suribabu
-
ఆన్లైన్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
దొండపర్తి : ఆన్లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాకు విశాఖ పోలీసులు చెక్ పెట్టారు. బెట్టింగ్ వేసే వారిని నిలువునా ముంచుతున్న బుకీ గ్యాంగ్‌లో 11 మందిని అరెస్ట్ చేశారు. పోలీస్ కమిషనరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం డీసీపీ–1 కె.శ్రీనివాసరావు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. క్రికెట్ బెట్టింగ్ పేరుతో రూ.8 లక్షల వరకు తనను మోసం చేశారని నగరానికి చెందిన ఒక వ్యక్తి ఇటీవల పోలీస్ స్పందనలో ఫిర్యాదు చేశాడు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయంలో తీగ లాగితే డొంక కదిలింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలానికి చెందిన మెరుపురెడ్డి సూరిబాబు ఈ ముఠాలో ప్రధాన సూత్రధారుల్లో ఒకరుగా పోలీసులు గుర్తించారు. అంతర్జాతీయ, ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో 20 నుంచి 30 మంది మంది నుంచి డబ్బులు వసూలు చేసి ఒక్కో మ్యాచ్‌కు రూ.4 లక్షల వరకు బెట్టింగ్ చేసేవాడు. ఇలా ఏడాదికి రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్లు బిజినెస్ టర్నోవర్ చేసేవాడు. ఇలా సేకరించిన మొత్తాన్ని నగరంలోని సూర్యాబాగ్ ప్రాంతంలో టూర్స్ అండ్ ట్రావెల్స్ నడిపిస్తున్న దినేష్‌కుమార్ అనే వ్యక్తికి పంపేవాడు. ఇందుకు అతడికి 2 శాతం కమీషన్ ఇచ్చేవాడు. ఇలా తనకు తెలిసిన వ్యక్తులను కూడా బుకీలుగా మార్చి బెట్టింగ్ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఈ బుకీ గ్యాంగ్ గుట్టుగా బెట్టింగ్ నిర్వహించడంతో పాటు.. బెట్టింగ్ వేసే వారికి డబ్బులు నష్టపోయేలా సాఫ్ట్వేర్లను రూపొందించారు. సాధారణంగా గెలిచే అవకాశమున్న జట్టుకు తక్కువ పర్సెంట్, ఓడిపోయే అవకాశాలున్న జట్టుకు ఎక్కువ శాతం డబ్బును ఆఫర్ చేస్తుంటారు. ఆ విధంగా జట్టు మీద బెట్టింగ్ వేశాక కొంత సమయం వరకు వాటిని వేరొక జట్టుకు మార్చుకునే అవకాశం ఉంటుంది. కానీ వీరు అలా మార్చడానికి అవకాశం లేకుండా ఆ సమయంలో సర్వర్‌ను ఆఫ్ చేసేవారు. ప్రధానంగా గేమ్ విన్నర్, లాస్ ఆప్షన్స్.. హ్యాండ్లర్ చేతిలో ఉండడంతో ఒకవేళ గెలిచినప్పటికీ నష్టం వచ్చిందని చెప్పి వారి ఐడీని బ్లాక్ చేస్తారు. ఆ డబ్బును తమ కరెంట్ అకౌంట్లలోకి జమ చేసి వాటి నుంచి కార్పొరేట్ ఖాతాల్లోకి బదిలీ చేస్తున్నట్టు పోలీసుల విచారణలో నిర్ధారౖణెంది. ఈ గ్యాంగ్‌కు సంబంధించిన 63 బ్యాంక్ ఖాతాలను గుర్తించి ఫ్రీజ్ చేయగా.. అందులో 36 ఖాతాల ద్వారా ఇప్పటి వరకు రూ.367.62 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. వాటిలో 13 అకౌంట్లలో ఉన్న రూ.75 లక్షలు స్తంభింపచేసినట్లు పోలీసులు చెప్పారు. అరెస్ట్ అయిన వారిలో సూరిబాబు, విశాఖకు చెందిన హండ దినే‹Ùకుమార్, బర్రి శ్రీను, గుర్రం శివ, కిల్లాడి శ్రీనివాసరావు, ఉరిటి కొండబాబు, ఉరిటి వెంకటేశ్వర్లు, సుందరాపు గణేష్, దూలి నూకరాజు, అల్లు నూకరాజు అవినాష్, ఉప్పు వాసుదేవరావులున్నారు. ఈ రాకెట్ వెనుక ప్రధాన సూత్రదారి కోసం గాలిస్తున్నట్టు డీసీపీ–1 శ్రీనివాస్ తెలిపారు. సమావేశంలో ఏడీసీపీ(ఎస్బీ) నాగేంద్రుడు, సైబర్ క్రైం సీఐ భవాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
'భూములు వేలం వేసే హక్కు ఏపీ సర్కార్‌కు లేదు'
విజయవాడ: సదావర్తి సత్రం భూములను వేలం వేసే హక్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సూరిబాబు అన్నారు. గురువారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. సదావర్తి సత్రం భూములపై మద్రాస్ హైకోర్టులో కేసు నడుస్తుందని చెప్పారు. ఓ పక్క కేసు నడుస్తుండగా.. ప్రభుత్వం టీడీపీ నేతలకు కట్టబెట్టడం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. రూ. 10 కోట్లు విలువ చేసే భూమిని రూ. 27 లక్షలకే కట్టబెట్టడంపై మండిపడ్డారు. దీని వెనుక వందల కోట్లు చేతులు మారాయని సూరిబాబు ఆరోపించారు. -
ప్రియుడితో ఉన్న భార్యను హతమార్చిన భర్త
