సిద్ధమవుతున్న సభా ప్రాంగణం
దొండపర్తి (విశాఖ దక్షిణ): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. శుక్రవారం సాయంత్రం 7.25 గంటలకు మోదీ విశాఖకు చేరుకోనున్నారు. శనివారం ఉదయం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇదే వేదికపై నుంచి రూ.15,233 కోట్లు విలువైన 9 ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
డ్రోన్లపై నిషేధం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా విశాఖ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే మద్దిలపాలెం జంక్షన్ నుంచి త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లే మార్గంలో వాహనాల రాకపోకలను అనుమతించడం లేదు. అలాగే సభ జరిగే ఏయూ మైదానానికి 5 కిలోమీటర్ల పరిధిని ‘నో డ్రోన్ జోన్’గా నగర పోలీస్ కమిషనర్ సి.హెచ్.శ్రీకాంత్ ప్రకటించారు.
ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సమయంలో ఎవరైనా డ్రోన్లు ఎగరవేస్తే వారిపై ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం 1934 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.
శంకుస్థాపనల ప్రాజెక్టులు..
రూ.7,614 కోట్లు విలువైన 5 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. వాటిలో..
► రూ.152 కోట్లతో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ.
► రూ.3,778 కోట్లతో రాయ్‌పూర్–విశాఖపట్నం 6 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే, ఎకనామిక్ కారిడార్.
► రూ.566 కోట్లతో కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్‌కు ప్రత్యేకమైన రోడ్డు.
► రూ.460 కోట్లతో విశాఖపట్నం రైల్వేస్టేషన్ అభివృద్ధి.
► రూ.2,658 కోట్లతో 321 కిలో మీటర్ల శ్రీకాకుళం–అంగుల్‌కు గెయిల్ పైప్‌లైన్ ప్రాజెక్టులు ఉన్నాయి.
సభ విజయవంతమే అందరి లక్ష్యం
వైఎస్సార్‌సీపీపీ నేత విజయసాయిరెడ్డి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సభను విజయవంతం చేయడమే అందరి లక్ష్యం కావాలని వైఎస్సార్‌సీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. 12న ప్రధాని సభ ఏర్పాట్లపై బుధవారం ఇక్కడి ప్రభుత్వ అతిథి గృహంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, నాయకులు సమన్వయంతో పని చేసి సభ విజయవంతానికి శాయశక్తులా కృషి చేయాలని చెప్పారు. ఈ సభకు సుమారు 3 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రధాని బహిరంగ సభకు వచ్చే గంట ముందుగానే ప్రజలు సభా ప్రాంగణానికి చేరుకునేలా చూసుకోవాలన్నారు.
ఈ సభలో ప్రధాని చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. అనంతరం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో విజయసాయిరెడ్డి సమీక్ష నిర్వహించారు. కాగా, మధ్యాహ్నం ప్రభుత్వ అతిథి గృహంలో ప్రధాని సభ ఏర్పాట్లు, ఇతర అంశాలకు సంబంధించి మంత్రి అమర్‌నాథ్ జీవీఎంసీ అధికారులతో సమీక్షించారు. ఆ తర్వాత ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్‌లో బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు.
జాతికి అంకితం చేసే ప్రాజెక్టులు ఇవీ..
రూ.7,619 కోట్లతో పూర్తి చేసిన నాలుగు ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. వాటిలో
► రూ.211 కోట్ల వ్యయంతో పాతపట్నం–నరసన్నపేటను కలుపుతూ నిర్మించిన నూతన జాతీయ రహదారి.
► రూ.2,917 కోట్లతో తూర్పు తీరంలో అభివృద్ధి చేసిన ఓఎన్‌జీసీ యు–ఫీల్డ్.
► రూ.385 కోట్లతో గుంతకల్‌లో ఐవోసీఎల్ గ్రాస్ రూట్ పీవోఎల్ డిపో నిర్మాణం.
► రూ.4,106 కోట్లతో విజయవాడ–గుడివాడ–భీమవరం–నిడదవోలు, గుడివాడ–మచిలీపట్నం, భీమవరం–నరసాపురం (221 కి.మీ.) రైల్వే లైన్ ఎలక్ట్రిఫికేషన్ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment