సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కుట్ర కేసు దర్యాప్తు మొదలు పెట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)కు విశాఖ పోలీసుల నుంచి సహాయ నిరాకరణ కొనసాగుతోంది. విశాఖ విమానాశ్రయంలో గత ఏడాది అక్టోబర్ 25న వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనపై సమగ్ర విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)కు అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్రహోం శాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు జనవరి 1న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి రంగంలోకి దిగిన ఎన్‌ఐఎ ప్రధాన దర్యాప్తు అధికారి (సీఐఓ) మహ్మద్ సాజిద్‌ఖాన్ సహా ఐదుగురు అధికారులకు విశాఖ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద కేసులను సైతం ధైర్యంగా, చాకచాక్యంగా ఎదుర్కొన్న ఎన్‌ఐఎ అధికారులకు ఇలా ఓ రాష్ట్ర పోలీసు యంత్రాంగం నుంచి సహాయనిరాకరణ ఎదురుకావడం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.
కేసు విచారణ ఫైళ్లు అప్పగించడం సంగతి పక్కన పెడితే కనీసం కేసు వివరాలను కూడా చెప్పేందుకు విశాఖ పోలీసు అధికారులు నిరాకరించడాన్ని ఎన్‌ఐఎ అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆదేశాలతో ఎన్‌ఐఎ అధికారులు విశాఖ చేరుకున్న రోజు నుంచే నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్హా సెలవుపై వెళ్లిపోయారు. దీంతో ఎన్‌ఐఎ బృందం జగన్‌పై హత్యాయత్నం ఘటనపై విచారణకు రెండు నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులను, కేసు నమోదు చేసిన ఎయిర్‌పోర్ట్ పోలీసులను సంప్రదించింది. తొలి రెండురోజులు సమాచారం ఇవ్వలేమని, ఆ మేరకు ప్రభుత్వ ఆదేశాలున్నాయని ఎన్‌ఐఎ వర్గాలతో చెప్పిన సిట్ అధికారులు సోమవారం కనీసం వారిని కలిసేందుకు కూడా ఇష్టపడలేదని తెలుస్తోంది. కేసును ఎన్‌ఐఎకు అప్పగించడంపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్రప్రభుత్వానికి లేఖ రాయాలని, అవసరమైతే కోర్టులో పిటిషన్ వేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఈ మేరకు ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాలతో విశాఖ పోలీసులు, సిట్ అధికారులు ఎన్‌ఐఎ వర్గాలను ఏమాత్రం లెక్క చేయడం లేదు. కాగా ఎన్‌ఐఎ అధికారులకు విశాఖ పోలీసుల్లో ఎవరైనా సహకరిస్తున్నారా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు నిఘా వేశారు. ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్ మంత్రి, టీడీపీలో కీలక నాయకుడు ఆదివారం పొద్దుపోయాక ఈ కేసు గురించి వాస్తవాలు తెలిసిన ఓ పోలీసు అధికారికి ఫోన్ చేసి బెదిరింపు ధోరణిలో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఎన్‌ఐఎ అధికారులకు ఏ మాత్రం సహకరించినా బాగుండదు.. అని హుకుం జారీ చేసినట్లు పోలీసువర్గాల్లోనే చర్చ జరుగుతోంది. ఇక సోమవారం విశాఖ వచ్చిన హోం మంత్రి, ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కూడా కేసును ఎన్‌ఐఎకి అప్పగించడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ వ్యాఖ్యలు చేశారు.
కుట్ర లేకుంటే అంత ఆందోళన ఎందుకో
వైఎస్ జగన్‌పై హత్యాయత్న ఘటన వెనుక భారీ కుట్ర, విచారణలో పెద్దల ప్రభావం లేకుంటే ఎన్‌ఐఎ రంగంలోకి దిగగానే రాష్ట్ర ప్రభుత్వానికి, టీడీపీ పెద్దలకు ఇంత ఉలికిపాటు ఎందుకన్న వాదనలు ప్రతిపక్షాలు, ప్రజల నుంచే కాదు స్వయంగా ఎన్‌ఐఎ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. ఈ మేరకే ఎన్‌ఐఎ వర్గాలు యోచిస్తూ కేసు దర్యాప్తు ఎటు నుంచి మొదలుపెట్టాలనే యోచిస్తున్నాయి.
పోలీసులు సహకరించడం లేదు.. ఎన్‌ఐఎ వర్గాలు
వాస్తవానికి విచారణ దశలో ఉన్నప్పుడు కేసు వివరాల గురించి మేం ఎవ్వరితోనూ మాట్లాడకూడదు. విశాఖలోనే మకాం వేసిన మాకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల నుంచి సహకారం అందని మాట నిజమే. ఎన్‌ఐఎకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ వాళ్లేదో ఛాలెంజ్ చేయాలని చూస్తున్నారు.. ఈ విషయాలను మేం కేంద్ర హోంమంత్రిత్వశాఖ దృష్టికి తీసుకువెళ్లి కేసు దర్యాప్తును ముందుకు ఎలా తీసుకువెళ్లాలో చూస్తాం.. అని ఎన్‌ఐఎకి చెందిన ఓ అధికారి సోమవారం సాక్షి ప్రతినిధి వద్ద వ్యాఖ్యానించారు.
కోర్టుకూ అదే సమాధానం.. న్యాయమూర్తి ఆగ్రహం
విశాఖ లీగల్: రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జె.శ్రీనివాసరావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. నగరంలోని మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో నిందితుడి తరఫు న్యాయవాది సలీమ్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన సీడీ ఫైల్ ఇవ్వాలని ఏపీపీ పోలీసులను కోరగా.. పైఅధికారుల అనుమతిలేనిదే ఇవ్వలేమని స్పష్టం చేశారు. దీనితో ఏపీపీ అదే విషయాన్ని న్యాయమూర్తికి తెలిపారు. దీనితో న్యాయమూర్తి పార్థసారధి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. హైకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోలేదని పేర్కొంటూ బెయిల్ పిటిషన్ విచారణకు సంబంధించిన నోటీస్‌ను ఎన్‌ఐఏకు జారీ చేశారు. ఎన్‌ఐఏకు నోటీస్ ఇచ్చి విచారణ కొనసాగించాలని ఆదేశిస్తూ కేసును ఈనెల 19కి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment