
సాక్షి ప్రతినిధి విశాఖపట్నం/ విశాఖ లీగల్: తెలుగు రాష్ట్రాలతోపాటు జాతీయస్థాయిలో కలకలం సృష్టించిన రాష్ట్ర ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు మంగళవారం కీలక మలుపు తిరిగింది. ఇటీవల ఆ కేసుని కేంద్ర హోం శాఖ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కి అప్పగించిన సంగతి తెలిసిందే. వెంటనే రంగంలోకి దిగిన ఎన్‌ఐఏ అధికారులు విశాఖ చేరుకుని విచారణ మొదలుపెట్టారు. సోమవారం నిందితుడు శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగిన సమయంలో విశాఖ పోలీసులు ఎన్‌ఐఏ అధికారులకు రికార్డులు ఇవ్వడానికి నిరాకరించారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంగళవారం ఎన్‌ఐఏ అధికారులు విజయవాడలోని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఆర్‌పీసీ సెక్షన్ 41 (డి) ప్రకారం నిందితుడిని తమకు అప్పగించాలని, స్థానిక పోలీసులు ఇప్పటివరకూ చేపట్టిన విచారణకు సంబంధించిన అన్ని ఫైళ్లు తమకు అప్పగించాలని న్యాయస్థానాన్ని కోరారు. ప్రస్తుతం ఈ పిటిషన్ న్యాయస్థానంలో విచారణలో ఉంది. విశాఖ పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు సహకరించకపోవడంతో ఇప్పటికే ఎన్‌ఐఏ అధికారులు విజయవాడలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో ఒక పిటిషన్ వేశారు.
ఇకపై కేసు విచారణ విజయవాడలోనే
విశాఖపట్నంలోని 7వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఉన్న కేసు విజయవాడకు బదిలీ అయింది. ఈ మేరకు విజయవాడ లోని ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి విశాఖ కోర్టుకు ఆదే శాలు జారీ చేశారు. ఆ ఆదేశాలు విశాఖలోని కోర్టుకు మంగళవారం అందా యి. కేసు విచారణ విజయవాడలో జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment