
సాక్షి, అమరావతి: విశాఖ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు చంద్రబాబు ఆదివారం ఫోన్‌చేశారు. పోలీసుల ఆంక్షలు, ప్రభుత్వ వైఖరిపై పవన్‌తో చంద్రబాబు మాట్లాడినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. పోలీసుల నోటీసు, జనసేన కార్యకర్తల అరెస్టుల గురించి చంద్రబాబుకు పవన్ వివరించారు. మరోవైపు.. అక్రమ అరెస్టులు, కేసులను చంద్రబాబు ట్విట్టర్‌లో ఖండించారు.
పవన్‌కు పోలీసులు నోటీసులివ్వడం సరికాదని, జనవాణిపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం దుర్మార్గమన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని వైసీపీ సర్కార్ రాజ్యమేలుతోందని, ప్రతిపక్షాల కార్యక్రమాలకు అడ్డుపడటం, వ్యక్తిగత దూషణలు అప్రజాస్వామికమని చంద్రబాబు జగన్ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ప్రతిపక్షాల కార్యక్రమాలను అడ్డుకునే హక్కు ప్రభుత్వానికి లేదని, అక్రమ కేసులను ఎత్తివేసి, వారిని విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.