రూ.1000 కోట్ల హవాలా రాకెట్ గుట్టురట్టు
- విశాఖ, శ్రీకాకుళం, కోల్‌కతాల్లో షెల్ కంపెనీలు
- హాంకాంగ్, చైనా, సింగపూర్‌లకు డబ్బు తరలింపు
- కీలక పాత్రధారి 24 ఏళ్ల యువకుడు
- విశాఖ పోలీసులకు ఐటీ శాఖ ఫిర్యాదు
- విస్తృతంగా దర్యాప్తు చేస్తున్న అధికారులు
సాక్షి, విశాఖపట్నం: భారీ హవాలా రాకెట్ గుట్టు రట్టయ్యింది. రూ.1000 కోట్లకు పైగా హవాలా రూపంలో విదేశాలకు తరలించిన ఘరానా మోసగాళ్లపై విశాఖలో కేసు నమోదైంది. ఆదాయపన్ను శాఖ ఫిర్యాదుతో వెలుగు చూసిన ఈ వ్యవహారం సంచలనం రేపుతోంది. షెల్ (బోగస్) కంపెనీలు, తప్పుడు ధ్రువపత్రాలతో కొన్నేళ్లుగా 30 బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి ఈ రాకెట్‌ను నడిపిస్తున్నారు. నిందితుల్లో ఎక్కువమంది ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా.. 24 ఏళ్ల యువకుడు కీలక పాత్రధారి కావడం విశేషం.
12 బోగస్ కంపెనీలు: విశాఖ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం నుంచి కోల్‌కతాకు వెళ్లి అక్కడ స్థిరపడిన వడ్డి మహేశ్, అతని తండ్రి వడ్డి శ్రీనివాసరావు, ఆచంట హరీష్, చింతా రాజేష్, ప్రశాంత్‌కుమార్‌రాయ్ బర్మన్, ప్రవీణ్‌కుమార్ ఝా, ఆయిష్ గోయల్, వినీత్ గోయంకా, విక్రాంత్ గుప్తాలు విశాఖపట్నం, శ్రీకాకుళం, కోల్‌కతాల్లో 12 బోగస్ కంపెనీలు, భాగస్వామ్య కంపెనీలు ప్రారంభించారు. వీటికోసం 30 బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు. వీటిలో ఎనిమిది ఖాతాల్లో రూ. 578 కోట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రూ. 569.93 కోట్లతో చైనా, సింగపూర్, హాంకాంగ్ దేశాల నుండి సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేసినట్లు నిందితులు తప్పుడు పత్రాలు సమర్పించారు.
అయితే ఎలాంటి కొనుగోళ్లు చేయకుండానే ఆ సొమ్మును హవాలా మార్గంలో విదేశాలకు తరలించారని ఆదాయపు పన్ను శాఖ అధికారులు గుర్తించారు. ఇతర రకాల చెల్లింపుల ద్వారా మరో రూ. 572 కోట్లు హవాలా చేసినట్లు తేలింది. ఈ అక్రమాలపై విశాఖ ఆదాయపు పన్నుశాఖ అధికారి ఎం.వి.ఎన్. శేషుభావనారాయణ గురువారం రాత్రి విశాఖ ఎంవీపీ జోన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై ప్రొవిజన్ ఆఫ్ పీఎంఎల్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నకిలీ పత్రాలతో బ్యాంకులకు టోపీ: విశాఖ, శ్రీకాకుళం, కోల్‌కతాల్లో ఉన్న పలు కంపెనీలు, వాటి యజమానుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. లావాదేవీలు, నగదు బదిలీలు నిర్వహించడానికి షెల్, నకిలీ సంస్థలను సృష్టించడాన్ని, బ్యాంకింగ్ మార్గాలను ఉపయోగించి రెండేళ్లుగా నగదు తరలించడాన్ని ప్రాథమిక దర్యాప్తులో ఐటీ అధికారులు గుర్తించారు. అంతేకాదు ఈ సంస్థ సమర్పించిన పత్రాలన్నీ నకిలీవిగా గుర్తించింది. ఈ కుంభకోణంలో ఎ1 నిందితుడు ఎంటెక్ చదవడం విశేషం. అతను తన తండ్రితో కలిసి విదేశాలకు నగదు బదిలీ చేస్తూ.. డాలరుకు 85 పైసలు చొప్పున కమీషన్ రూపంలో వసూలు చేస్తున్నాడు.
ఆ సొమ్మును కొన్ని స్థిరాస్తుల్లో పెట్టుబడి పెట్టారు. ఆ వివరాలను రాబట్టేందుకు దర్యాప్తు జరుగుతోందని ఐటీ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. నకిలీ పత్రాలతో ఎన్‌ఇఎఫ్‌టి, ఆర్‌టీజీఎస్ వ్యవస్థల ద్వారా చెల్లింపులు జరిగినట్లు అధికారులు వివరించారు. ఈడీ, కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ దర్యాప్తు జరిపిన అనంతరం పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఆదాయపన్ను శాఖ వర్గాలు తెలిపాయి.