మంత్రి అచ్చెన్న ఇలాకాలో.. ‘హవాలా’మహేశ్!
సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: హవాలా కుంభకోణంలో ప్రధాన నిందితుడు వడ్డి మహేశ్, అతని తండ్రి శ్రీనివాసరావు అక్రమ వ్యాపారాలకు ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి ఇలాకాతోనూ సంబంధాలున్నాయని తెలిసింది. వీరు శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాళి మండలం కురుడు పరిధి రామయ్యపేటలో అక్రమంగా స్టోన్ క్రషర్ ఏర్పాటుకు ఏర్పాట్లు చేసుకున్నారు. శ్రీ పద్మప్రియ స్టోన్‌క్రషరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. దీనికి కార్యాలయంగా శ్రీకా కుళంలోని ఎల్‌బీఎస్ నగర్ కాలనీలోని ఓ అద్దె ఇల్లు చిరునామాగా ఉంది. విశాఖ నుంచి 4 రోజుల క్రితం ఆదాయపన్ను శాఖ అధికారులు వచ్చి ఈ ఇంట్లోనే తనిఖీ చేశారు.
ఇక్కడి నుంచే వడ్డి శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ తండ్రీకొడుకులకు అధికారపార్టీ నేతlసోదరుడు అండగా ఉన్నారనే ఆరోపణలున్నాయి. వారి సాయంతో రెండేళ్ల క్రితం రామయ్యపేట వద్ద కొండపోరంబోకు స్థలం (సర్వే నంబరు 514)ను ఆక్రమించారు. ఇటీవల ఖరీదైన బెంజ్ కారు కొనడంతో ఆదాయపన్ను శాఖ అధికారులు మహేశ్‌పై దృష్టిపెట్టారు. డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరి శీలించి మహేశ్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకొని విశాఖపట్నం తీసుకువెళ్లినట్లు తెలిసింది.