visakha police
-
అచ్చెన్నాయుడు అనుచరులకు షాక్
సాక్షి, విశాఖపట్నం: అచ్చెన్నాయుడు అనుచరులకు విశాఖ పోలీసులు షాక్ ఇచ్చారు. శ్రీకాకుళానికి చెందిన టీడీపీ నాయకులు అర్థరాత్రి విశాఖలో హల్ చల్ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుండగా పోలీసులపై దౌర్జన్యం చేశారు. టీడీపీ నాయకులపై చర్యలు లేవని ‘సాక్షి’లో కథనాలు ప్రసారం చేయడంతో యంత్రాంగం కదిలింది. నలుగురు టీడీపీ నాయకులపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు.అసలేం జరిగిందంటే..పచ్చబిళ్ల చూపిస్తే పనైపోవాలి.. అంటూ గతంలో టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను పుణికిపుచ్చుకున్న ఆయన మనుషులు విశాఖలో బరితెగించారు. శ్రీకాకుళం నుంచి వచ్చి విశాఖలో పూటుగా మద్యం తాగి ట్రాఫిక్ పోలీసులపై రెచ్చిపోయారు. మంగళవారం అర్ధరాత్రి విశాఖలోని మద్దిలపాలెంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న ఎంవీపీ కాలనీ ట్రాఫిక్ పోలీసులపై ప్రతాపం చూపించారు.తనిఖీ కోసం కారు ఆపిన పోలీసులను తప్పించుకుని వేగంగా దూసుకెళ్లారు. దీంతో వారి వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసేందుకు సహకరించాలని కోరగా వారిపై రెచ్చిపోయారు. ‘ఒరేయ్ అధికార పార్టీ నాయకుల కారునే ఆపుతారా.. మీ అంతు తేలుస్తాం రా.. అచ్చెన్నాయుడి మనుషులనే అడ్డుకోవడానికి మీకు ఎంత ధైర్యం?..’ అంటూ శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం తామరాపల్లికి చెందిన టీడీపీ నాయకుడు పోలాకి ఢిల్లీశ్వరరావు తదితరులు రెచ్చిపోయారు.రోడ్డుపై వాహనాల రాకపోకలకు విఘాతం కలిగిస్తూ వీరంగం సృష్టించారు. దీంతో కొందరు పోలీసులు వారి చేష్టలను వీడియో తీసే ప్రయత్నం చేయగా వారిపైనా బెదిరింపులకు తెగబడ్డారు. ‘తీయండ్రా తీయండి.. ఎన్ని వీడియోలు కావాలంటే అన్ని వీడియోలు తీసుకోండి.. మిమ్మల్ని సస్పెండ్ చేయించి, వీఆర్‌కు పంపించకపోతే మా పేర్లు మార్చుకుంటాం’ అంటూ హెచ్చరించారు. -
Cambodia: బాధిత భారతీయులకు విముక్తి
-
మానవ అక్రమ రవాణా కేసును చేధించిన విశాఖ పోలీసులు
-
విశాఖ పోలీసుల వేట ఆపరేషన్ కంబోడియా
-
ఆన్లైన్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
దొండపర్తి : ఆన్లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాకు విశాఖ పోలీసులు చెక్ పెట్టారు. బెట్టింగ్ వేసే వారిని నిలువునా ముంచుతున్న బుకీ గ్యాంగ్‌లో 11 మందిని అరెస్ట్ చేశారు. పోలీస్ కమిషనరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం డీసీపీ–1 కె.శ్రీనివాసరావు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. క్రికెట్ బెట్టింగ్ పేరుతో రూ.8 లక్షల వరకు తనను మోసం చేశారని నగరానికి చెందిన ఒక వ్యక్తి ఇటీవల పోలీస్ స్పందనలో ఫిర్యాదు చేశాడు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయంలో తీగ లాగితే డొంక కదిలింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలానికి చెందిన మెరుపురెడ్డి సూరిబాబు ఈ ముఠాలో ప్రధాన సూత్రధారుల్లో ఒకరుగా పోలీసులు గుర్తించారు. అంతర్జాతీయ, ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో 20 నుంచి 30 మంది మంది నుంచి డబ్బులు వసూలు చేసి ఒక్కో మ్యాచ్‌కు రూ.4 లక్షల వరకు బెట్టింగ్ చేసేవాడు. ఇలా ఏడాదికి రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్లు బిజినెస్ టర్నోవర్ చేసేవాడు. ఇలా సేకరించిన మొత్తాన్ని నగరంలోని సూర్యాబాగ్ ప్రాంతంలో టూర్స్ అండ్ ట్రావెల్స్ నడిపిస్తున్న దినేష్‌కుమార్ అనే వ్యక్తికి పంపేవాడు. ఇందుకు అతడికి 2 శాతం కమీషన్ ఇచ్చేవాడు. ఇలా తనకు తెలిసిన వ్యక్తులను కూడా బుకీలుగా మార్చి బెట్టింగ్ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఈ బుకీ గ్యాంగ్ గుట్టుగా బెట్టింగ్ నిర్వహించడంతో పాటు.. బెట్టింగ్ వేసే వారికి డబ్బులు నష్టపోయేలా సాఫ్ట్వేర్లను రూపొందించారు. సాధారణంగా గెలిచే అవకాశమున్న జట్టుకు తక్కువ పర్సెంట్, ఓడిపోయే అవకాశాలున్న జట్టుకు ఎక్కువ శాతం డబ్బును ఆఫర్ చేస్తుంటారు. ఆ విధంగా జట్టు మీద బెట్టింగ్ వేశాక కొంత సమయం వరకు వాటిని వేరొక జట్టుకు మార్చుకునే అవకాశం ఉంటుంది. కానీ వీరు అలా మార్చడానికి అవకాశం లేకుండా ఆ సమయంలో సర్వర్‌ను ఆఫ్ చేసేవారు. ప్రధానంగా గేమ్ విన్నర్, లాస్ ఆప్షన్స్.. హ్యాండ్లర్ చేతిలో ఉండడంతో ఒకవేళ గెలిచినప్పటికీ నష్టం వచ్చిందని చెప్పి వారి ఐడీని బ్లాక్ చేస్తారు. ఆ డబ్బును తమ కరెంట్ అకౌంట్లలోకి జమ చేసి వాటి నుంచి కార్పొరేట్ ఖాతాల్లోకి బదిలీ చేస్తున్నట్టు పోలీసుల విచారణలో నిర్ధారౖణెంది. ఈ గ్యాంగ్‌కు సంబంధించిన 63 బ్యాంక్ ఖాతాలను గుర్తించి ఫ్రీజ్ చేయగా.. అందులో 36 ఖాతాల ద్వారా ఇప్పటి వరకు రూ.367.62 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. వాటిలో 13 అకౌంట్లలో ఉన్న రూ.75 లక్షలు స్తంభింపచేసినట్లు పోలీసులు చెప్పారు. అరెస్ట్ అయిన వారిలో సూరిబాబు, విశాఖకు చెందిన హండ దినే‹Ùకుమార్, బర్రి శ్రీను, గుర్రం శివ, కిల్లాడి శ్రీనివాసరావు, ఉరిటి కొండబాబు, ఉరిటి వెంకటేశ్వర్లు, సుందరాపు గణేష్, దూలి నూకరాజు, అల్లు నూకరాజు అవినాష్, ఉప్పు వాసుదేవరావులున్నారు. ఈ రాకెట్ వెనుక ప్రధాన సూత్రదారి కోసం గాలిస్తున్నట్టు డీసీపీ–1 శ్రీనివాస్ తెలిపారు. సమావేశంలో ఏడీసీపీ(ఎస్బీ) నాగేంద్రుడు, సైబర్ క్రైం సీఐ భవాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
పవన్ కల్యాణ్‌కు విశాఖ పోలీసులు నోటీసులు
-
కిడ్నీ రాకెట్ కేసులో ఆరుగురు అరెస్టు
దొండపర్తి (విశాఖ దక్షిణ): విశాఖలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసును పోలీసులు ఛేదించారు. ఇందులో దళారులుగా వ్యవహరించిన ఆరుగురిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అసలు సూత్రధారితో పాటు సర్జరీ చేసిన ఇద్దరు వైద్యుల కోసం ప్రత్యేక బృందాల ద్వారా గాలిస్తున్నట్లు విశాఖ పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ తెలిపారు. విశాఖ పోలీస్ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. 2019లో మహారాణిపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో కిడ్నీ రాకెట్ నడిపి ఏ4గా అరెస్టై.. 40 రోజుల పాటు విశాఖ జైలులో ఉన్న నార్ల వెంకటేష్ తాజా వ్యవహారంలోనూ అసలు సూత్రధారి అని వివరించారు. ఇతడే మొత్తం రాకెట్‌ను నడిపించాడని పేర్కొన్నారు. డబ్బు ఆశ చూపి.. మధురవాడ వాంబే కాలనీకి చెందిన జి.వినయ్ కుమార్ ఒక సప్లయిస్ షాప్‌లో వెహికల్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ శ్రీను అనే వ్యక్తికి ప్రమాదం జరిగితే వినయ్ కుమార్ పరామర్శించడానికి వెళ్లాడు. అక్కడ అతడికి కామరాజు, ఎలీనా అనే వ్యక్తులను శ్రీను, అతడి భార్య కొండమ్మ పరిచయం చేశారు. మాటల సందర్భంలో కిడ్నీ ఇస్తే రూ.8.5 లక్షలు ఇస్తామని వారు వినయ్‌కుమార్‌కు చెప్పారు. డబ్బుకు ఆశపడి వినయ్‌కుమార్ కిడ్నీ ఇచ్చేందుకు అంగీకరించాడు. దీంతో అతడిని ఒక ల్యాబ్‌కు తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. ఈ విషయం వినయ్‌కుమార్ తల్లిదండ్రులకు తెలియడంతో వారు వారించడంతో అతడు భయపడి హైదరాబాద్‌లో ఉంటున్న తన మేనత్త ఇంటికి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో కామరాజు ఫోన్ చేసి కిడ్నీ ఇవ్వకపోతే వైద్య పరీక్షలకు అయిన ఖర్చు రూ.50 వేలు ఇవ్వాలని, లేనిపక్షంలో ఇంట్లో సామానులు బయట పడేస్తానని వినయ్ కుమార్‌ను బెదిరించాడు. దీంతో అతడు కిడ్నీ ఇవ్వడానికి అంగీకరించాడు. హైదరాబాద్ నుంచి వినయ్ విశాఖ రాగానే పెందుర్తిలో ఉన్న తిరుమల ఆస్పత్రికి తీసుకువెళ్లి అతడి కిడ్నీ తొలగించారు. అనంతరం ఒప్పందం ప్రకారం రూ.8.5 లక్షలు ఇవ్వకపోగా.. రూ.5 లక్షలు ఇస్తున్నట్లు వీడియో రికార్డింగ్ చేసి అందులో రూ.2.5 లక్షలు నిందితులు తీసుకున్నారు. మూడు నెలలుగా వారి మధ్య డబ్బుల కోసం వివాదం నడిచింది. కామరాజు గ్యాంగ్ డబ్బులు ఇవ్వకపోవడంతో వినయ్‌కుమార్ పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చక్రం తిప్పిన వెంకటేష్ 2019లో కిడ్నీ రాకెట్ వ్యవహారం నడిపిన నార్ల వెంకటేష్‌ది కడప. ఈ వ్యవహారంలో అతడు అప్పట్లో జైలు పాలయ్యాడు. ఆ తర్వాత జైలు నుంచి విడుదలయ్యాక కూడా ఇదే దందా నడుపుతున్నాడు. వెంకటేష్‌కు ఎలీనా, కామరాజు గ్యాంగ్‌తో పరిచయం ఉండడంతో వారి ద్వారా వినయ్‌కుమార్‌కు డబ్బు ఎరవేశాడు. అతడి కిడ్నీ తొలగించేందుకు ఆస్పత్రిని గుర్తించే బాధ్యతను తన స్నేహితులు రమేష్, పవన్‌లకు అప్పగించాడు. దీంతో వీరిద్దరూ పెందుర్తిలో ఉన్న తిరుమల ఆస్పత్రి డాక్టర్ పరమేశ్వరరావును సంప్రదించారు. సర్జరీ ఆపరేషన్ థియేటర్, వార్డు ఇస్తే రూ.60 వేలు ఇస్తామని చెప్పారు. ఆ ఆస్పత్రి ఆధునికీకరణకు అప్పటికే ఆ డాక్టర్ రూ.2.5 కోట్లు ఖర్చు చేసి కొంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఒక రోజుకు రూ.60 వేలు వస్తుందని భావించి సర్జరీ చేసుకునేందుకు అంగీకరించారు. అన్నీ సమకూరాక వెంకటేష్ సర్జరీ చేసేందుకు వైద్యుల కోసం ప్రయత్నించాడు. ముందు కేర్ ఆస్పత్రి వారితో మాట్లాడినప్పటికీ వారు అంగీకరించలేదు. అయితే అందులో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న సాయితో వెంకటేష్‌కు పరిచయముంది. దీంతో సాయికి ఈ విషయం చెప్పడంతో తనకు తెలిసిన వైద్యులు ఉన్నారని.. వెంకటేష్‌కు ఇద్దరు డాక్టర్లను పరిచయం చేశాడు. ఆ వైద్యులిద్దరూ సర్జరీ చేయడానికి అంగీకరించారు. ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్లో వినయ్‌కుమార్‌కు, ఈ ఏడాది ఫిబ్రవరిలో వాసుపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తికి తిరుమల ఆస్పత్రిలోనే కిడ్నీ తొలగించినట్లు పోలీసులు తమ విచారణలో తెలుసుకున్నారు. వినయ్‌కుమార్ కిడ్నీని మరో రాష్ట్రానికి చెందిన చౌహాన్ అనే వ్యక్తికి ట్రాన్స్‌ప్లాంట్ చేసినట్లు గుర్తించారు. వెంకటేష్‌తో పాటు సర్జరీ చేసిన వైద్యుల కోసం కూడా పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఈ కేసులో ఎలీనా, కామరాజు, మర్రి శ్రీను, అతడి భార్య కొండమ్మతో పాటు ల్యాబ్ టెక్నీషియన్ శేఖర్, తిరుమల ఆస్పత్రి డాక్టర్ పరమేశ్వరరావును అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరిపై 307, 326, 420, 120బీ సెక్షన్లతో పాటు అవయవాల మార్పిడి చట్టం ప్రకారం కేసులు నమోదు చేశామన్నారు. ఇంకెవరైనా బాధితులు ఉంటే వారి నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విశాఖ కేంద్రంగా కిడ్నీ రాకెట్ నడుస్తోందన్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ తేల్చిచెప్పారు. -
ఐటీ అధికారులకూ ‘సైబర్’ స్ట్రోక్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సైబర్ నేరగాళ్లు ఎవర్నీ వదలటం లేదు. ఆదాయ పన్ను శాఖ అధికారులకు రూ.1.10 లక్షలకు టోకరా వేశారు. విశాఖపట్నానికి చెందిన ఆదాయ పన్ను శాఖ అధికారులకు ఉన్నతాధికారి పేరిట అమెజాన్ గిఫ్ట్ కూపన్లు పంపాలంటూ మెసేజ్ పంపిన సైబర్ నేరగాళ్లు.. వచ్చిన గిఫ్ట్‌కార్డు నుంచి ఆ మొత్తాన్ని వెంటనే తమ ఖాతాలోకి జమ చేసుకున్నారు. రాజస్థాన్‌లోని జోథ్‌పూర్ నుంచి నడిపిన ఈ వ్యవహారంపై విశాఖ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసిన విశాఖ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వాట్సాప్ డీపీతో బోల్తా ఢిల్లీ కేంద్రంగా విధులు నిర్వర్తించే ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ పంపినట్టుగా విశాఖలోని ఐటీ శాఖ అధికారికి ఇటీవల వాట్సాప్‌లో ఓ మెసేజ్ వచ్చింది. సదరు ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఫొటో డీపీగా ఉన్న ఫోన్ నంబరు నుంచి.. అమెజాన్ గిఫ్ట్ కూపన్ల రూపంలో రూ.1.10 లక్షలను తనకు అత్యవసరంగా పంపాలని ఆ మెసేజ్‌లో ఉంది. ఆ మొత్తాన్ని త్వరలో తిరిగి ఇస్తానని కూడా మెసేజ్ చేశారు. ఈ సమాచారాన్ని అందుకున్న అసిస్టెంట్ కమిషనర్.. వెంటనే ఆ మొత్తాన్ని ఉన్నతాధికారికి పంపాలంటూ డిప్యూటీ కమిషనర్‌ను కోరారు. ఈ మేరకు సదరు అధికారి రూ.1.10 లక్షల విలువ చేసే అమెజాన్ గిఫ్ట్ కూపన్లు కొనుగోలు చేసి ఆ సమాచారాన్ని వాట్సాప్ ద్వారా ఆ నంబర్‌కు పంపారు. సదరు సైబర్ నేరగాడు వెంటనే ఆ కూపన్లను రెడీమ్ చేసుకున్నారు. తాము మోసపోయిన విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న అధికారులు విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి విశాఖ పోలీసులు విచారణ చేపట్టారు. సమాచారం పంపిన ఫోన్ నంబరు రాజస్థాన్‌లోని జోథ్‌పూర్ ప్రాంతం నుంచి వచ్చిందని ప్రాథమికంగా తేల్చారు. ప్రత్యేక టీమ్‌తో విచారణ సైబర్ నేరగాళ్లు అందరినీ లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నారు. రోజురోజుకీ ఈ నేరాల సంఖ్య పెరిగిపోతోంది. దీనిని కట్టడి చేసేందుకు ఎక్కడికక్కడ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇలాంటి నేరాలపై విచారణ కూడా వేగవంతం చేస్తున్నాం. విశాఖ ఆదాయ పన్ను శాఖ అధికారుల ఫిర్యాదుపై కేసు నమోదు చేశాం. ఒక టీమ్ ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నాం. – శ్రీకాంత్, విశాఖ నగర పోలీస్ కమిషనర్ -
ప్రధాని జాతికి అంకితం చేసే ప్రాజెక్టులు ఇవీ..
దొండపర్తి (విశాఖ దక్షిణ): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. శుక్రవారం సాయంత్రం 7.25 గంటలకు మోదీ విశాఖకు చేరుకోనున్నారు. శనివారం ఉదయం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇదే వేదికపై నుంచి రూ.15,233 కోట్లు విలువైన 9 ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. డ్రోన్లపై నిషేధం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా విశాఖ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే మద్దిలపాలెం జంక్షన్ నుంచి త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లే మార్గంలో వాహనాల రాకపోకలను అనుమతించడం లేదు. అలాగే సభ జరిగే ఏయూ మైదానానికి 5 కిలోమీటర్ల పరిధిని ‘నో డ్రోన్ జోన్’గా నగర పోలీస్ కమిషనర్ సి.హెచ్.శ్రీకాంత్ ప్రకటించారు. ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సమయంలో ఎవరైనా డ్రోన్లు ఎగరవేస్తే వారిపై ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం 1934 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. శంకుస్థాపనల ప్రాజెక్టులు.. రూ.7,614 కోట్లు విలువైన 5 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. వాటిలో.. ► రూ.152 కోట్లతో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ. ► రూ.3,778 కోట్లతో రాయ్‌పూర్–విశాఖపట్నం 6 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే, ఎకనామిక్ కారిడార్. ► రూ.566 కోట్లతో కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్‌కు ప్రత్యేకమైన రోడ్డు. ► రూ.460 కోట్లతో విశాఖపట్నం రైల్వేస్టేషన్ అభివృద్ధి. ► రూ.2,658 కోట్లతో 321 కిలో మీటర్ల శ్రీకాకుళం–అంగుల్‌కు గెయిల్ పైప్‌లైన్ ప్రాజెక్టులు ఉన్నాయి. సభ విజయవంతమే అందరి లక్ష్యం వైఎస్సార్సీపీపీ నేత విజయసాయిరెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సభను విజయవంతం చేయడమే అందరి లక్ష్యం కావాలని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. 12న ప్రధాని సభ ఏర్పాట్లపై బుధవారం ఇక్కడి ప్రభుత్వ అతిథి గృహంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, నాయకులు సమన్వయంతో పని చేసి సభ విజయవంతానికి శాయశక్తులా కృషి చేయాలని చెప్పారు. ఈ సభకు సుమారు 3 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రధాని బహిరంగ సభకు వచ్చే గంట ముందుగానే ప్రజలు సభా ప్రాంగణానికి చేరుకునేలా చూసుకోవాలన్నారు. ఈ సభలో ప్రధాని చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. అనంతరం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో విజయసాయిరెడ్డి సమీక్ష నిర్వహించారు. కాగా, మధ్యాహ్నం ప్రభుత్వ అతిథి గృహంలో ప్రధాని సభ ఏర్పాట్లు, ఇతర అంశాలకు సంబంధించి మంత్రి అమర్నాథ్ జీవీఎంసీ అధికారులతో సమీక్షించారు. ఆ తర్వాత ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. జాతికి అంకితం చేసే ప్రాజెక్టులు ఇవీ.. రూ.7,619 కోట్లతో పూర్తి చేసిన నాలుగు ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. వాటిలో ► రూ.211 కోట్ల వ్యయంతో పాతపట్నం–నరసన్నపేటను కలుపుతూ నిర్మించిన నూతన జాతీయ రహదారి. ► రూ.2,917 కోట్లతో తూర్పు తీరంలో అభివృద్ధి చేసిన ఓఎన్జీసీ యు–ఫీల్డ్. ► రూ.385 కోట్లతో గుంతకల్‌లో ఐవోసీఎల్ గ్రాస్ రూట్ పీవోఎల్ డిపో నిర్మాణం. ► రూ.4,106 కోట్లతో విజయవాడ–గుడివాడ–భీమవరం–నిడదవోలు, గుడివాడ–మచిలీపట్నం, భీమవరం–నరసాపురం (221 కి.మీ.) రైల్వే లైన్ ఎలక్ట్రిఫికేషన్ ఉన్నాయి. -
పథకం ప్రకారమే మంత్రులపై దాడి
దొండపర్తి (విశాఖ దక్షిణ): జనసేన నాయకులు, కార్యకర్తలు పథకం ప్రకారమే విశాఖ విమానాశ్రయంలో మంత్రులపై దాడిచేశారని నగర పోలీస్ కమిషనర్ సిహెచ్.శ్రీకాంత్ చెప్పారు. ఆయన ఆదివారం విశాఖలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ విశాఖ పర్యటనలో జరిగిన పరిణామాలపై ఆ పార్టీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను కొట్టిపడేశారు. ఈ నెల 13వ తేదీన జనసేన రాష్ట్ర నాయకుడు కోన తాతారావు జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ జిల్లా పర్యటనకు సంబంధించిన వివరాలతో డీసీపీకి లేఖ ఇచ్చినట్లు చెప్పారు. 15వ తేదీ మధ్యాహ్నం రెండుగంటలకు ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా నోవోటెల్ హోటల్‌కు వెళతారని, 16వ తేదీ పోర్టు కళావాణి ఆడిటోరియంలో జనవాణి కార్యక్రమం, 17వ తేదీన వైఎంసీఏలో జరిగే కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళతారని ఆ లేఖలో పేర్కొన్నారని తెలిపారు. ఎయిర్‌పోర్టు నుంచి హోటల్‌కు ర్యాలీ, డీజే, భారీ జనసమీకరణల గురించి ఆ లేఖలో పేర్కొనలేదని, వాటికి అనుమతి కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. డ్రోన్ వినియోగానికి అనుమతి కోరగా.. రిమోట్ పైలెట్ ఎయిర్‌క్రాఫ్ట్ అనుమతి లేకపోవడంతో దాన్ని తిరస్కరించినట్లు చెప్పారు. సెక్షన్ 30 అమలులో ఉన్నప్పటికీ ముందస్తు అనుమతులు లేకుండా భారీ ఎత్తున జనసమీకరణ చేసి విమానాశ్రయానికి తరలించారని పేర్కొన్నారు. విశాఖ గర్జన కార్యక్రమాన్ని ముగించుకుని విమానాశ్రయానికి చేరుకున్న మంత్రులు రోజా, విడదల రజిని, జోగి రమేష్, టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి.. వైఎస్సార్సీపీ నాయకుల వాహనాలపై జనసేన నాయకులు, కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగానే పెద్ద ఎత్తున దాడులు చేశారని చెప్పారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి కూడా పాల్పడ్డారన్నారు. ఈ దాడిలో మంత్రి రోజా పీఏ దిలీప్‌కుమార్‌కు, అక్కడే విధులు నిర్వర్తిస్తున్న పెందుర్తి పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావుకు గాయాలవడంతో ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. మంత్రి రోజాపై దాడిచేయడానికి ప్రయత్నించిన సమయంలో మధ్యలో ఉన్న పీఏ దిలీప్ తలకు తీవ్ర గాయమై కుట్లుకూడా పడ్డాయన్నారు. వారిచ్చిన ఫిర్యాదుల మేరకు దాడిచేసినవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. దాడులు అప్పటికప్పుడు నిర్ణయించుకున్నవి కాదని, వివిధ సమూహాల వ్యక్తులు, వేర్వేరు మంత్రులు, నాయకులను టార్గెట్ చేస్తూ ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే దాడులు చేసినట్లు తమ విచారణలో తేలిందని పేర్కొన్నారు. అదేరోజు 70 మంది నిందితులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టామన్నారు. రిమాండ్ రిపోర్టు పరిశీలించిన న్యాయస్థానం వారిలో తొమ్మిదిమందికి జ్యుడిషియల్ రిమాండ్ విధించగా.. మిగిలిన వారిని సొంత పూచీకత్తు మీద విడుదల చేసినట్లు తెలిపారు. ఈ కేసు విచారణలో వెల్లడైన అంశాల ప్రకారం ఈ ఘటనపై ఆరుకేసులు నమోదుచేసి ఇప్పటివరకు వందమందిని అరెస్టు చేశామని, 82 మంది పరారీలో ఉన్నారని చెప్పారు. జనసేన నాయకుల ఆరోపణలు అసత్యాలు 15వ తేదీన పవన్‌కళ్యాణ్ ర్యాలీ సందర్భంగా మంత్రులపై దాడులు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసంతోపాటు జాతీయ రహదారిపై నాలుగు గంటలపాటు పెద్ద ఎత్తున ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిందన్నారు. ర్యాలీలో యువకులు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయని చెప్పారు. అత్యవసర సర్వీసులకు ఆటంకాలు ఏర్పడ్డాయన్నారు. విమాన ప్రయాణికులు 30 మంది తమ విమానాలను మిస్ చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే 16వ తేదీన జనవాణి కార్యక్రమం నిర్వహించుకోవచ్చుగానీ, ర్యాలీగా వెళ్లకూడదని పవన్‌కు చెప్పామన్నారు. తమ నాయకులు జైలులో ఉండడంతో జనవాణి కార్యక్రమానికి హాజరుకావడం లేదని ఆయన తమకు తెలిపారని, అయితే జనసేన నాయకుడు వరప్రసాద్ ఆధ్వర్యంలో జనవాణి కార్యక్రమాన్ని కొనసాగించారని చెప్పారు. పవన్ పర్యటన సందర్భంగా తగిన పోలీస్ భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఆయన ఎయిర్‌పోర్టుకు వచ్చినప్పటికీ నుంచి డీసీపీ (లా అండ్ ఆర్డర్) సుమిత్‌సునీల్ గరుడ్, డీసీపీ (క్రైం) నాగన్న.. అనుమతి లేకుండా చేసిన ర్యాలీ కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఆ ర్యాలీకి అనుమతి లేదన్న విషయాన్ని స్వయంగా డీసీపీ సుమిత్ జనసేన అధినేత పవన్‌కు తెలిపారన్నారు. అంతేతప్ప పవన్‌పై దుసురుగా ప్రవర్తించాలన్న ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యాలని కొట్టిపారేశారు. వారి కేడర్, నాయకులు మంత్రులపై దాడిచేసిన కారణంగానే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. యువత ఇటువంటి క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుని తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ప్రవర్తించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు, కార్యకర్తలు విమానాశ్రయంలో మంత్రులపై దాడులు చేస్తున్న ఫొటోలు, వీడియోలను ప్రదర్శించారు. ఈ సమావేశంలో డీసీపీ (లా అండ్ ఆర్డర్) సుమిత్‌సునీల్ గరుడ్, ఏడీసీపీ (ఎస్బీ) ఆనందరెడ్డి, ఏసీపీ పెంటారావు తదితరులు పాల్గొన్నారు. -
Pawan Kalyan: ఘటనతో నాకు సంబంధం లేదు
సాక్షి, విశాఖపట్నం : పోలీసు యాక్ట్–30 అమల్లో ఉన్నా శనివారం విశాఖ విమానాశ్రయం నుంచి అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడంపై ఆదివారం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు విశాఖ పోలీసులు నోటీసులిచ్చారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహించ కూడదని, ఎవరైనా సరే ముందస్తు అనుమతి తీసుకోవాలని విశాఖ తూర్పు ఏసీపీ హర్షిత చంద్రన్ ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. మీ నాయకత్వంలోని జనసేన మద్దతుదారులు మంత్రులపై దాడులు చేయడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు కలిగించారని పేర్కొన్నారు. దీనిపై పవన్ స్పందిస్తూ ‘మీ నోటీసులను నేను అంగీకరిస్తున్నాను. అయితే, విమానాశ్రయంలో సంఘటనతో నాకు సంబంధం లేదు’ అని స్వదస్తూరితో సమాధానం ఇచ్చారు. ఇదే ఘటనలో పోలీసులు అదుపులోకి తీసుకున్న, కేసులు పెట్టిన తమ వారిని వదిలి పెట్టాలని, అప్పటి వరకు తాను విశాఖ వదలనని పవన్ స్పష్టం చేయడం పట్ల జనం విస్తుపోతున్నారు. ‘విమానాశ్రయంలో జరిగిన ఘటనతో నిజంగా పవన్‌కు సంబంధం లేకపోతే.. అందుకు కారకులపై కేసులు పెడితే ఆయన ఎందుకు స్పందించాలి? మంత్రుల కార్లపై దాడి జరిగినందున పోలీసుల చర్యలుంటాయి. ఇది తెలిసి కూడా వాళ్లను విడుదల చేయాలని డిమాండ్ చేయడం చూస్తుంటే పవన్ అంతర్యమేంటో ఇట్టే తెలుస్తోంది’ అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. (క్లిక్: పవన్‌కు చంద్రబాబు ఫోన్) -
మనీలాండరింగ్ కేసులో రూ.18.67 కోట్లు జప్తు
సాక్షి, న్యూఢిల్లీ/ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు) : నాలుగేళ్ల కిందట విశాఖలోని ఓ వాణిజ్య సంస్థకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చర్యలు చేపట్టింది. కుంభకోణంతో సంబంధమున్న వ్యక్తులకు చెందిన రూ.18.67 కోట్లు విలువచేసే ఆస్తులను జప్తు చేసింది. ‘కాకా’ గ్రూపునకు చెందిన రూ.16.97 కోట్లు, శశి గోయెల్‌కు చెందిన రూ.1.50 కోట్లు, ప్రగతి ప్రింట్‌ప్యాక్ ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన రూ.20 లక్షలను జప్తుచేసినట్లు ఈడీ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. జప్తు చేసిన ఆస్తుల్లో వ్యవసాయ భూములతో పాటు వాణిజ్య స్థలాలు, ప్లాట్లు, స్థిర డిపాజిట్లు ఉన్నాయి. 2017లో హవాలా కుంభకోణం సమాచారంతో వడ్డి మహేష్ అనే వ్యక్తిని విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టుచేశారు. అనంతరం ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. పలువురు షెల్ కంపెనీలు సృష్టించి మనీలాండరింగ్ ద్వారా విదేశాలకు రూ.1,500 కోట్ల నగదు తరలించినట్లు ఈ కేసులో ప్రధాన అభియోగం. వడ్డి మహేష్ సమాచారంతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఈడీ దర్యాప్తు చేసి రెండు చార్జిషీట్లు వేసింది. గతంలో శశి గోయెల్ భర్త బీకే గోయెల్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించి గత ఏడాది సెప్టెంబర్ 3న అరెస్టు చేసింది. అంతకుముందు.. బీకే గోయెల్ అల్లుడు ఆయుష్ గోయెల్, యునైటెడ్ హిల్ (చైనా)కు చెందిన దీపక్ గోయెల్‌ను కూడా ఈడీ అరెస్టు చేయగా ప్రస్తుతం వారు బెయిల్‌పై ఉన్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ తెలిపింది. -
నలుగురు కిడ్నాపర్ల అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: బాలుడిని కిడ్నాప్ చేసిన నలుగురు కిడ్నాపర్లను నగర పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సీపీ రాజీవ్‌కుమార్ మీనా శుక్రవారం వెల్లడించారు. భిక్షాటన చేసుకుని జీవనం సాగించే దంపతులు సిరిమల్లిచెట్టు శ్రీను, భవాని తమ రెండేళ్ల కుమారుడు గణేష్‌తో టీఎస్ఆర్ కాంప్లెక్స్ సమీపంలోని ఇరానీ టీస్టాల్ వద్ద ఈ నెల 20న సోమవారం నిద్రపోయారు. అదేరోజు రాత్రి 11:30 గంటల సమయంలో విజయనగరం పట్టణానికి చెందిన పటాన్ సల్మాన్‌ఖాన్, షేక్ సుభాని, బండారు రోషన్‌రాజు మద్యం మత్తులో టీఎస్ఆర్ కాంప్లెక్స్‌లో టిఫిన్ చేస్తున్నారు. ఆ సమయంలో వారికి కనిపించిన బాబును తీసుకుని ఆటోలో పరారయ్యారు. అక్కడి నుంచి విజయనగరం చేరుకుని సుబట్ల గౌరికి బాబును అప్పగించారు. తల్లిదండ్రుల ఆందోళనతో స్థానికులు అప్రమత్తమై ఆటో నంబర్ (ఏపీ 35వై 3371) నమోదు చేసుకుని మంగళవారం ఉదయం మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే అప్రమత్తమై నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా కిడ్నాపర్లు విజయనగరం వెళ్లినట్లు గుర్తించి... ముగ్గురు యువకులను, ఓ మహిళను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా నిందితుల్లో ఒకరైన బండారు రోషన్‌రాజు వరుసకు మేనత్త అయిన సుబట్ల గౌరి కోరిక మేరకే ఈ కిడ్నాప్ చేసినట్లు తేలింది. తన చెల్లెలుకి పిల్లలు లేరని, ఎవరినైనా తీసుకొచ్చి ఇస్తే పెంచుకుంటుందని చెప్పింది. దీంతో ఈ నెల 20న సాయంత్రం సల్మాన్‌ఖాన్, షేఖ్ సుభాని, రోషన్ రాజు విజయనగరం నుంచి సింహాచలంలో ఉంటున్న బంధువుల ఇంటికి రేషన్ బియ్యం, సరకులు తీసుకొచ్చారు. అనంతరం నగరంలోని టీఎస్ఆర్ కాంప్లెక్స్‌కు చేరుకుని అక్కడ కనిపించిన బాలుడు గణేష్‌ను కిడ్నాప్ చేశారని సీపీ వెల్లడించారు. ఆటోతోపాటు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించామని తెలిపారు. తక్కువ సమయంలో నిందితులను పట్టుకున్న సీఐ కె.వెంకటరావు, ఎస్ఐలు పాపారావు, నరసింహరాజులను అభినందించారు. ఈ నెల 18న ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా ఇదే బాలుడు గణేష్ రోడ్డుపై ఒంటరిగా ఆడుకుని కనిపించగా సీడబ్ల్యూసీ ద్వారా తల్లిదండ్రులు సిరిమల్లిచెట్టు శ్రీను, భవానిలకు అప్పగించామని సీపీ తెలిపారు. సమావేశంలో డీసీపీ – 1 ఐశ్వర్య రస్తోగి, ఏసీపీ కులశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని..
సాక్షి, విశాఖపట్నం: తన ప్రియురాలితో అసభ్యకరంగా ప్రవర్తించాడనే కోపంతో.. ఆమెతో కలిసి స్నేహితుడినే కడతేర్చాడు ఓ యువకుడు. నాతయ్యపాలెం సమీపంలోని గ్లోబెక్స్ షాపింగ్‌మాల్ వెనుక కాలువలో ఈ నెల 13న కాలిపోయిన స్థితిలో లభించిన మృతదేహం కేసును ఛేదించిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను నగరంలోని పోలీస్ కమిషనరేట్‌లో సీపీ రాజీవ్‌కుమార్ మీనా మీడియాకు బుధవారం వెల్లడించారు. మింది సమీప గుడివాడ అప్పన్న కాలనీకి చెందిన గుర్రం గణేష్, గుర్రాల జోగారావు స్నేహితులు. వీరిద్దరూ నిత్యం మద్యం సేవించి తిరుగుతూ వారం పదిరోజులకోసారి ఇంటికి వెళ్తుంటారు. ఈ క్రమంలో మల్కాపురం ప్రాంతానికి చెందిన దీనా అలియాస్ స్వాతితో సన్నిహితంగా ఉంటున్న జోగారావు ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంతలో గణేష్ పలుమార్లు స్వాతితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఎన్నిసార్లు చెప్పినా గణేష్‌లో మార్పు రాకపోవడంతో అడ్డు తొలగించుకోవాలని జోగారావు, స్వాతి నిర్ణయించారు. మద్యం తాగించి... కర్రతో దాడి చేసి గణేష్‌ను అంతమొందించాలని నిర్ణయించుకున్న జోగా రావు, స్వాతి ప్రణాళికలో భాగంగా జూలై 5న గాజువాక దరి గ్లోబెక్స్ షాపింగ్ మాల్ వెనుక్కు తీసుకొచ్చారు. అక్కడ మూతపడిన చేపల కంపెనీలో గణేష్‌కు మాయమాటలు చెప్పి కళ్లు, మద్యం తాగించారు. మత్తులోకి జారుకున్నాక గణేస్ తలపై జోగారావు కర్రతో దాడి చేయగా.., కింద పడిపోయాక మెడకు బెల్ట్‌తో బిగించి అంతమొందించారు. ఈ క్రమంలో గణేష్ కాళ్లు పట్టుకుని స్వాతి సహకరించింది. అనంతరం మృతదేహాన్ని అక్కడే ఉన్న కాలువలో పడేసి వెళ్లిపోయారు. మరో రెండు రోజుల తర్వాత సంఘటనా స్థలానికి వచ్చి చూడగా... మృతదేహం పాడవకపోవడంతో పెట్రోల్ పోసి కాల్చి వెళ్లిపోయారు. అయితే ఆ సమయంలో మృదేహానికి ఉన్న కడియం, వాచీ కాలకపోవడంతో కేసులో అవే కీలకంగా మారాయి. పట్టించిన కడియం, వాచీ గ్లోబెక్స్ షాపింగ్ మాల్ వెనుక కాలువలో జూలై 13న కాలిపోయిన స్థితిలో ఓ మృతదేహం లభించిందని గుడివాడ అప్పన్న కాలనీ వీఆర్వో కార్తిక్ ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అయితే మృతదేహం కాలిపోయి ఉండడంతో ఎవరనేది గుర్తించలేకపోయారు. ఆ సమీపంలో లభించిన వాచీ, కడియం, చెప్పులే కేసులో కీలకంగా మారడంతో వాటి ఆధారంగానే దర్యాప్తు సాగించారు. హత్య జరిగినట్లుగా నిర్ధారించిన తర్వాత డీసీపీ(క్రైం) సురేష్‌బాబు, సౌత్ ఏసీపీ ఆంజనేయులు రెడ్డి, ట్రైనీ డీఎస్పీ శిరీష, సీఐ సూరినాయుడు, ఎస్ఐలు గణేష్, సూర్యప్రకాష్, రమే‹Ùలు పలు బృందాలుగా విడిపోయారు. చివరకు మృతుడు గుడివాడ అప్పన్న కాలనీకి చెందిన గుర్రం గణేష్(38)గా గుర్తించి.., మరింత లోతుగా విచారించి జోగారావు, స్వాతిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా హత్య చేసినట్లు అంగీకరించారు. నిందితులను పట్టుకున్న బృందాన్ని సీపీ ఆర్కేమీనా అభినందించారు. సమావేశంలో డీసీపీ సురేష్‌బాబు, ఏసీపీ జీఆర్ రెడ్డి పాల్గొన్నారు. -
విశాఖ గ్యాంగ్‌వార్.. పోలీసులు సీరియస్..
సాక్షి, విశాఖపట్నం: నగరంలో రౌడీ గ్యాంగ్ లపై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. విశాఖ నగరంలో రెండు రోజుల క్రితం జరిగిన గ్యాంగ్ వార్ పై ఫోర్త్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. తనని వెంబడించి రాడ్లతో దాడికి ప్రయత్నించారంటూ రూపేష్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 147,148,149లగా కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు రాకేష్, రౌడీషీటర్ మురళికృష్ణలను అరెస్ట్ చేశారు. రాకీ దొండపర్తిలో నివాసముంటూ యానిమేషన్ డిజైనర్ గా పనిచేస్తున్నాడు. అక్కయ్యపాలెంలో నివాసముండే పెద్దిశెట్టి రూపేష్ పై ఫోర్త్ టౌన్, కంచరపాలెం, పెందుర్తి లో దొంగతనం కేసులు, సస్పెక్ట్ షీట్ లు ఉన్నాయి. ఈ క్రమంలో తనని దొంగ రూపేష్ అంటూ ప్రచారం చేయడానికి రాకీ ప్రయత్నిస్తున్నారంటూ రూపేష్ కొద్ది రోజుల క్రితం రాకీ ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చాడు. దీంతో రూపేష్ పై రాకీ కక్ష పెట్టుకుని జరిగిన విషయాన్ని తన స్నేహితులకి చెప్పాడు. దీంతో అతని స్నేహితులపై మోటార్ సైకిళ్లపై రామచంద్ర నగర్ లో రాడ్లతో రూపేష్ ను వెంబడించి దాడికి ప్రయత్నించారు. ఈ సమయంలో తప్పించుకోవడానికి రామచంద్రనగర్ లోని సందులలోకి రూపేష్ ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. మోటార్ సైకిళ్లపై వెంబడిస్తున్న సమయంలో వీధులలో ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులకి గాయాలయ్యాయి. ఈ రౌడీ గ్యాంగ్ ల హల్ చల్ పై విశాఖ ఫోర్త్ టౌన్ పోలీసులు తీవ్రంగా స్పందించి కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడు రాకీ, రౌడీషీటర్ మురళికృష్ణలను అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపారు. పరారీలో ఉన్న నిందితులు, ప్రత్యేక బృందాలు తో పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. అలజడి సృష్టిస్తే సహించం.. రూపేష్, రాకీల మధ్య పాత గొడవలు లేవని విశాఖ ఫోర్త్ టౌన్ సిఐ ప్రేమ్‌కుమార్ తెలిపారు. రూపేష్ పై నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ లో సస్పెక్ట్ షీట్ ఉందని వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయి రాకీ, రౌడీ షీటర్ మురళిని అరెస్ట్ చేశామని, మిగిలిన ఐదుగురు కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. ఈ తరహా గ్యాంగ్ వార్ లపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని సీఐ స్పష్టం చేశారు. ప్రశాంతమైన విశాఖలో అలజడి సృష్టించాలని చూస్తే సహించేదిలేదని సీఐ ప్రేమ్‌కుమార్ హెచ్చరించారు. -
అందమే శాపమై.. హత్యకు గురైన దివ్య
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దివ్య హత్య కేసును విశాఖ పోలీసులు రెండు రోజుల్లోనే ఛేదించారు. బుధవారం రాత్రి హత్యకు గురైన దివ్య మృతదేహానికి శనివారం కేజీహెచ్‌లో పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఆమె శరీరంపై 33 చోట్ల గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించినట్లు తెలిసింది. దివ్యను చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఆమెతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేటట్లు చేసిన అక్కయ్యపాలెం నందినగర్ నివాసి వసంత అనే మహిళే ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. బతుకుదెరువుకు వచ్చి బలి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఊబలంకకు చెందిన దివ్య(20) తల్లిదండ్రులు చనిపోవడంతో బతుకుదెరువు కోసం వసంత(30) దగ్గరకు వచ్చింది. అప్పటికే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వసంత దివ్యను కూడా వ్యభిచార రొంపిలోకి దింపింది. కొన్నాళ్లకు తన అందంతో ఎదుగుతున్న దివ్యను చూసి అసూయ, ద్వేషాలకు గురైన వసంత దివ్యను మట్టుబెట్టాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ముందుగా దివ్య అందాన్ని చెరిపేయాలని నిర్ణయించుకుని ఇంట్లో బంధించి వారం రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసింది. వీటిని భరించలేక దివ్య బుధవారం రాత్రి మృతి చెందింది. అంతిమయాత్ర వాహన యజమాని అనుమానంతో... దివ్య మరణించాక.. ఆమె మృతదేహాన్ని ఖననం చేసేందుకు జ్ఞానాపురం ప్రాంతంలోని అంతిమ యాత్ర వాహనం యజమానికి ఫోన్ చేసి ఎంత డబ్బయినా ఇస్తానని వసంత ఆశ చూపించింది. అనుమానం వచ్చిన వాహన యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో దివ్యది సహజ మరణంగా చూపడానికి ఆమె ప్రయత్నించింది. దివ్య మృతదేహంపై గాయాలు ఉండడాన్ని గమనించి హత్య కోణంలో దర్యాప్తు చేశారు. వసంత హత్యా నేరం అంగీకరించినట్లు సమాచారం. ఈ కేసులో వసంత సోదరి, మరిదిని అదుపులోకి తీసుకున్నారు. 2015లో దివ్య కుటుంబ సభ్యుల హత్య దివ్య కుటుంబ సభ్యులు కూడా 2015లో హత్యకు గురైనట్లు పోలీసుల విచారణలో తేలింది. దివ్య తల్లి, తమ్ముడు, అమ్మమ్మలను కూ డా గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆ కేసు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఆ హత్యలపైనా పోలీసులు విచారణకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. -
ఆత్మహత్య కాదు.. హత్యే
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): చినవాల్తేరులో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న కేసును ఎట్టకేలకు త్రీటౌన్ పోలీసులు ఛేదించారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు తమ విచారణలో ఇది ఆత్మహత్య కాదు.. హత్యేనని తేల్చారు. మద్యం మత్తులో నిత్యం వేధించడం.. ఆయన చనిపోతే ఏయూలో ఉద్యోగం వస్తుందన్న ఆశతో కుటుంబ సభ్యులే హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారని నిర్ధారించారు. ఈ మేరకు పెదవాల్తేరులోని త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో సీఐ కోరాడ రామారావు కేసు వివరాలను వెల్లడించారు. ఆంధ్రా యూనివర్సిటీలో పంప్ ఆపరేటర్‌గా పని చేస్తున్న ఒమ్మి పోలారావు(32) కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈయన తల్లి వరలక్షి్మ, భార్య లావణ్య, పిల్లలతో కలిసి చినవాల్తేరు పాత సీబీఐ డౌన్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఎప్పటిలాగానే గత శనివారం కూడా మద్యం సేవించి ఇంటికి వచ్చి, తలుపుల అద్దాలు పగలుగొట్టాడు. కుటుంబ సభ్యులను కూడా కొట్టడంతో వారంతా దగ్గరలోని బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. తిరిగి ఆదివారం ఇంటికి వచ్చి చూసేసరికి మెడపై గాజుపెంకుతో పొడుచుకుని పోలారావు చనిపోయి ఉన్నాడని తల్లి వరలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో తల్లి ఒమ్మి వరలక్ష్మి (55), సోదరి అల్లు వెంకటలక్ష్మి(33), బావమరిది అల్లు కిశోర్(35) చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరించిరనట్టు తేలిందని సీఐ తెలిపారు. మద్యం మత్తులో నిత్యం కుటుంబ సభ్యులను వేధించడంతో వారంతా సహనం కోల్పోయారన్నారు. అలాగే పోలారావు చనిపోతే ఏయూలో ఉద్యోగం కుటుంబంలో సోదరికి వస్తుందన్న ఆశతో హత్యకు కుట్ర పన్నారని చెప్పారు. తండ్రి చనిపోతే కారుణ్య నియామకం కింద పోలారావుకు ఏయూలో ఉద్యోగం వచ్చిందని, ఈ క్రమంలో మృతుడి వైఖరితో విసిగిపోయిన కుటుంబ సభ్యులు ఏయూలో ఉద్యోగం కోసం ఆయన మెడపై గాజుపెంకులతో పొడిచి హత్య చేశారని తేలిందని సీఐ చెప్పారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐలు జె.ధర్మేంద్ర, షేక్‌ఖాదర్‌బాషా, ఏఎస్ఐ రాజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
యజమానినే ముంచేశారు..
పెదగంట్యాడ(గాజువాక): శ్రీకాకుళం నుంచి వచ్చారు. ఇల్లు అద్దెకు కావాలన్నారు.. మంచి వారని భావించిన ఇంటి యజమాని వారికి ఇల్లు అద్దెకు ఇచ్చారు. తర్వాత ఇరుకుటుంబాల వారు బాగా దగ్గరయ్యారు. ఒకరికొకరు కష్టసుఖాలను పంచుకునేవారు. ఇదే ఆ ఇంటి యజ మాని నిలువునా మోసపోవడానికి దారితీసింది. ఈ సంఘటన వివరాలను న్యూపోర్టు పోలీస్ స్టేషన్లో సీఐ పైడపునాయుడు విలేకరులకు బుధవారం వివరించారు. ఇంటి యజమానికి పెళ్లయినా పిల్లలు లేకపోవడంతో అతని మేనకోడలను రెండో పెళ్లి చేసుకున్నాడు. వారికి ముగ్గురు సంతానం కలిగారు. అయితే యజమాని ఇటీవల మొదటి భార్యతో చనువుగా ఉండడంతో రెండో భార్య తట్టుకోలేపోయింది. తన పరిస్థితిని వారి ఇంట్లో అద్దెకు ఉంటున్న వారితో వాపోయింది. ఇదే అదునుగా భావించి వారు ఆమెను నిలువునా ముంచేశారు. పూజల పేరిట రూ.4.20 లక్షల నగదుతో పాటు 7తులాల బంగారం, వెండి సామగ్రి దోచేశారు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి అసలు రంగు బయటపడింది. 62వ వార్డు టీజీఆర్ నగర్లో దవులూరి చంద్రరావు అ నే వ్యక్తి కుటుంబంతో నివాసం ఉంటున్నా డు. ఏడాది కిందట శ్రీకాకుళం జిల్లాకు చెందిన వానపల్లి సీతారాం, అతని తల్లి పద్మ, చెల్లెలు కుమారితో వచ్చి ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. చంద్రరావుకు వివా హమైనా పిల్లలు లేకపోవడంతో అతని మేనకోడలైన నిర్మలను మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇటీవల కాలంలో చంద్రరావు మొద టి భార్యతో చనువుగా ఉండడంతో తట్టుకోలేకపోయిన నిర్మల ఇంట్లో అద్దెకుంటున్న వారితో తన పరిస్థితిని వివరించింది. ఇదే అదునుగా భావించిన వారు ‘నీ భర్తకు ప్రాణగండం ఉంద ని, పూజలు చేయాల’ని నమ్మబలికారు. అంతేకాకుండా ఆ విషయాన్ని తన భర్తకు చెబితే రక్తం కక్కుకుని చనిపోతాడని భయాందోళనకు గురి చేశారు. దీంతో భయపడిన నిర్మల భర్తకు తెలి యకుండా రూ.4.20 లక్షల నగదు, 7తులాల బంగారం, వెండి వస్తువులను దఫదఫాలుగా వారికి అందజేసింది. తర్వాత తాను మోసపోయానని భర్తకు తెలియజేయడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను బుధవారం అరెస్టు చేశారు. వారి నుంచి నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఎస్ఐ శ్రీనివాస్, ఏఎస్ఐ అప్పలరాజు పాల్గొన్నారు. -
విశాఖ మన్యంలో హైఅలర్ట్
సాక్షి, విశాఖపట్నం : మావోయిస్టు సంస్మరణ వారోత్సవాల నేపథ్యంలో ఎలాంటి దాడులు జరగకుండా విశాఖ మన్యంలో ముందస్తు హైఅలర్ట్ విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు గుర్రాలపై పెట్రోలింగ్ నిర్వహిస్తూ ముమ్మర తనిఖీలు నిర్వహించారు. మావోలకు వ్యతిరేకంగా సంతల్లో శాంతి స్థూపాలు నెలకొల్పినట్లు తెలిపారు. -
రికార్డులన్నీ ఎన్ఐఏకు ఇవ్వండి
విజయవాడ లీగల్/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/రాజమహేంద్రవరం క్రైం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసుకు సంబంధించి పూర్తి రికార్డులు, మెటీరియల్ ఆబ్జెక్టులను ఎన్ఐఏకు అప్పగించాలని రాష్ట్ర పోలీసులను న్యాయస్థానం శుక్రవారం ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన రికార్డులు, మెటీరియల్ ఆబ్జెక్టులను తమకు ఇవ్వకుండా ఏపీ పోలీసులు సహాయనిరాకరణ చేస్తున్నారని ఎన్ఐఏ అధికారులు న్యాయస్థానంలో గురువారం ప్రత్యేక మెమో దాఖలు చేసిన విషయం తెలిసిందే. రికార్డులు ఇవ్వకపోవడంతో నిబంధనల మేరకు 90 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయలేకపోతున్నామని, దాంతో నిందితుడికి బెయిల్ వచ్చే అవకాశం ఉందని ఎన్ఐఏ అధికారులు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ మెమోపై విచారించిన విజయవాడలోని ఎన్ఐఏ న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి సంబంధించి రాష్ట్ర పోలీసులు ఇప్పటిదాకా చేసిన దర్యాప్తు వివరాలతో కూడిన నివేదిక, ఆ కేసుకు సంబంధించిన రికార్డులు, మెటీరియల్ ఆబ్జెక్టులను ఎన్ఐఏ అధికారులకు అందజేయాలని విశాఖపట్నం పోలీసు అధికారులను ఆదేశించింది. దీంతో వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ తమ దర్యాప్తును మరింత వేగవంతం చేసేందుకు మార్గం సుగమమైంది. నిందితుడు శ్రీనివాసరావును విజయవాడ కోర్టుకు తీసుకొస్తున్న ఎన్ఐఏ అధికారులు 25 వరకు నిందితుడి రిమాండ్ పొడిగింపు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుకు ఈ నెల 25 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ విజయవాడలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిందితుడు వారం రోజుల ఎన్ఐఏ కస్టడీ శుక్రవారంతో ముగిసింది. దాంతో ఎన్ఐఏ అధికారులు అతడిని విజయవాడలోని ప్రత్యేక కోర్టలో శుక్రవారం హాజరుపరిచారు. నిందితుడి వైద్య పరీక్షల రిపోర్టులను కూడా దాఖలు చేశారు. ఎన్ఐఏ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారా... ఏమైనా ఇబ్బందులు పెట్టారా అని నిందితుడు శ్రీనివాసరావును న్యాయమూర్తి ప్రశ్నించారు. తనను ఏ విధంగానూ ఇబ్బంది పెట్టలేదని శ్రీనివాసరావు బదులిచ్చాడు. నిందితునికి ప్రాణహాని ఉందని, విజయవాడ జిల్లా జైలు సురక్షితం కాదని అతడి తరఫు న్యాయవాది సలీం న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై న్యాయమూర్తి నిందితుడిని జైలులో పరిస్థితుల గురించి అడగ్గా, తనకు విజయవాడ జైలు అయినా రాజమండ్రి జైలు అయిన ఇబ్బంది లేదని తెలిపాడు. దాంతో అతడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. తాను తప్ప మరే న్యాయవాది శ్రీనివాసరావును కలవకూడదంటూ అతడి తరఫు న్యాయవాది సలీం కోర్టులో మెమో దాఖలు చేశారు. తాను లేని సమయంలో శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు 30 గంటలపాటు విచారించారని, ఆ వివరాలను కోర్టువారు పరిగణనలోకి తీసుకోరాదని కోరారు. దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్లు స్పందిస్తూ.. శ్రీనివాసరావును విచారించడానికి వారంరోజుల కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులను అతనికి అందజేయగా విచారణకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదని నిందితుడు లిఖితపూర్వకంగా పేర్కొన్నాడని తెలిపారు. శ్రీనివాసరావును కస్టడీకి తీసుకున్న అనంతరం ఫోన్ ద్వారా అతడి తరఫు న్యాయవాది సలీంకు సమాచారం ఇచ్చామని న్యాయస్థానానికి తెలిపారు. 22 పేజీల లేఖపై 23న వాదనలు నిందితుడు శ్రీనివాసరావు విశాఖపట్నం జైలులో రాసిన 22 పేజీల లేఖను జైలు సూపరింటెండెంట్ తీసుకున్నారని అతడి తరఫు న్యాయవాది సలీం న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఆ లేఖను తనకు ఇప్పించాలని కోరుతూ మెమో దాఖలు చేశారు. దీనిపై ఎన్ఐఏ తరఫున ప్రత్యేక పబ్లిక్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వాదనలు వినిపించారు. ఆ 22 పేజీల లేఖను కేసు దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ ప్రధాన అధికారికి అప్పగించాలని కోరారు. ఆ తరువాతే ఆ లేఖ కాపీని నిందితుడి తరఫు న్యాయవాదికి ఇవ్వాలని న్యాయస్థానానికి విన్నవించారు. దీనిపై ప్రత్యేక మెమో దాఖలు చేయాలని ఎన్ఐఏ తరఫున వాదిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్లను న్యాయమూర్తి ఆదేశించారు. ఈ కేసు విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేశారు. కొనసాగుతున్న ఎన్ఐఏ విచారణ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. విశాఖపట్నంలోనే మకాం వేసిన ఎన్ఐఏ అధికారులు గురు, శుక్రవారాల్లో ఘటనాస్థలం విశాఖ ఎయిర్‌పోర్ట్‌లోని వీవీఐపీ లాంజ్, పక్కనే ఉన్న ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ ప్రాంతాలను నిశితంగా పరిశీలించారు. కైలాసగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్ఐఏ తాత్కాలిక కార్యాలయంలో కొద్దిరోజులుగా సాక్షులను విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీకి చెందిన మాజీ కార్పొరేటర్ జియ్యాని శ్రీధర్‌ను శుక్రవారం రెండున్నర గంటలపాటు విచారించారు. మూడు రోజుల క్రితం శ్రీధర్‌ను పిలిపించి వైఎస్ జగన్‌పై హత్యాయత్న ఘటన సమయంలో ఏం జరిగిందో వివరాలు నమోదు చేసుకున్న ఎన్ఐఎ అధికారులు శుక్రవారం మరోసారి విచారణ చేపట్టారు. ఆ రోజు ఏం జరిగింది? హత్యాయత్నం సమయంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు? అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాగా, విచారణకు హాజరు కావాల్సిందిగా ఎన్ఐఏ నుంచి నోటీసులు అందుకున్న మిగిలిన వైఎస్సార్సీపీ నేతలు శనివారం హాజరుకానున్నట్టు సమాచారం. ఆరోగ్యం కుదుటపడ్డాక విచారణకు సహకరిస్తా: హర్షవర్దన్ చౌదరి జగన్‌పై హత్యాయత్నం కేసులో కీలకంగా భావిస్తున్న తెలుగుదేశం పార్టీ నేత, ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని హర్షవర్దన్ చౌదరి ఇప్పటివరకు పత్తాలేకుండా పోయిన సంగతి తెలిసిందే. ఎన్ఐఏ విచారణకు హర్షవర్దన్ గైర్హాజరుపై శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో హర్షవర్దన్ శుక్రవారం ఎన్ఐఏ అధికారులకు అందుబాటులోకి వచ్చాడు. తనకు యాక్సిడెంట్ అయి కదల్లేని పరిస్థితుల్లో ఇంట్లోనే ఉన్నానని, ఆరోగ్యం కుదుటపడిన తర్వాత విచారణకు వచ్చి సహకరిస్తానని సమాచారం పంపాడు. ఎన్ఐఎ అధికారులు శుక్రవారం గాజువాకలోని హర్షవర్దన్ ఇంటికి వెళ్లి వీలైనంత త్వరగా విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించినట్టు సమాచారం. జైలులో శ్రీనివాసరావుకు ప్రత్యేక సెల్ వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావును విజయవాడ నుంచి రోడ్డు మార్గం ద్వారా శుక్రవారం రాత్రి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు పటిష్టమైన బందోబస్తు మధ్య తరలించారు. నిందితుడికి ప్రాణహాని ఉన్న దృష్ట్యా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఇతర ఖైదీలతో కలపకుండా ప్రత్యేకమైన సెల్(గది)లో అతడిని ఉంచుతున్నట్లు జైలు సూపరింటెండెంట్ సాయిరామ్ ప్రకాశ్ తెలిపారు. అతడిని సాధారణ ఖైదీల మాదిరిగానే పరిగణిస్తామని, అయితే ప్రాణహాని ఉందని నిందితుడు కోర్టుకు తెలియజేసిన నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు అతడిని ప్రత్యేక సెల్లో ఉంచి, నిరంతరం పర్యవేక్షించేందుకు ఒక గార్డును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. -
జగన్‌పై హత్యాయత్నం కేసు నిందితుడిని అప్పగించండి
సాక్షి ప్రతినిధి విశాఖపట్నం/ విశాఖ లీగల్: తెలుగు రాష్ట్రాలతోపాటు జాతీయస్థాయిలో కలకలం సృష్టించిన రాష్ట్ర ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసు మంగళవారం కీలక మలుపు తిరిగింది. ఇటీవల ఆ కేసుని కేంద్ర హోం శాఖ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కి అప్పగించిన సంగతి తెలిసిందే. వెంటనే రంగంలోకి దిగిన ఎన్ఐఏ అధికారులు విశాఖ చేరుకుని విచారణ మొదలుపెట్టారు. సోమవారం నిందితుడు శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగిన సమయంలో విశాఖ పోలీసులు ఎన్ఐఏ అధికారులకు రికార్డులు ఇవ్వడానికి నిరాకరించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంగళవారం ఎన్ఐఏ అధికారులు విజయవాడలోని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 41 (డి) ప్రకారం నిందితుడిని తమకు అప్పగించాలని, స్థానిక పోలీసులు ఇప్పటివరకూ చేపట్టిన విచారణకు సంబంధించిన అన్ని ఫైళ్లు తమకు అప్పగించాలని న్యాయస్థానాన్ని కోరారు. ప్రస్తుతం ఈ పిటిషన్ న్యాయస్థానంలో విచారణలో ఉంది. విశాఖ పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు సహకరించకపోవడంతో ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు విజయవాడలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఇకపై కేసు విచారణ విజయవాడలోనే విశాఖపట్నంలోని 7వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఉన్న కేసు విజయవాడకు బదిలీ అయింది. ఈ మేరకు విజయవాడ లోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి విశాఖ కోర్టుకు ఆదే శాలు జారీ చేశారు. ఆ ఆదేశాలు విశాఖలోని కోర్టుకు మంగళవారం అందా యి. కేసు విచారణ విజయవాడలో జరుగనుంది. -
ఇవ్వంగాక ఇవ్వం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కుట్ర కేసు దర్యాప్తు మొదలు పెట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కు విశాఖ పోలీసుల నుంచి సహాయ నిరాకరణ కొనసాగుతోంది. విశాఖ విమానాశ్రయంలో గత ఏడాది అక్టోబర్ 25న వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనపై సమగ్ర విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కు అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్రహోం శాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు జనవరి 1న ఎఫ్ఐఆర్ నమోదు చేసి రంగంలోకి దిగిన ఎన్ఐఎ ప్రధాన దర్యాప్తు అధికారి (సీఐఓ) మహ్మద్ సాజిద్‌ఖాన్ సహా ఐదుగురు అధికారులకు విశాఖ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద కేసులను సైతం ధైర్యంగా, చాకచాక్యంగా ఎదుర్కొన్న ఎన్ఐఎ అధికారులకు ఇలా ఓ రాష్ట్ర పోలీసు యంత్రాంగం నుంచి సహాయనిరాకరణ ఎదురుకావడం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. కేసు విచారణ ఫైళ్లు అప్పగించడం సంగతి పక్కన పెడితే కనీసం కేసు వివరాలను కూడా చెప్పేందుకు విశాఖ పోలీసు అధికారులు నిరాకరించడాన్ని ఎన్ఐఎ అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆదేశాలతో ఎన్ఐఎ అధికారులు విశాఖ చేరుకున్న రోజు నుంచే నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్హా సెలవుపై వెళ్లిపోయారు. దీంతో ఎన్ఐఎ బృందం జగన్‌పై హత్యాయత్నం ఘటనపై విచారణకు రెండు నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులను, కేసు నమోదు చేసిన ఎయిర్పోర్ట్ పోలీసులను సంప్రదించింది. తొలి రెండురోజులు సమాచారం ఇవ్వలేమని, ఆ మేరకు ప్రభుత్వ ఆదేశాలున్నాయని ఎన్ఐఎ వర్గాలతో చెప్పిన సిట్ అధికారులు సోమవారం కనీసం వారిని కలిసేందుకు కూడా ఇష్టపడలేదని తెలుస్తోంది. కేసును ఎన్ఐఎకు అప్పగించడంపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్రప్రభుత్వానికి లేఖ రాయాలని, అవసరమైతే కోర్టులో పిటిషన్ వేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాలతో విశాఖ పోలీసులు, సిట్ అధికారులు ఎన్ఐఎ వర్గాలను ఏమాత్రం లెక్క చేయడం లేదు. కాగా ఎన్ఐఎ అధికారులకు విశాఖ పోలీసుల్లో ఎవరైనా సహకరిస్తున్నారా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు నిఘా వేశారు. ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్ మంత్రి, టీడీపీలో కీలక నాయకుడు ఆదివారం పొద్దుపోయాక ఈ కేసు గురించి వాస్తవాలు తెలిసిన ఓ పోలీసు అధికారికి ఫోన్ చేసి బెదిరింపు ధోరణిలో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఎన్ఐఎ అధికారులకు ఏ మాత్రం సహకరించినా బాగుండదు.. అని హుకుం జారీ చేసినట్లు పోలీసువర్గాల్లోనే చర్చ జరుగుతోంది. ఇక సోమవారం విశాఖ వచ్చిన హోం మంత్రి, ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కూడా కేసును ఎన్ఐఎకి అప్పగించడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ వ్యాఖ్యలు చేశారు. కుట్ర లేకుంటే అంత ఆందోళన ఎందుకో వైఎస్ జగన్‌పై హత్యాయత్న ఘటన వెనుక భారీ కుట్ర, విచారణలో పెద్దల ప్రభావం లేకుంటే ఎన్ఐఎ రంగంలోకి దిగగానే రాష్ట్ర ప్రభుత్వానికి, టీడీపీ పెద్దలకు ఇంత ఉలికిపాటు ఎందుకన్న వాదనలు ప్రతిపక్షాలు, ప్రజల నుంచే కాదు స్వయంగా ఎన్ఐఎ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. ఈ మేరకే ఎన్ఐఎ వర్గాలు యోచిస్తూ కేసు దర్యాప్తు ఎటు నుంచి మొదలుపెట్టాలనే యోచిస్తున్నాయి. పోలీసులు సహకరించడం లేదు.. ఎన్ఐఎ వర్గాలు వాస్తవానికి విచారణ దశలో ఉన్నప్పుడు కేసు వివరాల గురించి మేం ఎవ్వరితోనూ మాట్లాడకూడదు. విశాఖలోనే మకాం వేసిన మాకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల నుంచి సహకారం అందని మాట నిజమే. ఎన్ఐఎకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ వాళ్లేదో ఛాలెంజ్ చేయాలని చూస్తున్నారు.. ఈ విషయాలను మేం కేంద్ర హోంమంత్రిత్వశాఖ దృష్టికి తీసుకువెళ్లి కేసు దర్యాప్తును ముందుకు ఎలా తీసుకువెళ్లాలో చూస్తాం.. అని ఎన్ఐఎకి చెందిన ఓ అధికారి సోమవారం సాక్షి ప్రతినిధి వద్ద వ్యాఖ్యానించారు. కోర్టుకూ అదే సమాధానం.. న్యాయమూర్తి ఆగ్రహం విశాఖ లీగల్: రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జె.శ్రీనివాసరావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. నగరంలోని మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో నిందితుడి తరఫు న్యాయవాది సలీమ్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన సీడీ ఫైల్ ఇవ్వాలని ఏపీపీ పోలీసులను కోరగా.. పైఅధికారుల అనుమతిలేనిదే ఇవ్వలేమని స్పష్టం చేశారు. దీనితో ఏపీపీ అదే విషయాన్ని న్యాయమూర్తికి తెలిపారు. దీనితో న్యాయమూర్తి పార్థసారధి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. హైకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోలేదని పేర్కొంటూ బెయిల్ పిటిషన్ విచారణకు సంబంధించిన నోటీస్‌ను ఎన్ఐఏకు జారీ చేశారు. ఎన్ఐఏకు నోటీస్ ఇచ్చి విచారణ కొనసాగించాలని ఆదేశిస్తూ కేసును ఈనెల 19కి వాయిదా వేశారు. -
ఎట్టకేలకు విశాఖ పోలీసులకు బెయిల్
సాక్షి, విశాఖ : దొంగలను పట్టుకోవడానికి వెళ్లి అనూహ్యంగా రాజస్ధాన్ ఏసీబీకి చెక్కిన విశాఖ జిల్లా పోలీస్ అధికారులకు శుక్రవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో వారి కుటుంబాలు ఆనందంగా ఊపిరి పీల్చుకున్నాయి. దీంతో రెండు నెలల నిరీక్షణకు తెర పడింది. నగర శివారు పీఎం పాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలో గత ఏడాది ఆగస్టులో ఒక వ్యక్తిని నిర్బంధించి రాజస్ధాన్ ముఠా మూడు కిలోల బంగారు ఆభరణాలను దోచుకుపోయింది. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసేందుకు నార్త్ సబ్ డివిజన్ క్రైం సీఐ ఆర్‌వీఆర్‌కె చౌదరి, మహరాణిపేట క్రైం ఎస్ఐ గోపాలరావు, పరవాడ క్రైం ఎస్ఐ షరీఫ్, వన్‌టౌన్ క్రైం కానిస్టేబుల్ హరిప్రసాద్లతో కూడిన బృందం రాజస్థాన్‌లో బోధపూర్ వెళ్లింది. అక్కడ నిందితులను పట్టుకున్న తరువాత కొందరిని తప్పించేందుకు లంచం డిమాండ్ చేశారన్న అభియోగంతో అక్కడి ఏసీబీ అధికారులు ...విశాఖ పోలీసులను నవంబరు 5న అరెస్ట్ చేశారు. అక్కడ ఏసీబీ కోర్టు మన పోలీసులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయడంతో పోలీసులు రాజస్ధాన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ బెయిల్ పిటిషన్ విచారణ నవంబర్ 29న విచారణకు వచ్చింది. అప్పడే బెయిల్ లభిస్తుందని ఆశించినా కోర్టు జనవరి 5వ తేదీకి వాయిదా వేసింది. ఎట్టకేలకు శుక్రవారం బెయిల్ మంజూరు చేస్తూ రాజస్థాన్ హైకోర్టు తీర్పు చెప్పడంతో విశాఖ పోలీసులతో పాటు, వారి కుటుంబాల్లో సంతోషం వెల్లువెరిసింది. -
ఇంజినీరింగ్ విద్యార్థులే ఏటీఎం దొంగలు
విశాఖపట్టణం: నగరంలో ఏటీఎం దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులిద్దరూ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన వారు. నగరంలోని ఎంవీపీ కాలనీలో ఉన్న రెండు ఏటీఎంలలో రూ.4.92 లక్షలను వీరిద్దరూ కాజేశారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. యూపీలోని కుషినగర్ జిల్లా స్వప్నిల్ సింగ్(22), బిహార్‌లోని ఫైజాబాద్‌కు చెందిన సత్యరథ్ మిశ్రా(20) నాగ్‌పూర్‌లోని యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ సెకండియర్ చదువుకుంటున్నారు. ఆన్లైన్లో ఏటీఎం సాఫ్ట్‌వేర్‌ను టాంపరింగ్ చేసి డబ్బును డ్రా చేయడం నేర్చుకున్న విద్యార్థులు ఢిల్లీ, ఒడిశాలలో ఉన్న కొన్ని ఏటీఎంల్లో ప్రయత్నించి విఫలమయ్యారు. గత నెలలో విశాఖ చేరుకుని చోరీకి అనువైన ఎంవీపీ కాలనీలోని ఏటీఎంలను ఎంపిక చేసుకున్నారు. జూన్ 24 తేదీ నుంచి 28వ తేదీ వరకు అర్థరాత్రి 11 నుంచి 2 గంటల మధ్య మొత్తం 51 సార్లు దొంగతనానికి పాల్పడ్డారు. అయితే, ఎవరి వ్యక్తిగత అకౌంట్ల నుంచీ డబ్బు డ్రా చేయలేదు కాబట్టి, ఆయా బ్యాంకులకే అంతిమంగా నష్టం వాటిల్లింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆయా ఏటీఎంలలో ఉన్న సీసీ ఫుటేజిల ఆధారంగా విచారణ చేయగా నిందితులు కాన్పూర్‌లో ఉన్నారని తెలుసుకున్నారు. దీంతో అక్కడి వెళ్లిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని బుధవారం విశాఖకు తీసుకువచ్చారు. వారి వద్ద ఉన్న రూ.13 లక్షల నగదుతోపాటు ఆభరణాలతోపాటు కొంత సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు. -
విశాఖలో బాలకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు
అక్కయ్యపాలెం: మహిళలను కించపరిచేలా మాట్లాడిన హిందూపూర్ ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణపై విశాఖ పోలీసులకు ఫిర్యాదు అందింది. సామాన్య ప్రజాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కర్రి ఆదిబాబు నగరంలోని ఫోర్త్‌టౌన్ పోలీస్ స్టేషన్లో బాలకృష్ణపై ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన సావిత్రి సినిమా ఆడియో ఫంక్షన్లో బాలకృష్ణ చేసిన అసభ్యకర వ్యాఖ్యలు మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. ఈ వ్యాఖ్యలు మహిళల పట్ల బాలకృష్ణ వైఖరి ఏంటో తెలియ చేస్తాయని పేర్కొన్నారు. మహిళలను అగౌరవపరిచేలా మాట్లాడిన బాలకృష్ణపై ఐపీసీ సెక్షన్ 354, నిర్భయ చ ట్టాల కింద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. అయితే పోలీసులు ఇంకా ఎటువంటి కేసు నమోదు చేయలేదు.