నలుగురు కిడ్నాపర్ల అరెస్ట్‌  | Police Arrested Kidnappers In Visakhapatnam | Sakshi
Sakshi News home page

నలుగురు కిడ్నాపర్ల అరెస్ట్‌ 

Published Sat, Jul 25 2020 6:51 AM | Last Updated on Sat, Jul 25 2020 6:51 AM

Police Arrested Kidnappers In Visakhapatnam - Sakshi

బాలుడిని తల్లిదండ్రులకు అప్పగిస్తున్న పోలీసులు

సాక్షి, విశాఖపట్నం: బాలుడిని కిడ్నాప్‌ చేసిన నలుగురు కిడ్నాపర్‌లను నగర పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీస్‌ కమిషనరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో సీపీ రాజీవ్‌కుమార్‌ మీనా శుక్రవారం వెల్లడించారు. భిక్షాటన చేసుకుని జీవనం సాగించే దంపతులు సిరిమల్లిచెట్టు శ్రీను, భవాని తమ రెండేళ్ల కుమారుడు గణేష్‌తో టీఎస్‌ఆర్‌ కాంప్లెక్స్‌ సమీపంలోని ఇరానీ టీస్టాల్‌ వద్ద ఈ నెల 20న సోమవారం నిద్రపోయారు. అదేరోజు రాత్రి 11:30 గంటల సమయంలో విజయనగరం పట్టణానికి చెందిన పటాన్‌ సల్మాన్‌ఖాన్, షేక్‌ సుభాని, బండారు రోషన్‌రాజు మద్యం మత్తులో టీఎస్‌ఆర్‌ కాంప్లెక్స్‌లో టిఫిన్‌ చేస్తున్నారు. ఆ సమయంలో వారికి కనిపించిన బాబును తీసుకుని ఆటోలో పరారయ్యారు. అక్కడి నుంచి విజయనగరం చేరుకుని సుబట్ల గౌరికి బాబును అప్పగించారు. తల్లిదండ్రుల ఆందోళనతో స్థానికులు అప్రమత్తమై ఆటో నంబర్‌ (ఏపీ 35వై 3371) నమోదు చేసుకుని మంగళవారం ఉదయం మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తక్షణమే అప్రమత్తమై నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా కిడ్నాపర్‌లు విజయనగరం వెళ్లినట్లు గుర్తించి... ముగ్గురు యువకులను, ఓ మహిళను అరెస్ట్‌ చేశారు. వారిని విచారించగా నిందితుల్లో ఒకరైన బండారు రోషన్‌రాజు వరుసకు మేనత్త అయిన సుబట్ల గౌరి కోరిక మేరకే ఈ కిడ్నాప్‌ చేసినట్లు తేలింది. తన చెల్లెలుకి పిల్లలు లేరని, ఎవరినైనా తీసుకొచ్చి ఇస్తే పెంచుకుంటుందని చెప్పింది. దీంతో ఈ నెల 20న సాయంత్రం సల్మాన్‌ఖాన్, షేఖ్‌ సుభాని, రోషన్‌ రాజు విజయనగరం నుంచి సింహాచలంలో ఉంటున్న బంధువుల ఇంటికి రేషన్‌ బియ్యం, సరకులు తీసుకొచ్చారు. అనంతరం నగరంలోని టీఎస్‌ఆర్‌ కాంప్లెక్స్‌కు చేరుకుని అక్కడ కనిపించిన బాలుడు గణేష్‌ను కిడ్నాప్‌ చేశారని సీపీ వెల్లడించారు. ఆటోతోపాటు రెండు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నామన్నారు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించామని తెలిపారు. తక్కువ సమయంలో నిందితులను పట్టుకున్న సీఐ కె.వెంకటరావు, ఎస్‌ఐలు పాపారావు, నరసింహరాజులను అభినందించారు. ఈ నెల 18న ఆపరేషన్‌ ముస్కాన్‌లో భాగంగా ఇదే బాలుడు గణేష్‌ రోడ్డుపై ఒంటరిగా ఆడుకుని కనిపించగా సీడబ్ల్యూసీ ద్వారా తల్లిదండ్రులు సిరిమల్లిచెట్టు శ్రీను, భవానిలకు అప్పగించామని సీపీ తెలిపారు. సమావేశంలో డీసీపీ – 1 ఐశ్వర్య రస్తోగి, ఏసీపీ కులశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement