అవనిగడ్డ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేస్తున్న జనసేన నేత బండ్రెడ్డి రామకృష్ణ
పలు నియోజకవర్గాల్లో నిరసనల మంట
అవనిగడ్డలో అడ్డం తిరిగిన జనసేన
యలమంచిలి టీడీపీ సమావేశం రసాభాస
రాజంపేటలో బత్యాల బల ప్రదర్శన
పాడేరులో గిడ్డి ఈశ్వరి ర్యాలీ
అవనిగడ్డ/ఎలమంచిలి/రాజంపేట/పాడేరు: పొత్తులో భాగంగా టికెట్ల కేటాయింపులో చంద్రబాబు నాయుడు, పవన్‌కళ్యాణ్ ఉమ్మడిగా ఆడుతున్న డబుల్‌గేమ్‌పై ఆయా నియోజకవర్గాల్లో ఆసమ్మతి జ్వాలలు రేగుతున్నాయి. అవనిగడ్డలో జనసేన నాయకులు ఎదురుతిరగగా, యలమంచిలిలో టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. రాజంపేట, పాడేరు నియోజకవర్గాల్లో ఆయా నేతలు ర్యాలీలు నిర్వహించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం జనసేన నేతలు మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ చేరికపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు సీటు ప్రకటిస్తే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని, ఎట్టి పరిస్ధితుల్లోనూ మద్దతిచ్చేది లేదని తెగేసి చెప్పారు. సోమవారం అవనిగడ్డలో జనసేన నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
బచ్చు వెంకటనాథ్ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో జనసేన ఉమ్మడి కృష్ణా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ మాట్లాడుతూ గత పదేళ్లుగా పార్టీ బలోపేతం కోసం కష్టపడిన నాయకులను కాదని ఈరోజు పార్టీలో చేరిన వారికి సీటు ఎలా ఇస్తారని మండిపడ్డారు. ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు మాట్లాడుతూ బుద్ధప్రసాద్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జనసేన కోసం పోరాడిన తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారని, నడిరోడ్డుపై నిలబెట్టి విమర్శలు చేసిన వ్యక్తికి నేడు సీటెలా ఇస్తారని ప్రశ్నించారు.
బుద్ధప్రసాద్‌కు సీటు ప్రకటిస్తే ఎట్టి పరిస్ధితుల్లోనూ మద్దతు ఇచ్చేది లేదని, వెంటనే మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని సమావేశంలో తీర్మానం చేశారు. ఎన్నికలకు ముందు పార్టీలు మారడం బుద్ధప్రసాద్‌కు అలవాటని, 2019లో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి, ఇప్పుడు జనసేనలోకి వచ్చారని కార్యకర్తలు మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ నుంచి జనసేనలో చేరిన వల్లభనేని బాలశౌరి మంత్రాంగం నడిపి బుద్ధప్రసాద్‌ను జనసేనలోకి తీసుకొచ్చారని, ఎంపీ సీటు కోసం ఆయన, ఎంఎల్‌ఏ సీటుకు బుద్ధప్రసాద్ పార్టీలు మారారని జనసైనికులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. పార్టీ నాయకులు మత్తి వెంకటేశ్వరరావు, చిలకలపూడి పాపారావు, గుడివాక శేషుబాబుతో పాటు ఆరు మండలాలకు చెందిన జనసేన నాయకులు సమావేశంలో పాల్గొన్నారు.
సమాచారం ఇవ్వకుండా మీటింగా?
అనకాపల్లి జిల్లా యలమంచిలిలో టీడీపీ సీనియర్ నేత పప్పల చలపతిరావు ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన ఆత్మియ సమావేశం రసాభాసగా ముగిసింది. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు తెలియకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కోట్లు ఖర్చు పెట్టించి ఐదేళ్లుగా టీడీపీ కోసం కష్టపడి పనిచేయించుకుని, పొత్తు పేరుతో నాగేశ్వరరావుకు హ్యాండిచ్చారని వారు నిరసన వ్యక్తం చేశారు.
అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సోదరుడు సీఎం రాజేష్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బుద్ధ నాగ జగదీష్ల సమక్షంలోనే పప్పల చలపతిరావును వేదికపైకి రానీయకుండా నెట్టేశారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట, ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్టీ సీనియర్లకు వ్యతిరేకంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సమావేశం ప్రారంభం కాకుండానే వాయిదా వేస్తున్నట్టు బుద్ధ నాగజగదీష్ ప్రకటించారు. పార్టీ అధిష్టానం నుంచి సానుకూల ప్రకటన రాకపోతే రెండ్రోజుల్లో 10 వేల మందితో సమావేశం ఏర్పాటు చేసి తమ సత్తా చూపుతామని ప్రగడ నాగేశ్వరరావు వర్గీయులు స్పష్టం చేశారు.
సుగవాసి వద్దే వద్దు
పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట టికెట్ రాయచోటి వాసి సుగవాసి బాలసుబ్రమణ్యానికి కేటాయించడం టీడీపీలో చిచ్చు రేపింది. సోమవారం టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, టీడీపీ రాజంపేట ఇన్‌చార్జి బత్యాల చెంగల్రాయుడు తన వర్గీయులతో బలప్రదర్శన చేపట్టారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని తిరుపతి రహదారిలోని ఎస్‌ఆర్ కళ్యాణ మండపం నుంచి ర్యాలీ కొనసాగింది. చంద్రబాబునాయుడు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుగవాసి వద్దు అంటూ నినాదాలు చేశారు. చెంగల్రాయుడు మాట్లాడుతూ తనే అభ్యర్ధి అని, రాజంపేట నుంచి పోటీ చేసి గెలిచి వస్తే మంచి భవిష్యత్తు కల్పిస్తామని చంద్రబాబే చెప్పారని తెలిపారు. కానీ సుగవాసి బాలసుబ్రమణ్యానికి టికెట్ ఇచి్చనట్లు సమాచారం వచ్చిందన్నారు. ర్యాలీ పాతబస్టాండు, శివాలయం, ఆర్టీసీ బస్టాండు, మన్నూరు మీదుగా యల్లమ్మగుడి వరకు కొనసాగింది.
రమేష్‌నాయుడిని ఓడిద్దాం
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తన అనుచరులతో సమావేశం నిర్వహించారు. టికెట్ దక్కలేదని ఆగ్రహంతో ఉన్న ఆమె సోమవారం కుమ్మరిపుట్టులోని తన నివాసంలో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన తన అనుచరులు, పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించి ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్ధి రమేష్ నాయుడు వద్దు..గిడ్డి ఈశ్వరి ముద్దు అంటూ నినాదాలు చేశారు. పార్టీ అధిష్టానం పునరాలోచించి గిడ్డి ఈశ్వరికి టికెట్ కేటాయించాలని, లేని పక్షంలో రమేష్నాయుడును ఓడిస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment