ఏపీజీవీబీకి రూ.352 కోట్ల నికర లాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీబీ) 2016–17లో రూ.352 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 57.5 శాతం ఎక్కువ. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ఈ స్థాయిలో ఫలితాలను నమోదు చేయడం భారత్‌లో ఇదే తొలిసారి అని ఏపీజీవీబీ చైర్మన్ వి.నర్సిరెడ్డి గురువారమిక్కడ మీడియాకు తెలిపారు.
ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్లు 25.65 శాతం అధికమై రూ.12,818 కోట్లుగా ఉంది. అడ్వాన్సులు 16.66 శాతం పెరిగి రూ.12,368 కోట్లకు చేరాయి. మొత్తం వ్యాపారం రూ.20,804 కోట్ల నుంచి రూ.25,187 కోట్లను తాకింది. నికర నిరర్ధక ఆస్తులు 2.38 నుంచి 1.69 శాతానికి చేరాయి. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఎం) 3.58 నుంచి 3.86 శాతానికి చేరింది. ఎన్‌ఐఎం వల్లే ఉత్తమ ఫలితాలను నమోదు చేసినట్టు బ్యాంకు తెలిపింది.
అట్రిషన్ కారణంగా..
ప్రస్తుతం బ్యాంకుకు 4,500 మంది సిబ్బంది అవసరం. ఉన్న ఉద్యోగుల సంఖ్య 3,012 మాత్రమే. 2016–17లో 275 మంది కొత్తవారు కావాలని ఐబీపీఎస్‌ను కోరితే, 193 మంది రిపోర్టు చేశారు. వీరిలో 83 మంది రాజీనామా చేశారు. 2017–18కి 485 మందిని కోరితే, 215 మంది రిపోర్టు చేశారు. వీరిలో 19 మంది రాజీనామా చేశారు. కొత్తవారి రాజీనామా, ఉద్యోగుల పదవీ విరమణతో సిబ్బంది కొరత ఏర్పడి బ్యాంకుకు తలనొప్పిగా మారింది. ఏది ఏమైనప్పటికీ ఈ ఏడాది కొత్తగా 45 శాఖలను తెరుస్తామని నర్సిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.