1000 కోట్ల హవాలా రాకెట్.. మరో ఇద్దరి అరెస్ట్
విశాఖ: హవాలా కుంభకోణం కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.1000 కోట్లకు పైగా హవాలా రాకెట్ నడిపిటన్లు పోలీసులు గుర్తించారు. అరెస్టయిన వ్యక్తులు అన్నదమ్ములు ఆచంట రాజేశ్, హరీశ్ అని పెరవలికి చెందిన వారని పోలీసులు వెల్లడించారు. మరోవైపు హవాలా కుంభకోణంలో ప్రధాన నిందితుడు వడ్డి మహేశ్‌ను అదుపులోకి తీసుకున్న విశాఖ పోలీసులు, ఐటీ అధికారులు కలిసి రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఇప్పటికే కొన్ని కీలక పత్రాలు, ఆధారాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్ నకిలీ ధ్రువపత్రాలతో 30 బ్యాంకులకు కచ్చుటోపీ పెట్టినట్లు సమాచారం. హైదరాబాద్, శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాల్లో 12 డొల్ల కంపెనీలు పెట్టి వాటి ద్వారా మహేశ్ ఈ హవాలా కుంభకోణం నడిపించాడు.
కోల్‌కతా కేంద్రంగా సాగిన భారీ హవాలా కుంభకోణం బ్యాంకు లావాదేవీలు విశాఖ నుంచే ఎక్కువగా జరిగాయని విశాఖ శాంతి భద్రతల డీసీపీ నవీన్ గులాటి ఇదివరకే తెలిపారు. విశాఖ కేంద్రంగా హవాలా మార్గంలో కోట్లాది రూపాయలు విదేశాలకు తరలిపోయిన కేసులో 12 డొల్ల కంపెనీలున్నట్లు గుర్తించారు. బ్యాంకు అధికారుల పాత్రపై 3 ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నట్లు చెప్పిన పోలీసులు నేడు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కేసు తీవ్రత దృష్ట్యా సీబీఐకి బదిలీ చేసే అవకాశాలా కనిపిస్తున్నాయి. మహేశ్ తండ్రి శ్రీనివాసరావు అక్రమ వ్యాపారాలకు ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడితో సంబంధాల కోణంలోనూ విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.