడయ్యే మరో యువకుడు మనీష్ ను కిడ్నాప్ చేశాడు. మనీష్ ను కిడ్నాప్ చేశాం... రూ.30 లక్షలు తమకు ఇస్తేనే మీ కొడుకుని విడిచి పెడతామని అతడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి కిడ్నాపర్లు బెదిరించారు. మనీష్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాప్ నకు పాల్పడ్డ ఇద్దరు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేశారు. నాలుగురోజుల పాటు ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు కిడ్నాప్ పథకం వేసిన నిందితుడితో పాటు అతని అసిస్టెంట్ ను అదుపులోకి తీసుకుని విచారణ మొదలెట్టారు. మనీష్ ను కిడ్నాప్ చెర నుంచి విడిపించిన రెస్క్యూ సిబ్బందికి రూ.15 వేలు అందజేసి ఐజీ వారిని అభినందించారు. -
కిడ్నాపర్లు అరెస్ట్ ... రూ. 1.50 కోట్లు స్వాధీనం
కిడ్నాప్‌కు గురైన మహిళను హెబ్బగుడి పోలీసులు క్షేమంగా రక్షించారు. వారు తెలిపిన వివరాల మేరకు.. హెబ్బగుడి సమీపంలో అనుసూయమ్మ నివాసముంటోంది. ఆమె కుటుంబ సభ్యులు భూలావాదేవీలు, రియల్ వ్యాపారం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కొందరు దుండగులు అనుసూయమ్మను కిడ్నాప్ చేశారు. రూ.1.50 కోట్లను ఇవ్వాలంటూ వారు కుటుంబ సభ్యులను డిమాండ్ చేశారు. దీంతో వారు ఆ డబ్బు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఆ డబ్బును బెంగళూరు నగర శివార్లలో ఉన్న దుండగులకు ఇచ్చారు. దీంతో వారు అనుసూయమ్మ వదిలేసి.. డబ్బుతో పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. కేసు పూర్తి వివరాలు వెల్లడించడానికి హెబ్బగుడి పోలీసులు నిరాకరిస్తున్నారు.