మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శ్రీకాంత్
దొండపర్తి (విశాఖ దక్షిణ): జనసేన నాయకులు, కార్యకర్తలు పథకం ప్రకారమే విశాఖ విమానాశ్రయంలో మంత్రులపై దాడిచేశారని నగర పోలీస్ కమిషనర్ సిహెచ్.శ్రీకాంత్ చెప్పారు. ఆయన ఆదివారం విశాఖలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ విశాఖ పర్యటనలో జరిగిన పరిణామాలపై ఆ పార్టీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను కొట్టిపడేశారు. ఈ నెల 13వ తేదీన జనసేన రాష్ట్ర నాయకుడు కోన తాతారావు జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ జిల్లా పర్యటనకు సంబంధించిన వివరాలతో డీసీపీకి లేఖ ఇచ్చినట్లు చెప్పారు.
15వ తేదీ మధ్యాహ్నం రెండుగంటలకు ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా నోవోటెల్ హోటల్‌కు వెళతారని, 16వ తేదీ పోర్టు కళావాణి ఆడిటోరియంలో జనవాణి కార్యక్రమం, 17వ తేదీన వైఎంసీఏలో జరిగే కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళతారని ఆ లేఖలో పేర్కొన్నారని తెలిపారు. ఎయిర్‌పోర్టు నుంచి హోటల్‌కు ర్యాలీ, డీజే, భారీ జనసమీకరణల గురించి ఆ లేఖలో పేర్కొనలేదని, వాటికి అనుమతి కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు.
డ్రోన్ వినియోగానికి అనుమతి కోరగా.. రిమోట్ పైలెట్ ఎయిర్‌క్రాఫ్ట్ అనుమతి లేకపోవడంతో దాన్ని తిరస్కరించినట్లు చెప్పారు. సెక్షన్ 30 అమలులో ఉన్నప్పటికీ ముందస్తు అనుమతులు లేకుండా భారీ ఎత్తున జనసమీకరణ చేసి విమానాశ్రయానికి తరలించారని పేర్కొన్నారు. విశాఖ గర్జన కార్యక్రమాన్ని ముగించుకుని విమానాశ్రయానికి చేరుకున్న మంత్రులు రోజా, విడదల రజిని, జోగి రమేష్, టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి.. వైఎస్సార్‌సీపీ నాయకుల వాహనాలపై జనసేన నాయకులు, కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగానే పెద్ద ఎత్తున దాడులు చేశారని చెప్పారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి కూడా పాల్పడ్డారన్నారు.
ఈ దాడిలో మంత్రి రోజా పీఏ దిలీప్‌కుమార్‌కు, అక్కడే విధులు నిర్వర్తిస్తున్న పెందుర్తి పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావుకు గాయాలవడంతో ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. మంత్రి రోజాపై దాడిచేయడానికి ప్రయత్నించిన సమయంలో మధ్యలో ఉన్న పీఏ దిలీప్ తలకు తీవ్ర గాయమై కుట్లుకూడా పడ్డాయన్నారు. వారిచ్చిన ఫిర్యాదుల మేరకు దాడిచేసినవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. దాడులు అప్పటికప్పుడు నిర్ణయించుకున్నవి కాదని, వివిధ సమూహాల వ్యక్తులు, వేర్వేరు మంత్రులు, నాయకులను టార్గెట్ చేస్తూ ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే దాడులు చేసినట్లు తమ విచారణలో తేలిందని పేర్కొన్నారు.
అదేరోజు 70 మంది నిందితులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టామన్నారు. రిమాండ్ రిపోర్టు పరిశీలించిన న్యాయస్థానం వారిలో తొమ్మిదిమందికి జ్యుడిషియల్ రిమాండ్ విధించగా.. మిగిలిన వారిని సొంత పూచీకత్తు మీద విడుదల చేసినట్లు తెలిపారు. ఈ కేసు విచారణలో వెల్లడైన అంశాల ప్రకారం ఈ ఘటనపై ఆరుకేసులు నమోదుచేసి ఇప్పటివరకు వందమందిని అరెస్టు చేశామని, 82 మంది పరారీలో ఉన్నారని చెప్పారు.
జనసేన నాయకుల ఆరోపణలు అసత్యాలు
15వ తేదీన పవన్‌కళ్యాణ్ ర్యాలీ సందర్భంగా మంత్రులపై దాడులు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసంతోపాటు జాతీయ రహదారిపై నాలుగు గంటలపాటు పెద్ద ఎత్తున ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిందన్నారు. ర్యాలీలో యువకులు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయని చెప్పారు. అత్యవసర సర్వీసులకు ఆటంకాలు ఏర్పడ్డాయన్నారు. విమాన ప్రయాణికులు 30 మంది తమ విమానాలను మిస్ చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే 16వ తేదీన జనవాణి కార్యక్రమం నిర్వహించుకోవచ్చుగానీ, ర్యాలీగా వెళ్లకూడదని పవన్‌కు చెప్పామన్నారు.
తమ నాయకులు జైలులో ఉండడంతో జనవాణి కార్యక్రమానికి హాజరుకావడం లేదని ఆయన తమకు తెలిపారని, అయితే జనసేన నాయకుడు వరప్రసాద్ ఆధ్వర్యంలో జనవాణి కార్యక్రమాన్ని కొనసాగించారని చెప్పారు. పవన్ పర్యటన సందర్భంగా తగిన పోలీస్ భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఆయన ఎయిర్‌పోర్టుకు వచ్చినప్పటికీ నుంచి డీసీపీ (లా అండ్ ఆర్డర్) సుమిత్‌సునీల్ గరుడ్, డీసీపీ (క్రైం) నాగన్న.. అనుమతి లేకుండా చేసిన ర్యాలీ కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారని చెప్పారు.
ఆ ర్యాలీకి అనుమతి లేదన్న విషయాన్ని స్వయంగా డీసీపీ సుమిత్ జనసేన అధినేత పవన్‌కు తెలిపారన్నారు. అంతేతప్ప పవన్‌పై దుసురుగా ప్రవర్తించాలన్న ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యాలని కొట్టిపారేశారు. వారి కేడర్, నాయకులు మంత్రులపై దాడిచేసిన కారణంగానే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.
యువత ఇటువంటి క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుని తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ప్రవర్తించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు, కార్యకర్తలు విమానాశ్రయంలో మంత్రులపై దాడులు చేస్తున్న ఫొటోలు, వీడియోలను ప్రదర్శించారు. ఈ సమావేశంలో డీసీపీ (లా అండ్ ఆర్డర్) సుమిత్‌సునీల్ గరుడ్, ఏడీసీపీ (ఎస్బీ) ఆనందరెడ్డి, ఏసీపీ పెంటారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment