నెలవారీ వేతన జీవులతోపాటు చాలామంది వద్ద సాధారణంగా క్రెడిట్ కార్డు ఉండడం గమనిస్తుంటారు. అత్యవసర సమయాల్లో ఆర్థికంగా ఆదుకుంటుందనే ధీమాతో ఈ కార్డును తీసుకుంటారు. బిల్లు జనరేట్ అయ్యాక పూర్తి పేమెంట్ లేదా అత్యవసర సమయాల్లో మినియం బిల్లును చెల్లిస్తుంటారు. క్రెడిట్ కార్డు(Credit Card)లాగే కొన్ని బ్యాంకులు ఛార్జ్ కార్డు(Charge Card)లను జారీ చేస్తాయి. అయితే ఈ రెండింటి వినియోగంలో కొన్ని తేడాలున్నాయి. అసలు ఛార్జ్ కార్డులు ఎవరికి జారీ చేస్తారు.. పేమెంట్ నియమాలు ఎలా ఉంటాయి..ఛార్జ్ కార్డు నిజంగా ఎవరికి అవసరమో తెలుసుకుందాం.
ఛార్జ్ కార్డులు
ఛార్జ్ కార్డు అనేది ఒక రకమైన చెల్లింపు కార్డు. ఎలాంటి ముందస్తు లిమిట్ పరిమితులు లేకుండా దీన్ని జారీ చేస్తారు. ప్రతి బిల్లింగ్ సైకిల్‌లో కొనుగోళ్లు చేయడానికి క్రెడిట్ కార్డులాగే దీన్ని వినియోగించవచ్చు. అయితే దీని వినియోగంలో పరిమితి ఉండదు కాబట్టి ఎంతైనా వాడుకోవచ్చు. కానీ బిల్లు సైకిల్ పూర్తి అయ్యేలోపు మొత్తం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సకాలంలో పూర్తి బ్యాలెన్స్ చెల్లించడంలో విఫలమైతే మాత్రం భారీ మొత్తంలో ఫీజులు చెల్లించాలి. క్రెడిట్ కార్డుల మాదిరిగానే ఛార్జ్ కార్డుల వినియోగంపై ట్రావెల్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్, వివిధ రివార్డు పాయింట్లు ఇతర ప్రయోజనాలు అందిస్తారు.
క్రెడిట్ కార్డు, ఛార్జ్ కార్డు మధ్య ప్రధాన తేడాలు
క్రెడిట్ లిమిట్
క్రెడిట్ కార్డులో ముందుగా సెట్ చేసిన లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ కంటే తక్కువే వాడుకోవాలి. కానీ ఛార్జ్ కార్డులో వ్యయ పరిమితి ఉండదు. ఎంతైనా వాడుకోవచ్చు. కానీ బిల్లు జనరేట్ అయ్యాక మాత్రం పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ పేమెంట్ చేయడంలో విఫలమైతే మాత్రం భారీగా ఛార్జీలు విధిస్తారు.
బ్యాలెన్స్ పేమెంట్
కనీస నెలవారీ చెల్లింపులకు క్రెడిట్ కార్డులో అవకాశం ఉంటుంది. కానీ ఛార్జ్ కార్డులో ఈ సదుపాయం ఉండదు. ప్రతి బిల్లింగ్ సైకిల్(Billing Cycle)లో పూర్తి బ్యాలెన్స్ చెల్లించాలి.
వడ్డీ(Interest)
మినిమం బ్యాలెన్స్ చెల్లించిన తర్వాత మిగతా చెల్లించాల్సిన దానికి క్రెడిట్ కార్డులో వడ్డీ విధిస్తారు. ఛార్జ్ కార్డులో అసలు ఆ సదుపాయమే ఉండదు.
వార్షిక ఫీజులు
వార్షిక రుసుములు, ఆలస్య రుసుములు, వడ్డీ రేట్లు క్రెడిట్ కార్డులకు ఉంటాయి. ఛార్జ్ కార్డులకు కూడా వార్షిక రుసుము ఉంటుంది. అది క్రెడిట్ కార్డు రుసుముతో పోలిస్తే భారీగా ఉంటుంది. ఆలస్య రుసుము కూడా అధికంగానే విధిస్తారు.
రివార్డులు
క్రెడిట్ కార్డులు, ఛార్జ్ కార్డులు రెండింటిలోనూ క్యాష్ బ్యాక్, ట్రావెల్ పాయింట్స్(Travel Points), రివార్డు ప్రోగ్రామ్‌లు ఉంటాయి. ఛార్జ్ కార్డుల్లో ఇవి కొంత అధికంగా ఉంటాయి. బ్యాంకును అనుసరించి ఈ పాయింట్లు మారుతుంటాయి.
ఛార్జ్ కార్డుకు అర్హులెవరు..
అద్భుతమైన క్రెడిట్ స్కోర్: ఛార్జ్ కార్డ్ జారీ చేసేవారు సాధారణంగా అద్భుతమైన క్రెడిట్ స్కోర్ ఉన్న దరఖాస్తుదారుల కోసం చూస్తారు. సాధారణంగా 700 లేదా అంతకంటే ఎక్కువ ఉంటేనే దీన్ని జారీ చేసే అవకాశం ఉంటుంది.
స్థిరమైన ఆదాయం: ప్రతి నెలా బ్యాలెన్స్ పూర్తిగా చెల్లించగలరని నిరూపించడానికి స్థిరమైన, గణనీయమైన ఆదాయాన్ని చూపించాల్సి ఉంటుంది.
స్ట్రాంగ్ క్రెడిట్ హిస్టరీ: సకాలంలో చెల్లింపులు జరిపే ట్రాక్ రికార్డ్ ఉన్న క్రెడిట్ హిస్టరీ చాలా ముఖ్యం.
తక్కువ రుణ-ఆదాయ నిష్పత్తి: రుణదాతలు తక్కువ రుణ-ఆదాయ నిష్పత్తి(ఆదాయం ఎక్కువ ఉండి రుణాలపై తక్కువగా ఆధారపడడం) ఉన్న దరఖాస్తుదారులకు ప్రాధాన్యం ఇస్తారు.
రెసిడెన్సీ స్టేటస్: ఛార్జ్ కార్డు కోసం దరఖాస్తు చేయాలనుకుంటే మీరు ఏ దేశంలో అప్లై చేస్తున్నారో ఆ దేశ పౌరసత్వాన్ని కలిగి ఉండాలి.
ఇదీ చదవండి: జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన మార్పులు ఇవే..
ఇస్తున్నారు కదా అని..
క్రెడిట్ కార్డు, ఛార్జ్ కార్డు.. ఏ కార్డు తీసుకున్నా అప్పు ఎప్పుటికీ మంచిదికాదు. తప్పని పరిస్థితుల్లో అప్పు చేసినా బిల్లు సైకిల్‌లోపు దాన్ని తిరిగి పూర్తిగా చెల్లించే ఆర్థిక సత్తా సంపాదించాలి. బ్యాంకువారు లేదా వేరొకరు ఇస్తున్నారు కదా అని అప్పు చేస్తే తిరిగి అది చెల్లించలేకపోతే తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment