సాక్షి, విశాఖపట్నం: అచ్చెన్నాయుడు అనుచరులకు విశాఖ పోలీసులు షాక్ ఇచ్చారు. శ్రీకాకుళానికి చెందిన టీడీపీ నాయకులు అర్థరాత్రి విశాఖలో హల్ చల్ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుండగా పోలీసులపై దౌర్జన్యం చేశారు. టీడీపీ నాయకులపై చర్యలు లేవని ‘సాక్షి’లో కథనాలు ప్రసారం చేయడంతో యంత్రాంగం కదిలింది. నలుగురు టీడీపీ నాయకులపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు.
అసలేం జరిగిందంటే..
పచ్చబిళ్ల చూపిస్తే పనైపోవాలి.. అంటూ గతంలో టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను పుణికిపుచ్చుకున్న ఆయన మనుషులు విశాఖలో బరితెగించారు. శ్రీకాకుళం నుంచి వచ్చి విశాఖలో పూటుగా మద్యం తాగి ట్రాఫిక్ పోలీసులపై రెచ్చిపోయారు. మంగళవారం అర్ధరాత్రి విశాఖలోని మద్దిలపాలెంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న ఎంవీపీ కాలనీ ట్రాఫిక్ పోలీసులపై ప్రతాపం చూపించారు.
తనిఖీ కోసం కారు ఆపిన పోలీసులను తప్పించుకుని వేగంగా దూసుకెళ్లారు. దీంతో వారి వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసేందుకు సహకరించాలని కోరగా వారిపై రెచ్చిపోయారు. ‘ఒరేయ్ అధికార పార్టీ నాయకుల కారునే ఆపుతారా.. మీ అంతు తేలుస్తాం రా.. అచ్చెన్నాయుడి మనుషులనే అడ్డుకోవడానికి మీకు ఎంత ధైర్యం?..’ అంటూ శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం తామరాపల్లికి చెందిన టీడీపీ నాయకుడు పోలాకి ఢిల్లీశ్వరరావు తదితరులు రెచ్చిపోయారు.
రోడ్డుపై వాహనాల రాకపోకలకు విఘాతం కలిగిస్తూ వీరంగం సృష్టించారు. దీంతో కొందరు పోలీసులు వారి చేష్టలను వీడియో తీసే ప్రయత్నం చేయగా వారిపైనా బెదిరింపులకు తెగబడ్డారు. ‘తీయండ్రా తీయండి.. ఎన్ని వీడియోలు కావాలంటే అన్ని వీడియోలు తీసుకోండి.. మిమ్మల్ని సస్పెండ్ చేయించి, వీఆర్‌కు పంపించకపోతే మా పేర్లు మార్చుకుంటాం’ అంటూ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment