మహేశ్‌దే కీలక పాత్ర: నవీన్ గులాటి
విశాఖ : రూ.1000 కోట్లకు పైగా హవాలా రూపంలో విదేశాలకు తరలించిన కేసులో విచారణ కొనసాగుతోందని డీసీపీ నవీన్ గులాటి తెలిపారు. ఈ కేసు వివరాలను డీసీపీ నవీన్ గులాటి శనివారం మీడియాకు వివరించారు. ఈ హవాలా వ్యవహారంలో వడ్డి మహేశ్‌దే కీలక పాత్ర అని ఆయన తెలిపారు. ఐటీ అధికారుల సాయంతో విచారణ చేస్తున్నామని, సుమారు 30 బ్యాంకుల్లో అకౌంట్లు తెరిచినట్లు చెప్పారు. విశాఖ, శ్రీకాకుళం, కోల్‌కతాలో బోగస్ కంపెనీలు ఏర్పాటు చేసి హాంకాంగ్, చైనా, సింగపూర్‌లకు డబ్బు తరలించినట్లు వెల్లడించారు.
కాగా ఆదాయపన్ను శాఖ ఫిర్యాదుతో వెలుగు చూసిన ఈ వ్యవహారం ప్రస్తుతం ఉత్తరాంధ్రలో సంచలనం రేపుతోంది. శ్రీకాకుళం నుంచి కోల్‌కతాకు వెళ్లి అక్కడ స్థిరపడిన వడ్డి మహేశ్, అతని తండ్రి వడ్డి శ్రీనివాసరావు, ఆచంట హరీష్, చింతా రాజేష్, ప్రశాంత్‌కుమార్‌రాయ్ బర్మన్, ప్రవీణ్‌కుమార్ ఝా, ఆయిష్ గోయల్, వినీత్ గోయంకా, విక్రాంత్ గుప్తాలు విశాఖపట్నం, శ్రీకాకుళం, కోల్‌కతాల్లో 12 బోగస్ కంపెనీలు, భాగస్వామ్య కంపెనీలు ప్రారంభించి, వాటి ద్వారా డబ్బును హవాలా మార్గంలో విదేశాలకు తరలించిన విషయం తెలిసిందే.