వివాహేతర సంబంధమే కారణం కత్తితో వెంటాడి నరికివేత గాయాలతో తప్పించుకున్న ప్రియుడు పోలీసులకు లొంగిపోయిన భర్త అనాధలైన పిల్లలు జగపతినగరం (కిర్లంపూడి) : వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. భర్త అయ్యప్పస్వామి మాల వేసి శబరిమల వెళ్లి పుణ్యక్షేత్రాలు తిరిగి ఇంటికి వచ్చేప్పటికి భార్య మరో వ్యక్తితో గదిలో ఉండటాన్ని చూసి ఆగ్రహానికి గురై కత్తితో భార్య, ప్రియుడుపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో స్వల్పగాయాలతో ప్రియుడు తప్పించుకోగా, భార్య మృతి చెందింది. దీనికి సంబంధించి కిర్లంపూడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కిర్లంపూడి మండలం జగపతినగరం గ్రామానికి చెందిన బొండా అప్పారావు అయ్యప్పమాల ధరించి శబరిమల వెళ్లి ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో తిరిగి వచ్చాడు. అతను వచ్చేప్పటికి వివాహేతర సంబంధం కారణంగా గదిలో అతని భార్య బొండా కమల (28), అదే గ్రామానికి చెందిన రాకోటి సూరిబాబులు కలిసి ఉండటాన్ని చూశాడు. దీంతో కోపోధ్రికుడైన అప్పారావు ఇరువురిపైన కత్తితో దాడికి దిగాడు. ఈ దాడిలో ప్రియుడు సూరిబాబు స్వల్ప గాయాలతో తప్పించుకుని పారిపోగా భార్య కమలను వెంటాడి నరికి చంపాడు. అనంతరం తన ఇద్దరు పిల్లలను పక్కింటి వారికి అప్పజెప్పి కిర్లంపూడి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ సంఘటనలో వీరి పిల్లలు ఏడేళ్ల శశిధర్, ఐదేళ్ల శివకుమార్‌లు అనాధలయ్యారు. తల్లి మృతి చెందడం, తండ్రి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లడంతో బిత్తర చూపులు చూస్తున్న చిన్నారులను చూసి స్థానికులు కన్నీంటిపర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న కిర్లంపూడి ఎస్సై సీహెచ్ విద్యాసాగర్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అలాగే పత్తిపాడు సీఐ సూర్యనారాయణ సంఘటన స్థలాన్ని పరిశీలించి ఎస్సైను కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక వీఆర్వో ఇమ్మానుయేలు ఫిర్యాదు మేరకు కిర్లంపూడి ఎస్సై కేసు నమోదు చేయగా, సీఐ దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనలో గాయపడ్డ ప్రియుడు సూరిబాబును ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా, కమల మృతదేహాన్ని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
వారం వ్యవధిలో ముగ్గురి మృతి
లింగాపుట్టులో మళ్లీ జ్వరాల తీవ్రత సత్యవరంలో ఐదుగురికి డెంగ్యూ ఆందోళన లో గ్రామస్తులు పాడేరు రూరల్ : మండలంలోని గొండెలి పంచాయతీ లింగాపుట్టులో మళ్లీ జ్వరాల తీవ్రత అధికమైంది. వారం రోజుల వ్యవధిలో రెండు నెలల శిశువుతో పాటు మరో ఇద్దరు గిరిజనులు మృతి చెందారు. గ్రామానికి చెందిన మంజెలి పిన్నయ్య అనే గిరిజనుడు రెండు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాదపడుతున్నాడు. శుక్రవారం ఉదయం ఆరోగ్య పరిస్థితి ఒక్క సారిగా విషమించటంతో అంబులెన్స్‌లో పాడేరు ప్రాంతీయ ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మార్గంమధ్యలో మృతి చెందాడు. గ్రామానికి చెందిన పలాసి రాజయ్య, రెండు నెలల శిశువు వారం రోజుల్లో మృత్యువాత పడ్డారు. మంచినీటి పథకం మూలకు చేరడంతో గిరిజనులు గెడ్డల్లోని కలుషిత నీరు తాగుతుండడంతో వల్లే అనారోగ్యంబారిన పడుతున్నారు. వాస్తవానికి గురువారమే మినుములూరు వైద్య సిబ్బంది గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి బాధితులకు వైద్యం అందించినా జ్వరాలు తగ్గుముఖం పట్టడం లేదు. తక్షణమే మెరుగైన వైద్య శిబిరం ఏర్పాటు చేసి, సురక్షిత తాగునీరందించేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. సత్యవరంలో డెంగ్యూ బెంగ మాడుగుల : మండలంలోని సత్యవరం గ్రామంలో డెంగ్యూ, జ్వరాలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఇప్పటికే గ్రామానికి చెందిన మిరియాల దేముడమ్మ, మీసాల సూరిబాబులతో పాటు మరో ముగ్గురికి డెంగ్యూ వ్యాధి సోకిందన్న అనుమానంతో కుటుంబ సభ్యులు వారిని విశాఖ కేజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నారు. డెంగ్యూ బాధితుల తరలింపుతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. గ్రామంలో మరో 10 మందికి జ్వరాలుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఇక్కడ మెగా వైద్య శిబిరం ఏర్పాటుచేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. దీనిపై కింతలి పీహెచ్సీ వైద్యులను సంప్రదించగా ఈ నెల 9న వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, అయినా జ్వరాలు తగ్గుముఖం పట్టలేదని చెప్పారు. కలుషిత నీరు కారణంగా పరిస్థితి మళ్లీ దిగజారి ఉండొచ్చని తెలిపారు. వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామన్నారు.