డబ్బు కోసం సోదరుడి కిడ్నాప్!
లక్నో: డబ్బుల కోసం ఆశపడిన ఓ వ్యక్తి తనకు వరుసకు సోదరుడయ్యే యువకుడిని కిడ్నాప్ చేశాడు. అయితే పోలీసులు రంగంలోకి దిగి కేసును త్వరగానే పరిష్కరించారు. డబ్బు మీద ఉన్న మోజు బాధితుడి సోదరుడిని కటకటాల పాలు చేసింది. ఎస్పీ ఉమేష్ కుమార్ సింగ్ కథనం ప్రకారం... హర్దోయ్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కుమారుడు మనీష్. బీఎస్సీ చదువుతున్న ఆ యువకుడు ఏదో పని నిమిత్తం సోమవారం బయటకు వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన వరుసకు సోదరుడయ్యే మరో యువకుడు మనీష్ ను కిడ్నాప్ చేశాడు.
మనీష్ ను కిడ్నాప్ చేశాం... రూ.30 లక్షలు తమకు ఇస్తేనే మీ కొడుకుని విడిచి పెడతామని అతడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి కిడ్నాపర్లు బెదిరించారు. మనీష్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాప్ నకు పాల్పడ్డ ఇద్దరు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేశారు. నాలుగురోజుల పాటు ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు కిడ్నాప్ పథకం వేసిన నిందితుడితో పాటు అతని అసిస్టెంట్ ను అదుపులోకి తీసుకుని విచారణ మొదలెట్టారు. మనీష్ ను కిడ్నాప్ చెర నుంచి విడిపించిన రెస్క్యూ సిబ్బందికి రూ.15 వేలు అందజేసి ఐజీ వారిని అభినందించారు.