విజయవాడ లీగల్/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/రాజమహేంద్రవరం క్రైం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసుకు సంబంధించి పూర్తి రికార్డులు, మెటీరియల్ ఆబ్జెక్టులను ఎన్‌ఐఏకు అప్పగించాలని రాష్ట్ర పోలీసులను న్యాయస్థానం శుక్రవారం ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన రికార్డులు, మెటీరియల్ ఆబ్జెక్టులను తమకు ఇవ్వకుండా ఏపీ పోలీసులు సహాయనిరాకరణ చేస్తున్నారని ఎన్‌ఐఏ అధికారులు న్యాయస్థానంలో గురువారం ప్రత్యేక మెమో దాఖలు చేసిన విషయం తెలిసిందే. రికార్డులు ఇవ్వకపోవడంతో నిబంధనల మేరకు 90 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయలేకపోతున్నామని, దాంతో నిందితుడికి బెయిల్ వచ్చే అవకాశం ఉందని ఎన్‌ఐఏ అధికారులు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ మెమోపై విచారించిన విజయవాడలోని ఎన్‌ఐఏ న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి సంబంధించి రాష్ట్ర పోలీసులు ఇప్పటిదాకా చేసిన దర్యాప్తు వివరాలతో కూడిన నివేదిక, ఆ కేసుకు సంబంధించిన రికార్డులు, మెటీరియల్ ఆబ్జెక్టులను ఎన్‌ఐఏ అధికారులకు అందజేయాలని విశాఖపట్నం పోలీసు అధికారులను ఆదేశించింది. దీంతో వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో ఎన్‌ఐఏ తమ దర్యాప్తును మరింత వేగవంతం చేసేందుకు మార్గం సుగమమైంది.
నిందితుడు శ్రీనివాసరావును విజయవాడ కోర్టుకు తీసుకొస్తున్న ఎన్‌ఐఏ అధికారులు
25 వరకు నిందితుడి రిమాండ్ పొడిగింపు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుకు ఈ నెల 25 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ విజయవాడలోని ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిందితుడు వారం రోజుల ఎన్‌ఐఏ కస్టడీ శుక్రవారంతో ముగిసింది. దాంతో ఎన్‌ఐఏ అధికారులు అతడిని విజయవాడలోని ప్రత్యేక కోర్టలో శుక్రవారం హాజరుపరిచారు. నిందితుడి వైద్య పరీక్షల రిపోర్టులను కూడా దాఖలు చేశారు. ఎన్‌ఐఏ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారా... ఏమైనా ఇబ్బందులు పెట్టారా అని నిందితుడు శ్రీనివాసరావును న్యాయమూర్తి ప్రశ్నించారు. తనను ఏ విధంగానూ ఇబ్బంది పెట్టలేదని శ్రీనివాసరావు బదులిచ్చాడు. నిందితునికి ప్రాణహాని ఉందని, విజయవాడ జిల్లా జైలు సురక్షితం కాదని అతడి తరఫు న్యాయవాది సలీం న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై న్యాయమూర్తి నిందితుడిని జైలులో పరిస్థితుల గురించి అడగ్గా, తనకు విజయవాడ జైలు అయినా రాజమండ్రి జైలు అయిన ఇబ్బంది లేదని తెలిపాడు. దాంతో అతడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
అనంతరం శ్రీనివాసరావును ఎన్‌ఐఏ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. తాను తప్ప మరే న్యాయవాది శ్రీనివాసరావును కలవకూడదంటూ అతడి తరఫు న్యాయవాది సలీం కోర్టులో మెమో దాఖలు చేశారు. తాను లేని సమయంలో శ్రీనివాసరావును ఎన్‌ఐఏ అధికారులు 30 గంటలపాటు విచారించారని, ఆ వివరాలను కోర్టువారు పరిగణనలోకి తీసుకోరాదని కోరారు. దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్లు స్పందిస్తూ.. శ్రీనివాసరావును విచారించడానికి వారంరోజుల కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులను అతనికి అందజేయగా విచారణకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదని నిందితుడు లిఖితపూర్వకంగా పేర్కొన్నాడని తెలిపారు. శ్రీనివాసరావును కస్టడీకి తీసుకున్న అనంతరం ఫోన్ ద్వారా అతడి తరఫు న్యాయవాది సలీంకు సమాచారం ఇచ్చామని న్యాయస్థానానికి తెలిపారు.
22 పేజీల లేఖపై 23న వాదనలు
నిందితుడు శ్రీనివాసరావు విశాఖపట్నం జైలులో రాసిన 22 పేజీల లేఖను జైలు సూపరింటెండెంట్ తీసుకున్నారని అతడి తరఫు న్యాయవాది సలీం న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఆ లేఖను తనకు ఇప్పించాలని కోరుతూ మెమో దాఖలు చేశారు. దీనిపై ఎన్‌ఐఏ తరఫున ప్రత్యేక పబ్లిక్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వాదనలు వినిపించారు. ఆ 22 పేజీల లేఖను కేసు దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏ ప్రధాన అధికారికి అప్పగించాలని కోరారు. ఆ తరువాతే ఆ లేఖ కాపీని నిందితుడి తరఫు న్యాయవాదికి ఇవ్వాలని న్యాయస్థానానికి విన్నవించారు. దీనిపై ప్రత్యేక మెమో దాఖలు చేయాలని ఎన్‌ఐఏ తరఫున వాదిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్లను న్యాయమూర్తి ఆదేశించారు. ఈ కేసు విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేశారు.
కొనసాగుతున్న ఎన్‌ఐఏ విచారణ
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. విశాఖపట్నంలోనే మకాం వేసిన ఎన్‌ఐఏ అధికారులు గురు, శుక్రవారాల్లో ఘటనాస్థలం విశాఖ ఎయిర్‌పోర్ట్‌లోని వీవీఐపీ లాంజ్, పక్కనే ఉన్న ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ ప్రాంతాలను నిశితంగా పరిశీలించారు. కైలాసగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్‌ఐఏ తాత్కాలిక కార్యాలయంలో కొద్దిరోజులుగా సాక్షులను విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీకి చెందిన మాజీ కార్పొరేటర్ జియ్యాని శ్రీధర్‌ను శుక్రవారం రెండున్నర గంటలపాటు విచారించారు. మూడు రోజుల క్రితం శ్రీధర్‌ను పిలిపించి వైఎస్ జగన్‌పై హత్యాయత్న ఘటన సమయంలో ఏం జరిగిందో వివరాలు నమోదు చేసుకున్న ఎన్‌ఐఎ అధికారులు శుక్రవారం మరోసారి విచారణ చేపట్టారు. ఆ రోజు ఏం జరిగింది? హత్యాయత్నం సమయంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు? అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాగా, విచారణకు హాజరు కావాల్సిందిగా ఎన్‌ఐఏ నుంచి నోటీసులు అందుకున్న మిగిలిన వైఎస్సార్‌సీపీ నేతలు శనివారం హాజరుకానున్నట్టు సమాచారం.
ఆరోగ్యం కుదుటపడ్డాక విచారణకు సహకరిస్తా: హర్షవర్దన్ చౌదరి
జగన్‌పై హత్యాయత్నం కేసులో కీలకంగా భావిస్తున్న తెలుగుదేశం పార్టీ నేత, ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని హర్షవర్దన్ చౌదరి ఇప్పటివరకు పత్తాలేకుండా పోయిన సంగతి తెలిసిందే. ఎన్‌ఐఏ విచారణకు హర్షవర్దన్ గైర్హాజరుపై శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో హర్షవర్దన్ శుక్రవారం ఎన్‌ఐఏ అధికారులకు అందుబాటులోకి వచ్చాడు. తనకు యాక్సిడెంట్ అయి కదల్లేని పరిస్థితుల్లో ఇంట్లోనే ఉన్నానని, ఆరోగ్యం కుదుటపడిన తర్వాత విచారణకు వచ్చి సహకరిస్తానని సమాచారం పంపాడు. ఎన్‌ఐఎ అధికారులు శుక్రవారం గాజువాకలోని హర్షవర్దన్ ఇంటికి వెళ్లి వీలైనంత త్వరగా విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించినట్టు సమాచారం.
జైలులో శ్రీనివాసరావుకు ప్రత్యేక సెల్
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావును విజయవాడ నుంచి రోడ్డు మార్గం ద్వారా శుక్రవారం రాత్రి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు పటిష్టమైన బందోబస్తు మధ్య తరలించారు. నిందితుడికి ప్రాణహాని ఉన్న దృష్ట్యా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఇతర ఖైదీలతో కలపకుండా ప్రత్యేకమైన సెల్(గది)లో అతడిని ఉంచుతున్నట్లు జైలు సూపరింటెండెంట్ సాయిరామ్ ప్రకాశ్ తెలిపారు. అతడిని సాధారణ ఖైదీల మాదిరిగానే పరిగణిస్తామని, అయితే ప్రాణహాని ఉందని నిందితుడు కోర్టుకు తెలియజేసిన నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు అతడిని ప్రత్యేక సెల్‌లో ఉంచి, నిరంతరం పర్యవేక్షించేందుకు ఒక గార్డును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment