ఇంజినీరింగ్ విద్యార్థులే ఏటీఎం దొంగలు
విశాఖపట్టణం: నగరంలో ఏటీఎం దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులిద్దరూ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన వారు. నగరంలోని ఎంవీపీ కాలనీలో ఉన్న రెండు ఏటీఎంలలో రూ.4.92 లక్షలను వీరిద్దరూ కాజేశారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. యూపీలోని కుషినగర్ జిల్లా స్వప్నిల్ సింగ్(22), బిహార్‌లోని ఫైజాబాద్‌కు చెందిన సత్యరథ్ మిశ్రా(20)
నాగ్‌పూర్‌లోని యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ సెకండియర్ చదువుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో ఏటీఎం సాఫ్ట్‌వేర్‌ను టాంపరింగ్ చేసి డబ్బును డ్రా చేయడం నేర్చుకున్న విద్యార్థులు ఢిల్లీ, ఒడిశాలలో ఉన్న కొన్ని ఏటీఎంల్లో ప్రయత్నించి విఫలమయ్యారు. గత నెలలో విశాఖ చేరుకుని చోరీకి అనువైన ఎంవీపీ కాలనీలోని ఏటీఎంలను ఎంపిక చేసుకున్నారు. జూన్ 24 తేదీ నుంచి 28వ తేదీ వరకు అర్థరాత్రి 11 నుంచి 2 గంటల మధ్య మొత్తం 51 సార్లు దొంగతనానికి పాల్పడ్డారు. అయితే, ఎవరి వ్యక్తిగత అకౌంట్ల నుంచీ డబ్బు డ్రా చేయలేదు కాబట్టి, ఆయా బ్యాంకులకే అంతిమంగా నష్టం వాటిల్లింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆయా ఏటీఎంలలో ఉన్న సీసీ ఫుటేజిల ఆధారంగా విచారణ చేయగా నిందితులు కాన్పూర్‌లో ఉన్నారని తెలుసుకున్నారు. దీంతో అక్కడి వెళ్లిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని బుధవారం విశాఖకు తీసుకువచ్చారు. వారి వద్ద ఉన్న రూ.13 లక్షల నగదుతోపాటు ఆభరణాలతోపాటు కొంత సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు.