ప్రియుడితో ఉన్న భార్యను హతమార్చిన భర్త
- వివాహేతర సంబంధమే కారణం
- కత్తితో వెంటాడి నరికివేత
- గాయాలతో తప్పించుకున్న ప్రియుడు
- పోలీసులకు లొంగిపోయిన భర్త
- అనాధలైన పిల్లలు
జగపతినగరం (కిర్లంపూడి) : వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. భర్త అయ్యప్పస్వామి మాల వేసి శబరిమల వెళ్లి పుణ్యక్షేత్రాలు తిరిగి ఇంటికి వచ్చేప్పటికి భార్య మరో వ్యక్తితో గదిలో ఉండటాన్ని చూసి ఆగ్రహానికి గురై కత్తితో భార్య, ప్రియుడుపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో స్వల్పగాయాలతో ప్రియుడు తప్పించుకోగా, భార్య మృతి చెందింది.
దీనికి సంబంధించి కిర్లంపూడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కిర్లంపూడి మండలం జగపతినగరం గ్రామానికి చెందిన బొండా అప్పారావు అయ్యప్పమాల ధరించి శబరిమల వెళ్లి ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో తిరిగి వచ్చాడు. అతను వచ్చేప్పటికి వివాహేతర సంబంధం కారణంగా గదిలో అతని భార్య బొండా కమల (28), అదే గ్రామానికి చెందిన రాకోటి సూరిబాబులు కలిసి ఉండటాన్ని చూశాడు. దీంతో కోపోధ్రికుడైన అప్పారావు ఇరువురిపైన కత్తితో దాడికి దిగాడు.
ఈ దాడిలో ప్రియుడు సూరిబాబు స్వల్ప గాయాలతో తప్పించుకుని పారిపోగా భార్య కమలను వెంటాడి నరికి చంపాడు. అనంతరం తన ఇద్దరు పిల్లలను పక్కింటి వారికి అప్పజెప్పి కిర్లంపూడి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ సంఘటనలో వీరి పిల్లలు ఏడేళ్ల శశిధర్, ఐదేళ్ల శివకుమార్‌లు అనాధలయ్యారు. తల్లి మృతి చెందడం, తండ్రి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లడంతో బిత్తర చూపులు చూస్తున్న చిన్నారులను చూసి స్థానికులు కన్నీంటిపర్యంతమయ్యారు.
విషయం తెలుసుకున్న కిర్లంపూడి ఎస్సై సీహెచ్ విద్యాసాగర్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అలాగే పత్తిపాడు సీఐ సూర్యనారాయణ సంఘటన స్థలాన్ని పరిశీలించి ఎస్సైను కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక వీఆర్వో ఇమ్మానుయేలు ఫిర్యాదు మేరకు కిర్లంపూడి ఎస్సై కేసు నమోదు చేయగా, సీఐ దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనలో గాయపడ్డ ప్రియుడు సూరిబాబును ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా, కమల మృతదేహాన్ని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.