![Types of transactions that may trigger a income tax notice if they exceed specified thresholds](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/6/tax01.jpg.webp?itok=SWKqVzN-)
డిజిటల్ ఇండియా(Digital India) యుగంలో చాలామంది ఆన్‌లైన్ నగదు లావాదేవీలు జరుపుతున్నారు. చిన్నమొత్తంలో జరిపే లావాదేవీల సంగతి అటుంచితే, పెద్దమొత్తంలో చేసే నగదు బదిలీలపై ప్రభుత్వం నిఘా వేస్తోంది. ఈ నగదు బదిలీల విషయంలో ఎవరైనా సరే నిబంధనలు అతిక్రమిస్తున్నట్లు ప్రభుత్వ పన్నుల యంత్రాంగం గుర్తిస్తే వారికి ఆదాయ పన్నుశాఖ నోటీసులు(IT Notices) తప్పవు. అయితే ఎలాంటి సందర్భాల్లో నోటీసులు అందుతాయో కొన్నింటి గురించి తెలుసుకుందాం.
బ్యాంకు ఖాతాలో నగదు జమ
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) నిబంధనల ప్రకారం, ఎవరైనా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే, దానికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖకు సమాచారం వెళ్తుంది. ఈ డబ్బు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాల్లో జమ చేసినా కొన్నిసార్లు నోటీసులు అందుకునే అవకాశం ఉంది. నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ డబ్బు డిపాజిట్ చేస్తే ఆదాయపు పన్ను శాఖకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో జమ చేయడం
ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేసినప్పుడు నోటీసులు అందుతున్నట్లే, ఫిక్స్‌డ్ డిపాజిట్(Fixed Deposite)ల విషయంలోనూ అదే జరుగుతుంది. ఆర్థిక సంవత్సరంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎఫ్‌డీలలో రూ.10 లక్షల కంటే అధికంగా డిపాజిట్ చేస్తే కొన్నిసార్లు ఆదాయపు పన్ను శాఖ నోటీసు అందవచ్చు.
ఆస్తి లావాదేవీలు
స్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు రూ.30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు లావాదేవీలు జరిపినట్లయితే రిజిస్ట్రార్ ఖచ్చితంగా ఈ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖకు తెలియజేస్తారు. అటువంటి పరిస్థితిలో భారీ లావాదేవీలు జరిపారు కాబట్టి, ఆ డబ్బు మీకు ఎలా సమకూరిందనే వివరాలు అడుగుతూ ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపవచ్చు.
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులు
క్రెడిట్ కార్డ్ బిల్లు(Credit card Bill) రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని నగదు రూపంలో చెల్లిస్తే ఆ డబ్బు ఎలా సమకూరిందో ప్రభుత్వం అడగొచ్చు. మరోవైపు, ఏ ఆర్థిక సంవత్సరంలో అయినా మొత్తం కలిపి రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ పేమెంట్ చెల్లించినట్లయితే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఆదాయపు పన్ను శాఖ మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: మానసిక ఆరోగ్యానికీ బీమా ధీమా
షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, డిబెంచర్ల కొనుగోలు
షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, డిబెంచర్లు లేదా బాండ్లను కొనుగోలు చేయడానికి పెద్ద మొత్తంలో నగదు ఉపయోగించినట్లయితే ఇది ఆదాయపు పన్ను శాఖకు సమాచారం వెళ్తుంది. ఒక వ్యక్తి రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలు చేస్తే దానికి సంబంధించిన సమాచారం ప్రభుత్వం వద్ద నమోదు అవుతుంది. ఆ సందర్భంలోనూ నోటీసులు అందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment