ప్రస్తుతం మానసిక ఆరోగ్యాన్ని(Mental health) పరిరక్షించుకోవడమనేది సవాలుగా మారుతోంది. శారీరక ఆరోగ్యం(Health)తో సమానంగా దీనికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలపై అవగాహన పెరుగుతుండటంతో వీటిని సైతం ఇప్పుడు తీవ్రమైన ఆరోగ్య సమస్యలుగా గుర్తిస్తున్నారు. అయితే, ఇందుకు అవసరమైన సహాయాన్ని పొందడానికి మాత్రం ఆర్థిక సమస్యలు అడ్డంకిగా ఉంటున్నాయి. ఆరోగ్య బీమా సంస్థలు తమ పథకాల్లో మానసిక ఆరోగ్య కవరేజీని చేర్చడం ప్రారంభించాయి. దీనితో కౌన్సిలింగ్, థెరపీ, ప్రివెంటివ్ కేర్ వంటి ముఖ్యమైన సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. దీర్ఘకాలంలో ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యానికి సహాయకరంగా ఉంటున్నాయి.
ఆరోగ్య బీమా(health insurance) ప్లాన్ ఎంపిక చేసుకునేటప్పుడు, అది అందించే కవరేజీ, ప్రయోజనాల గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. అలా పరిశీలించతగిన కొన్ని ముఖ్యాంశాలు ఏమిటంటే..
సమగ్ర కవరేజీ
కౌన్సిలింగ్, థెరపీ సెషన్లు వంటి మానసిక ఆరోగ్య సేవలను కవర్ చేసేవిగా పథకాలు ఉండాలి. సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులను కలిసే అవకాశాన్ని కల్పించాలి. టెలిమెడిసిన్ వంటి సౌకర్యాలు కూడా ఉండాలి. దీంతో దూరప్రాంతాల్లో ఉన్నవారు కూడా డాక్టర్లతో ఆన్‌లైన్‌లో సంప్రదించేందుకు వీలవుతుంది. అదనంగా, ఔట్‌పేషంట్ డిపార్ట్‌మెంట్ (ఓపేడీ) కవరేజీ ఉంటే ఆసుపత్రిలో చేరే అవసరం లేకుండా డాక్టర్ను సందర్శించవచ్చు, ఇది సమయంతో పాటు డబ్బును కూడా ఆదా చేస్తుంది.
వెల్‌నెస్ ప్రోగ్రాంలు
అనేక బీమా కంపెనీలు ఇప్పుడు తమ పథకాలలో వెల్‌నెస్ ప్రోగ్రాంలను చేరుస్తున్నాయి. ఇవి మైండ్‌ఫుల్‌నెస్ సెషన్లు, ఒత్తిడిని అధిగమించేందుకు వర్క్‌షాప్‌లు నిర్వహించడం లేదా ఫిట్నెస్‌పరమైన ప్రోత్సాహకాలను అందించడం ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపర్చేవిగా ఉంటున్నాయి. ఉచిత యోగా తరగతులు, జిమ్ మెంబర్‌షిప్‌లు లేదా వెల్‌నెస్ యాప్(Wellness App)లకు యాక్సెస్ వంటి ప్రయోజనాలను కూడా కొన్ని పథకాలు అందిస్తున్నాయి.
హోమ్ హెల్త్‌కేర్ సేవలు
దీర్ఘకాలిక సమస్యలు లేదా మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నవారికి క్లినిక్‌లకు ప్రయాణించడం కష్టంగా ఉంటుంది. అలాంటి వారికి హోమ్ హెల్త్‌కేర్ ప్రయోజనాలు ఉన్న పాలసీలు ఉపయోగకరంగా ఉంటాయి. ఇంటి వద్దే సంరక్షణ సేవలను సౌకర్యవంతంగా అందుకునేందుకు ఈ పాలసీలు సహాయపడతాయి.
ఇన్సెంటివ్‌లు, రివార్డులు
కొన్ని బీమా పథకాలు ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహిస్తూ రివార్డులు అందిస్తాయి. ఉదాహరణకు, మీరు రెగ్యులర్ హెల్త్ చెక్–అప్స్ చేయడం లేదా ఫిట్నెస్ లక్ష్యాలను చేరుకోవడం ద్వారా రెన్యువల్‌పై డిస్కౌంట్ పొందవచ్చు. కొన్ని పథకాలు వాకింగ్ లేదా వ్యాయామం మొదలైన వాటికి పాయింట్లు అందిస్తాయి. వీటిని తరువాత రిడీమ్
చేసుకోవచ్చు.
వెల్నెస్ ప్రోగ్రాంలు
ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించేందుకు తోడ్పడే వెల్నెస్ ప్రోగ్రాంలు, ప్రివెంటివ్ కేర్‌లాంటివి అందించే పాలసీ(Policy)లను ఎంచుకోవాలి. డిస్కౌంట్లు, రివార్డులు మొదలైనవి ఇచ్చే పాలసీల వల్ల బీమా వ్యయం తగ్గడంతో పాటు ఆరోగ్యకరమైన అలవాట్లు కూడా అలవడతాయి. డబ్బూ ఆదా అవుతుంది. ఇక టెలిమెడిసిన్, హోమ్ హెల్త్‌కేర్ ఫీచర్లు సత్వరం సేవలను పొందడాన్ని సులభతరం చేస్తాయి.
ఇదీ చదవండి: ఫండ్స్ కటాఫ్ సమయం ఎప్పుడు?
మానసిక ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయడనేది మరింత పెద్ద సమస్యలకు దారితీయొచ్చు. చికిత్స చేయకపోవడం వల్ల పలు రకాల పరిస్థితులు రోజువారీ జీవితానికి అడ్డంకులుగా మారతాయి. సంబంధాలను నాశనం చేస్తాయి. అలాగే, ఇతర ఆరోగ్య సమస్యలను మరింత తీవ్రం చేస్తాయి. డాక్టర్లను పదే పదే కలవాల్సి రావడం వల్ల, అలాగే ఎమర్జెన్సీ కవరేజీ అవసరాల వల్ల ఆర్థికంగా కూడా ఇది మరిన్ని ఖర్చులకు దారి తీస్తుంది. కాబట్టి తగినంత కవరేజీ ఉండే పాలసీని ఎంచుకోవడం వల్ల భావోద్వేగాలపరంగానూ, ఆర్థికంగాను సవాళ్లను అధిగమించేందుకు సహాయకరంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment