సాక్షి, విశాఖ : దొంగలను పట్టుకోవడానికి వెళ్లి అనూహ్యంగా రాజస్ధాన్ ఏసీబీకి చెక్కిన విశాఖ జిల్లా పోలీస్ అధికారులకు శుక్రవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో వారి కుటుంబాలు ఆనందంగా ఊపిరి పీల్చుకున్నాయి. దీంతో రెండు నెలల నిరీక్షణకు తెర పడింది. నగర శివారు పీఎం పాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలో గత ఏడాది ఆగస్టులో ఒక వ్యక్తిని నిర్బంధించి రాజస్ధాన్ ముఠా మూడు కిలోల బంగారు ఆభరణాలను దోచుకుపోయింది. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసేందుకు నార్త్ సబ్ డివిజన్ క్రైం సీఐ ఆర్‌వీఆర్‌కె చౌదరి, మహరాణిపేట క్రైం ఎస్‌ఐ గోపాలరావు, పరవాడ క్రైం ఎస్‌ఐ షరీఫ్, వన్‌టౌన్ క్రైం కానిస్టేబుల్ హరిప్రసాద్‌లతో కూడిన బృందం రాజస్థాన్‌లో బోధపూర్ వెళ్లింది.
అక్కడ నిందితులను పట్టుకున్న తరువాత కొందరిని తప్పించేందుకు లంచం డిమాండ్ చేశారన్న అభియోగంతో అక్కడి ఏసీబీ అధికారులు ...విశాఖ పోలీసులను నవంబరు 5న అరెస్ట్ చేశారు. అక్కడ ఏసీబీ కోర్టు మన పోలీసులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయడంతో పోలీసులు రాజస్ధాన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ బెయిల్ పిటిషన్ విచారణ నవంబర్ 29న విచారణకు వచ్చింది. అప్పడే బెయిల్ లభిస్తుందని ఆశించినా కోర్టు జనవరి 5వ తేదీకి వాయిదా వేసింది. ఎట్టకేలకు శుక్రవారం బెయిల్ మంజూరు చేస్తూ రాజస్థాన్ హైకోర్టు తీర్పు చెప్పడంతో విశాఖ పోలీసులతో పాటు, వారి కుటుంబాల్లో సంతోషం వెల్లువెరిసింది.
Comments
Please login to add a commentAdd a comment