Hawala scandal
-
మనీలాండరింగ్ కేసులో రూ.18.67 కోట్లు జప్తు
సాక్షి, న్యూఢిల్లీ/ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు) : నాలుగేళ్ల కిందట విశాఖలోని ఓ వాణిజ్య సంస్థకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చర్యలు చేపట్టింది. కుంభకోణంతో సంబంధమున్న వ్యక్తులకు చెందిన రూ.18.67 కోట్లు విలువచేసే ఆస్తులను జప్తు చేసింది. ‘కాకా’ గ్రూపునకు చెందిన రూ.16.97 కోట్లు, శశి గోయెల్‌కు చెందిన రూ.1.50 కోట్లు, ప్రగతి ప్రింట్‌ప్యాక్ ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన రూ.20 లక్షలను జప్తుచేసినట్లు ఈడీ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. జప్తు చేసిన ఆస్తుల్లో వ్యవసాయ భూములతో పాటు వాణిజ్య స్థలాలు, ప్లాట్లు, స్థిర డిపాజిట్లు ఉన్నాయి. 2017లో హవాలా కుంభకోణం సమాచారంతో వడ్డి మహేష్ అనే వ్యక్తిని విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టుచేశారు. అనంతరం ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. పలువురు షెల్ కంపెనీలు సృష్టించి మనీలాండరింగ్ ద్వారా విదేశాలకు రూ.1,500 కోట్ల నగదు తరలించినట్లు ఈ కేసులో ప్రధాన అభియోగం. వడ్డి మహేష్ సమాచారంతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఈడీ దర్యాప్తు చేసి రెండు చార్జిషీట్లు వేసింది. గతంలో శశి గోయెల్ భర్త బీకే గోయెల్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించి గత ఏడాది సెప్టెంబర్ 3న అరెస్టు చేసింది. అంతకుముందు.. బీకే గోయెల్ అల్లుడు ఆయుష్ గోయెల్, యునైటెడ్ హిల్ (చైనా)కు చెందిన దీపక్ గోయెల్‌ను కూడా ఈడీ అరెస్టు చేయగా ప్రస్తుతం వారు బెయిల్‌పై ఉన్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ తెలిపింది. -
బెజవాడలో ‘హవాలా’ జోరు!
సాక్షి, అమరావతి బ్యూరో : బెజవాడను హవాలా డబ్బు ముంచెత్తుతోంది. రాజధాని ఏర్పడిన అనంతరం..వివిధ వ్యాపార వర్గాలకు చెందిన బడాబాబులు తమ తమ వ్యాపకాలకు ఈ నగరాన్ని ఆవాసంగా మార్చుకుంటున్నారు. ఇటీవల కాలంలో అసాంఘిక కార్యకలాపాలకు విజయవాడ నగరం కేంద్రం కావడం ఆందోళన కలిగిస్తోంది. విజయవాడకు ముంబై రాజధాని నుంచి హవాలా మార్గం ద్వారా తరలించారని అనుమానిస్తున్న రూ. 1.25 కోట్లను మంగళవారం నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకోవడం ఇందుకు ఊతమిస్తోంది. కాగా, గుట్టు చప్పుడు కాకుండా ఎన్నో రెట్ల డబ్బు హవాలా మార్గంలో చేతులు మారుతోందని ‘సాక్షి’ మార్చి 24వతేదీన ‘కోడ్.. డీల్’ పేరిట ఓ కథనాన్ని ప్రచురించింది. అచ్చం ఆ కథనంలో సాక్షి పేర్కొన్నట్లుగానే ..స్వాధీనం చేసుకున్న డబ్బు హవాలా మార్గంలో వచ్చిందేననే అనుమానాన్ని పోలీసులు సైతం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే, హైదరాబాద్‌కు చెందిన మిర్చి వ్యాపారి అభినవ్‌రెడ్డి ఇటీవల తన వ్యాపారాన్ని ఏపీ రాజధాని ప్రాంతమైన విజయవాడకు విస్తరించారు. ఈ నేపథ్యంలో తన వద్ద నమ్మకంగా పనిచేస్తున్న విశాఖకు చెందిన నాగరాజుకు విజయవాడలోని వ్యాపారుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసే పనిని అప్పగించారు. రోజుకు రూ. 25 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు వసూలు చేయాల్సి ఉంటుంది. దీంతో నాగరాజు తనకు పరిచయమున్న విశాఖకు చెందిన రెడ్డిపల్లి కిశోర్ అలియాస్ నాని సహాయం తీసుకున్నాడు. ఇందుకోసం విజయవాడ నగరంలోని ఓ హోటల్లో రూమ్‌ను అద్దెకు తీసుకున్నారు. రోజూ వసూలు చేసి తీసుకొచ్చిన డబ్బును హోటల్ రూమ్‌లో ఉంచేవారు. అయితే ఆ డబ్బుకు కాపలా కోసం మరొకరిని పెట్టాలనే ఉద్దేశంతో నానికి తమ్ముడు వరుసైన దాస్‌ను విశాఖ నుంచి రప్పించి రూమ్‌లో కాపలా పెట్టారు. అసలే ఎన్నికల వేళ రూ.లక్షల్లో సొమ్మును నగరంలో అటూ ఇటూ తీసుకెళ్లడం ఇబ్బందిగా ఉంటుందని గ్రహించిన అభినవ్‌రెడ్డి ఓ రోజు నాగరాజుతో మాట్లాడుతూ డబ్బు తరలించే సమయంలో పోలీసులకు పట్టుబడితే రూ.నాలుగైదు లక్షలైతే ఎలాంటి హడావుడి చేయకుండా వదిలేయమని ఫోన్లో చెబుతుండగా నాని విన్నాడు. దీంతో నానికి ఈ డబ్బును కాజేయాలనే ఆలోచన వచ్చింది. వెంటనే తనకు ఇదివరకే పరిచయమున్న మైలవరానికి చెందిన రవీంద్రకు సమాచారమందించాడు. దీంతో రవీంద్ర తన స్నేహితులు హర్షవర్ధన్, భవానీ శంకర్, అమర్చంద్తో కలసి డబ్బు దోచుకునేందుకు పక్కా ప్రణాళిక రచించాడు. ఇందుకోసం పాతబస్తీ ప్రాంతంలో ఖాకీ దదుస్తులు, నల్లబూట్లు కొనుగోలు చేసి.. మార్చి 18, 19వ తేదీల్లో డబ్బు దోచుకునేందుకు రెండుసార్లు యత్నించి విఫలమయ్యారు. అయితే అదేనెల 22వ తేదీన నాగరాజు, నాని కలిసి రూ .30 లక్షలు హైదరాబాద్‌కు తీసుకెళుతుండగా వీరి వాహనాన్ని కొత్తూరు, తాడేపల్లి సమీపంలో హర్షవర్ధన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులమంటూ నిలిపేశాడు. తర్వాత రవీంద్రను సీఐగా హర్షవర్ధన్ పరిచయం చేయడం.. ఆ తర్వాత అదే వాహనంలో రూ.కోటి డబ్బులున్న బ్యాగు కోసం హోటల్‌కు చేరుకుని నాగరాజును కొట్టి ఆ బ్యాగును తీసుకెళ్లారు. దాస్‌ను కూడా వారి వాహనంలో తీసుకెళ్లి మధ్యలో వదిలేశారు. ఇదిలా ఉండగా.. మరోచోట దాచిన రూ.45 లక్షల బ్యాగుతో నాని రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. అయితే ఈ డబ్బును కూడా పోలీసులు పట్టుకెళ్లారని చెప్పి.. మనం పంచుకుందామని నాని ఆశ పెట్టడంతో నాగరాజు ఒప్పుకుని ఆ డబ్బును అంతా కలిసి పంచుకున్నారు. ఏడుగురు అరెస్టు.. టాస్క్‌ఫోర్స్ పోలీసుల పేరు చెప్పి రూ. 1.70 కోట్లు దోపిడీ చేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దోపిడీలో ప్రధాన నిందితుడు రవీంద్ర పరారీలో ఉన్నాడని.. నాని, భవానీశంకర్, హర్షవర్ధన్, అమర్‌చంద్, దాసు,నాగరాజును అరెస్టు చేసి రూ. 1.25 కోట్లు రికవరీ చేశామని సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. అభినవ్ ఫిర్యాదుతో బయటపడ్డ హవాలా మార్గం.. పోలీసుల పేరిట గుర్తు తెలియని వ్యక్తులు రూ. 1.70 కోట్లు దోచుకెళ్లడంతో మిర్చి వ్యాపారి అభినవ్‌రెడ్డి విజయవాడ రెండో పట్టణ పోలీసులకు మార్చి 26న ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు అనుమానంతో నాగరాజును పలు దఫాలు విచారించగా.. అసలు డబ్బును ఎలా వసూలు చేసేది.. ఎక్కడ ఉంచేది.. అందుకు ఎవరెవరు సాయం చేశారు అన్న వివరాలు వివరించాడు. ఆ తర్వాత అభినవ్‌ను విచారించగా.. తాను ముంబైకి చెందిన ఓ కంపెనీకి బ్యాంకు అకౌంట్ నంబరు ద్వారా రూ. కోటి జమ చేస్తే.. ఆ డబ్బును విజయవాడలో ఓ కోడ్‌ను ఉపయోగించి అందజేస్తారని వివరించాడు. దీంతో ఈ సొమ్ము హవాలా మార్గంలోనే నగరానికి వచ్చిందని పోలీసులు అనుమానిస్తున్నారు. గత పది రోజుల్లో ఈ మార్గం ద్వారా దాదాపు రూ. 7 కోట్లు నగరానికి వచ్చిందని సమాచారం. దీంతో ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని ఆదాయపన్ను శాఖకు, ఈడీ విభాగానికి తెలియజేస్తామని నగరపోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈ కేసును లోతుగా విచారిస్తాని.. ఎన్నికల నేపథ్యంలో పంపిణీ చేయడానికి వచ్చిన సొమ్ముగానే తాము అనుమానిస్తున్నామని.. విచారణలో పూర్తి విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. -
1000 కోట్ల హవాలా రాకెట్.. మరో ఇద్దరి అరెస్ట్
విశాఖ: హవాలా కుంభకోణం కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.1000 కోట్లకు పైగా హవాలా రాకెట్ నడిపిటన్లు పోలీసులు గుర్తించారు. అరెస్టయిన వ్యక్తులు అన్నదమ్ములు ఆచంట రాజేశ్, హరీశ్ అని పెరవలికి చెందిన వారని పోలీసులు వెల్లడించారు. మరోవైపు హవాలా కుంభకోణంలో ప్రధాన నిందితుడు వడ్డి మహేశ్‌ను అదుపులోకి తీసుకున్న విశాఖ పోలీసులు, ఐటీ అధికారులు కలిసి రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఇప్పటికే కొన్ని కీలక పత్రాలు, ఆధారాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్ నకిలీ ధ్రువపత్రాలతో 30 బ్యాంకులకు కచ్చుటోపీ పెట్టినట్లు సమాచారం. హైదరాబాద్, శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాల్లో 12 డొల్ల కంపెనీలు పెట్టి వాటి ద్వారా మహేశ్ ఈ హవాలా కుంభకోణం నడిపించాడు. కోల్‌కతా కేంద్రంగా సాగిన భారీ హవాలా కుంభకోణం బ్యాంకు లావాదేవీలు విశాఖ నుంచే ఎక్కువగా జరిగాయని విశాఖ శాంతి భద్రతల డీసీపీ నవీన్ గులాటి ఇదివరకే తెలిపారు. విశాఖ కేంద్రంగా హవాలా మార్గంలో కోట్లాది రూపాయలు విదేశాలకు తరలిపోయిన కేసులో 12 డొల్ల కంపెనీలున్నట్లు గుర్తించారు. బ్యాంకు అధికారుల పాత్రపై 3 ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నట్లు చెప్పిన పోలీసులు నేడు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కేసు తీవ్రత దృష్ట్యా సీబీఐకి బదిలీ చేసే అవకాశాలా కనిపిస్తున్నాయి. మహేశ్ తండ్రి శ్రీనివాసరావు అక్రమ వ్యాపారాలకు ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడితో సంబంధాల కోణంలోనూ విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. -
మంత్రి అచ్చెన్నఇలాకాలో ‘హవాలా’మహేశ్!
-
మంత్రి అచ్చెన్న ఇలాకాలో.. ‘హవాలా’మహేశ్!
సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: హవాలా కుంభకోణంలో ప్రధాన నిందితుడు వడ్డి మహేశ్, అతని తండ్రి శ్రీనివాసరావు అక్రమ వ్యాపారాలకు ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి ఇలాకాతోనూ సంబంధాలున్నాయని తెలిసింది. వీరు శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాళి మండలం కురుడు పరిధి రామయ్యపేటలో అక్రమంగా స్టోన్ క్రషర్ ఏర్పాటుకు ఏర్పాట్లు చేసుకున్నారు. శ్రీ పద్మప్రియ స్టోన్క్రషరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. దీనికి కార్యాలయంగా శ్రీకా కుళంలోని ఎల్బీఎస్ నగర్ కాలనీలోని ఓ అద్దె ఇల్లు చిరునామాగా ఉంది. విశాఖ నుంచి 4 రోజుల క్రితం ఆదాయపన్ను శాఖ అధికారులు వచ్చి ఈ ఇంట్లోనే తనిఖీ చేశారు. ఇక్కడి నుంచే వడ్డి శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ తండ్రీకొడుకులకు అధికారపార్టీ నేతlసోదరుడు అండగా ఉన్నారనే ఆరోపణలున్నాయి. వారి సాయంతో రెండేళ్ల క్రితం రామయ్యపేట వద్ద కొండపోరంబోకు స్థలం (సర్వే నంబరు 514)ను ఆక్రమించారు. ఇటీవల ఖరీదైన బెంజ్ కారు కొనడంతో ఆదాయపన్ను శాఖ అధికారులు మహేశ్‌పై దృష్టిపెట్టారు. డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరి శీలించి మహేశ్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకొని విశాఖపట్నం తీసుకువెళ్లినట్లు తెలిసింది.