లిక్విడ్ ఫండ్‌లో ఉన్న నా పెట్టుబడులను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు విక్రయించినట్టయితే, అదే రోజు ఎన్‌ఏవీ వర్తిస్తుందా? – అజయ్ కుమార్
ఏ తరహా మ్యూచువల్ ఫండ్(Mutual Funds)లో పెట్టుబడులు ఉన్నాయి..ఏ సమయంలో అభ్యర్థన (కొనుగోలు/విక్రయం) పంపించారన్న దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీరు లిక్విడ్ ఫండ్ పెట్టుబడులను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు విక్రయించేందుకు ఆర్డర్ చేశారని అనుకుందాం. లిక్విడ్ ఫండ్స్‌కు కటాఫ్ సమయం మధ్యాహ్నం 3 గంటలు. మీ అభ్యర్థన ఈ సమయానికి ముందే చేశారు కనుక, విక్రయించిన యూనిట్లకు శుక్రవారం నాటి ఎన్‌ఏవీ వర్తిస్తుంది. ఇలా విక్రయించిన పెట్టుబడులు బ్యాంక్ అకౌంట్(Bank Account)లోకి వచ్చేందుకు ఎంత సమయం పడుతుంది? అన్నది తెలుసుకుందాం. ఈ విషయంలోనూ ఏ ఫండ్‌లో పెట్టుబడులు విక్రయించారన్నది కీలకం అవుతుంది. లిక్విడ్ ఫండ్, ఓవర్‌నైట్ ఫండ్‌లో పెట్టుబడులను విక్రయించినప్పుడు ఆ మొత్తం ఇన్వెస్టర్ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యేందుకు ఒక పనిదినం పడుతుంది. ఇతర డెట్ ఫండ్స్ అయితే, రెండు రోజుల సమయం తీసుకుంటుంది. అదే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు వెనక్కి వచ్చేందుకు మూడు పనిదినాలు పడుతుంది. టీప్లస్ రూపంలో ఈ విషయాన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఇన్వెస్టర్లకు తెలియజేస్తాయి.
ఉదాహరణకు సోమవారం నాడు ఈక్విటీ ఫండ్స్(Equity Funds)లో పెట్టుబడులు విక్రయించారని అనుకుంటే, ఈ మొత్తం గురువారం నాడు బ్యాంక్ అకౌంట్‌లో జమ అవుతుంది. రియలైజింగ్ మనీ అంటే.. ఇన్వెస్టర్ కొనుగోలు ఆర్డర్‌కు సంబంధించిన మొత్తం మ్యూచువల్ ఫండ్స్ సంస్థ (AMC) అందుకోవడం. బ్యాంక్ నుంచి పంపించారనుకుంటే ఆ మొత్తం ఏఎంసీ చేరేందుకు కొన్ని గంటలు లేదా రోజు సమయం తీసుకోవచ్చు. కొనుగోలు ఏ రోజు చేశారన్న దానితో సంబంధం లేకుండా, ఏఎంసీకి ఆ మొత్తం అందిన రోజు ఎన్‌ఏవీనే పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు లిక్విడ్ ఫండ్‌లో పెట్టుబడులను కటాఫ్ సమయం 3 గంటలు దాటిన తర్వాత విక్రయించారని అనుకుంటే, అప్పుడు తర్వాతి రోజు ఎన్‌ఏవీ పెట్టుబడులకు వర్తిస్తుంది. ఎందుకంటే తర్వాతి రోజునే ఫండ్స్ సంస్థలు ఆ మేరకు విక్రయాలు చేస్తాయి.
ఇదీ చదవండి: క్రెడిట్ కార్డు Vs ఛార్జ్ కార్డు.. ఏంటీ ఛార్జ్ కార్డు..
నాకు ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ రెగ్యులర్ ప్లాన్‌లో పెట్టుబడులు ఉన్నాయి. వాటిని ఇటీవలే విక్రయించి అదే పథకం డైరెక్ట్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేశాను. కనుక లాభాలపై నేను పన్ను చెల్లించాలా? లేక భవిష్యత్తులో పెట్టుబడులు విక్రయించినప్పుడు పన్ను చెల్లించాల్సి వస్తుందా? – రాజన్ పీ.ఏ
ఒక మ్యూచువల్ ఫండ్ ప్లాన్ నుంచి మరో ప్లాన్‌లోకి మారినప్పుడు, అది రెగ్యులర్ నుంచి డైరెక్ట్ ప్లాన్ అయినా సరే దాన్ని పెట్టుబడి ఉపసంహరణగానే చూస్తారు. ఆదాయపన్ను చట్టం కింద పెట్టుబడుల విక్రయమే అవుతుంది. దీనర్థం.. మూలధన లాభాలపై మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని మరో ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేసి, భవిష్యత్తులో విక్రయించినట్టయితే.. హోల్డింగ్ పీరియడ్ (ఎంత కాలం పాటు పెట్టుబడులు కొనసాగించారు), వచ్చిన మూలధన లాభాల ఆధారంగా తిరిగి అప్పుడు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పెట్టుబడి నుంచి విక్రయం మధ్య కాలానికి పన్ను వర్తిస్తుందని అర్థం చేసుకోవాలి.
-ధీరేంద్ర కుమార్, సీఈఓ వాల్యూ రీసెర్చ్
Comments
Please login to add a commentAdd a comment