ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ/ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు) : నాలుగేళ్ల కిందట విశాఖలోని ఓ వాణిజ్య సంస్థకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చర్యలు చేపట్టింది. కుంభకోణంతో సంబంధమున్న వ్యక్తులకు చెందిన రూ.18.67 కోట్లు విలువచేసే ఆస్తులను జప్తు చేసింది. ‘కాకా’ గ్రూపునకు చెందిన రూ.16.97 కోట్లు, శశి గోయెల్‌కు చెందిన రూ.1.50 కోట్లు, ప్రగతి ప్రింట్‌ప్యాక్ ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన రూ.20 లక్షలను జప్తుచేసినట్లు ఈడీ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. జప్తు చేసిన ఆస్తుల్లో వ్యవసాయ భూములతో పాటు వాణిజ్య స్థలాలు, ప్లాట్లు, స్థిర డిపాజిట్లు ఉన్నాయి.
2017లో హవాలా కుంభకోణం సమాచారంతో వడ్డి మహేష్ అనే వ్యక్తిని విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టుచేశారు. అనంతరం ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. పలువురు షెల్ కంపెనీలు సృష్టించి మనీలాండరింగ్ ద్వారా విదేశాలకు రూ.1,500 కోట్ల నగదు తరలించినట్లు ఈ కేసులో ప్రధాన అభియోగం. వడ్డి మహేష్ సమాచారంతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఈడీ దర్యాప్తు చేసి రెండు చార్జిషీట్లు వేసింది. గతంలో శశి గోయెల్ భర్త బీకే గోయెల్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించి గత ఏడాది సెప్టెంబర్ 3న అరెస్టు చేసింది. అంతకుముందు.. బీకే గోయెల్ అల్లుడు ఆయుష్ గోయెల్, యునైటెడ్ హిల్ (చైనా)కు చెందిన దీపక్ గోయెల్‌ను కూడా ఈడీ అరెస్టు చేయగా ప్రస్తుతం వారు బెయిల్‌పై ఉన్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment