విశాఖలోని తిరుమల ఆస్పత్రి
దొండపర్తి (విశాఖ దక్షిణ): విశాఖలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసును పోలీసులు ఛేదించారు. ఇందులో దళారులుగా వ్యవహరించిన ఆరుగురిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అసలు సూత్రధారితో పాటు సర్జరీ చేసిన ఇద్దరు వైద్యుల కోసం ప్రత్యేక బృందాల ద్వారా గాలిస్తున్నట్లు విశాఖ పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ తెలిపారు.
విశాఖ పోలీస్ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. 2019లో మహారాణిపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో కిడ్నీ రాకెట్ నడిపి ఏ4గా అరెస్టై.. 40 రోజుల పాటు విశాఖ జైలులో ఉన్న నార్ల వెంకటేష్ తాజా వ్యవహారంలోనూ అసలు సూత్రధారి అని వివరించారు. ఇతడే మొత్తం రాకెట్‌ను నడిపించాడని పేర్కొన్నారు.
డబ్బు ఆశ చూపి..
మధురవాడ వాంబే కాలనీకి చెందిన జి.వినయ్ కుమార్ ఒక సప్లయిస్ షాప్‌లో వెహికల్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ శ్రీను అనే వ్యక్తికి ప్రమాదం జరిగితే వినయ్ కుమార్ పరామర్శించడానికి వెళ్లాడు. అక్కడ అతడికి కామరాజు, ఎలీనా అనే వ్యక్తులను శ్రీను, అతడి భార్య కొండమ్మ పరిచయం చేశారు. మాటల సందర్భంలో కిడ్నీ ఇస్తే రూ.8.5 లక్షలు ఇస్తామని వారు వినయ్‌కుమార్‌కు చెప్పారు.
డబ్బుకు ఆశపడి వినయ్‌కుమార్ కిడ్నీ ఇచ్చేందుకు అంగీకరించాడు. దీంతో అతడిని ఒక ల్యాబ్‌కు తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. ఈ విషయం వినయ్‌కుమార్ తల్లిదండ్రులకు తెలియడంతో వారు వారించడంతో అతడు భయపడి హైదరాబాద్‌లో ఉంటున్న తన మేనత్త ఇంటికి వెళ్లిపోయాడు.
ఈ నేపథ్యంలో కామరాజు ఫోన్ చేసి కిడ్నీ ఇవ్వకపోతే వైద్య పరీక్షలకు అయిన ఖర్చు రూ.50 వేలు ఇవ్వాలని, లేనిపక్షంలో ఇంట్లో సామానులు బయట పడేస్తానని వినయ్ కుమార్‌ను బెదిరించాడు. దీంతో అతడు కిడ్నీ ఇవ్వడానికి అంగీకరించాడు. హైదరాబాద్ నుంచి వినయ్ విశాఖ రాగానే పెందుర్తిలో ఉన్న తిరుమల ఆస్పత్రికి తీసుకువెళ్లి అతడి కిడ్నీ తొలగించారు.
అనంతరం ఒప్పందం ప్రకారం రూ.8.5 లక్షలు ఇవ్వకపోగా.. రూ.5 లక్షలు ఇస్తున్నట్లు వీడియో రికార్డింగ్ చేసి అందులో రూ.2.5 లక్షలు నిందితులు తీసుకున్నారు. మూడు నెలలుగా వారి మధ్య డబ్బుల కోసం వివాదం నడిచింది. కామరాజు గ్యాంగ్ డబ్బులు ఇవ్వకపోవడంతో వినయ్‌కుమార్ పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చక్రం తిప్పిన వెంకటేష్
2019లో కిడ్నీ రాకెట్ వ్యవహారం నడిపిన నార్ల వెంకటేష్‌ది కడప. ఈ వ్యవహారంలో అతడు అప్పట్లో జైలు పాలయ్యాడు. ఆ తర్వాత జైలు నుంచి విడుదలయ్యాక కూడా ఇదే దందా నడుపుతున్నాడు. వెంకటేష్‌కు ఎలీనా, కామరాజు గ్యాంగ్‌తో పరిచయం ఉండడంతో వారి ద్వారా వినయ్‌కుమార్‌కు డబ్బు ఎరవేశాడు.
అతడి కిడ్నీ తొలగించేందుకు ఆస్పత్రిని గుర్తించే బాధ్యతను తన స్నేహితులు రమేష్, పవన్‌లకు అప్పగించాడు. దీంతో వీరిద్దరూ పెందుర్తిలో ఉన్న తిరుమల ఆస్పత్రి డాక్టర్ పరమేశ్వరరావును సంప్రదించారు. సర్జరీ ఆపరేషన్ థియేటర్, వార్డు ఇస్తే రూ.60 వేలు ఇస్తామని చెప్పారు. ఆ ఆస్పత్రి ఆధునికీకరణకు అప్పటికే ఆ డాక్టర్ రూ.2.5 కోట్లు ఖర్చు చేసి కొంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు.
ఒక రోజుకు రూ.60 వేలు వస్తుందని భావించి సర్జరీ చేసుకునేందుకు అంగీకరించారు. అన్నీ సమకూరాక వెంకటేష్ సర్జరీ చేసేందుకు వైద్యుల కోసం ప్రయత్నించాడు. ముందు కేర్ ఆస్పత్రి వారితో మాట్లాడినప్పటికీ వారు అంగీకరించలేదు. అయితే అందులో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న సాయితో వెంకటేష్‌కు పరిచయముంది. దీంతో సాయికి ఈ విషయం చెప్పడంతో తనకు తెలిసిన వైద్యులు ఉన్నారని.. వెంకటేష్‌కు ఇద్దరు డాక్టర్లను పరిచయం చేశాడు.
ఆ వైద్యులిద్దరూ సర్జరీ చేయడానికి అంగీకరించారు. ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్‌లో వినయ్‌కుమార్‌కు, ఈ ఏడాది ఫిబ్రవరిలో వాసుపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తికి తిరుమల ఆస్పత్రిలోనే కిడ్నీ తొలగించినట్లు పోలీసులు తమ విచారణలో తెలుసుకున్నారు. వినయ్‌కుమార్ కిడ్నీని మరో రాష్ట్రానికి చెందిన చౌహాన్ అనే వ్యక్తికి ట్రాన్స్‌ప్లాంట్ చేసినట్లు గుర్తించారు.
వెంకటేష్‌తో పాటు సర్జరీ చేసిన వైద్యుల కోసం కూడా పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఈ కేసులో ఎలీనా, కామరాజు, మర్రి శ్రీను, అతడి భార్య కొండమ్మతో పాటు ల్యాబ్ టెక్నీషియన్ శేఖర్, తిరుమల ఆస్పత్రి డాక్టర్ పరమేశ్వరరావును అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
వీరిపై 307, 326, 420, 120బీ సెక్షన్లతో పాటు అవయవాల మార్పిడి చట్టం ప్రకారం కేసులు నమోదు చేశామన్నారు. ఇంకెవరైనా బాధితులు ఉంటే వారి నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విశాఖ కేంద్రంగా కిడ్నీ రాకెట్ నడుస్తోందన్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ తేల్చిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment