దొండపర్తి : ఆన్‌లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాకు విశాఖ పోలీసులు చెక్ పెట్టారు. బెట్టింగ్ వేసే వారిని నిలువునా ముంచుతున్న బుకీ గ్యాంగ్‌లో 11 మందిని అరెస్ట్ చేశారు. పోలీస్ కమిషనరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం డీసీపీ–1 కె.శ్రీనివాసరావు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. క్రికెట్ బెట్టింగ్ పేరుతో రూ.8 లక్షల వరకు తనను మోసం చేశారని నగరానికి చెందిన ఒక వ్యక్తి ఇటీవల పోలీస్ స్పందనలో ఫిర్యాదు చేశాడు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయంలో తీగ లాగితే డొంక కదిలింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలానికి చెందిన మెరుపురెడ్డి సూరిబాబు ఈ ముఠాలో ప్రధాన సూత్రధారుల్లో ఒకరుగా పోలీసులు గుర్తించారు.
అంతర్జాతీయ, ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో 20 నుంచి 30 మంది మంది నుంచి డబ్బులు వసూలు చేసి ఒక్కో మ్యాచ్‌కు రూ.4 లక్షల వరకు బెట్టింగ్ చేసేవాడు. ఇలా ఏడాదికి రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్లు బిజినెస్ టర్నోవర్ చేసేవాడు. ఇలా సేకరించిన మొత్తాన్ని నగరంలోని సూర్యాబాగ్ ప్రాంతంలో టూర్స్ అండ్ ట్రావెల్స్ నడిపిస్తున్న దినేష్‌కుమార్ అనే వ్యక్తికి పంపేవాడు. ఇందుకు అతడికి 2 శాతం కమీషన్ ఇచ్చేవాడు. ఇలా తనకు తెలిసిన వ్యక్తులను కూడా బుకీలుగా మార్చి బెట్టింగ్ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఈ బుకీ గ్యాంగ్ గుట్టుగా బెట్టింగ్ నిర్వహించడంతో పాటు.. బెట్టింగ్ వేసే వారికి డబ్బులు నష్టపోయేలా సాఫ్ట్‌వేర్లను రూపొందించారు.
సాధారణంగా గెలిచే అవకాశమున్న జట్టుకు తక్కువ పర్సెంట్, ఓడిపోయే అవకాశాలున్న జట్టుకు ఎక్కువ శాతం డబ్బును ఆఫర్ చేస్తుంటారు. ఆ విధంగా జట్టు మీద బెట్టింగ్ వేశాక కొంత సమయం వరకు వాటిని వేరొక జట్టుకు మార్చుకునే అవకాశం ఉంటుంది. కానీ వీరు అలా మార్చడానికి అవకాశం లేకుండా ఆ సమయంలో సర్వర్‌ను ఆఫ్ చేసేవారు. ప్రధానంగా గేమ్ విన్నర్, లాస్ ఆప్షన్స్.. హ్యాండ్లర్ చేతిలో ఉండడంతో ఒకవేళ గెలిచినప్పటికీ నష్టం వచ్చిందని చెప్పి వారి ఐడీని బ్లాక్ చేస్తారు. ఆ డబ్బును తమ కరెంట్ అకౌంట్లలోకి జమ చేసి వాటి నుంచి కార్పొరేట్ ఖాతాల్లోకి బదిలీ చేస్తున్నట్టు పోలీసుల విచారణలో నిర్ధారౖణెంది.
ఈ గ్యాంగ్‌కు సంబంధించిన 63 బ్యాంక్ ఖాతాలను గుర్తించి ఫ్రీజ్ చేయగా.. అందులో 36 ఖాతాల ద్వారా ఇప్పటి వరకు రూ.367.62 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. వాటిలో 13 అకౌంట్లలో ఉన్న రూ.75 లక్షలు స్తంభింపచేసినట్లు పోలీసులు చెప్పారు. అరెస్ట్ అయిన వారిలో సూరిబాబు, విశాఖకు చెందిన హండ దినే‹Ùకుమార్, బర్రి శ్రీను, గుర్రం శివ, కిల్లాడి శ్రీనివాసరావు, ఉరిటి కొండబాబు, ఉరిటి వెంకటేశ్వర్లు, సుందరాపు గణేష్, దూలి నూకరాజు, అల్లు నూకరాజు అవినాష్, ఉప్పు వాసుదేవరావులున్నారు. ఈ రాకెట్ వెనుక ప్రధాన సూత్రదారి కోసం గాలిస్తున్నట్టు డీసీపీ–1 శ్రీనివాస్ తెలిపారు. సమావేశంలో ఏడీసీపీ(ఎస్‌బీ) నాగేంద్రుడు, సైబర్ క్రైం సీఐ భవాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment